- రాష్ట్ర సబ్సిడీకి , ఈ కేవైసీకి సంబంధం లేదన్న డీలర్లు
అచ్చంపేట, వెలుగు: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులంతా ఆధార్ కార్డు, గ్యాస్ బుక్ తో ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని 10 రోజుల కింద ఒక సర్క్యులర్ జారీ చేసింది. మరణించిన వారి పేరిట ఉన్న కనెక్షన్లపై కొంతమంది గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్నారని, అవి పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే, ఈ నెల 3వ తేదీ వరకు ఎన్నికల కోడ్అమలులో ఉండడంతో ఈ –కేవైసీపై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి రాగా, అంతకుముందే ఆరు గ్యారంటీల్లో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ఇస్తామని ప్రకటించింది. దీంతో వినియోగదారులంతా ఈ–కేవైసీ చేసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ రాదనే అపోహతో గ్యాస్సెంటర్ల ముందు బారులు తీరుతున్నారు. –
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ ముందు కూడా ఇలాగే రెండు రోజులుగా భారీ లైన్లు కడుతున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీకి, ఈ–కేవైసీకి సంబంధం లేదని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్థానిక గ్యాస్ డీలర్ గోపాల్ యాదవ్ చెప్పారు. దీనికి గడువు తేదీ అంటూ ఏదీ లేదని, ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ–కేవైసీ చేసుకోవాలని చెప్పారు. అచ్చంపేట డివిజన్ పరిధిలో 28 వేలకు పైచిలుకు భారత్ గ్యాస్ వినియోగదారులుండగా.. ఇప్పటివరకు మూడు మెషీన్ల ద్వారా నాలుగు వేల ఈ కేవైసీలు మాత్రమే పూర్తి చేశామన్నారు.