అమరావతి: ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో శనివారం(అక్టోబర్11) నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారి ఈ నెల 17 నాటికి ఏపీలోనే తీరం దాటవచ్చని తెలుస్తోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ నెల15,16 తేదీల్లో దక్షిణ కోస్తా-ఉత్తర తమిళనాడు మధ్య తీరం తాకవచ్చని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ఏర్పడిన తరువాత దీని కదలిక పైన పూర్తి స్పష్టత వస్తుందని వెల్లడించారు. ఈ ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో ఏపీలోకి దక్షిణ కోస్తా ప్రాంతంలో పాటుగా ఉత్తర తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
గత కొద్ది రోజులుగా ఏపీని వర్షాలు వణికిస్తున్న విషయం తెలిసిందే. వరుస తుపానుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. నదులు, వాంగులువంకలు పొంగిపొర్లి ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదల కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టాల నుంచి తేరుకోకముందే మరోసారి ఏపీలో భారీ వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.