వొండ్రుసోవాకు షాక్‌‌‌‌

వొండ్రుసోవాకు షాక్‌‌‌‌
  •     జొకోవిచ్‌‌‌‌, జ్వెరెవ్‌‌‌‌, స్వైటెక్‌‌‌‌ బోణీ

లండన్‌‌‌‌: డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌, చెక్‌‌‌‌ రిపబ్లిక్ స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ మర్కెటా వొండ్రుసోవాకు వింబుల్డన్‌‌‌‌లో ఊహించని షాక్‌‌‌‌ తగిలింది. మంగళవారం జరిగిన విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లోనే ఆమె 4–6, 2–6తో జెసికా బౌజాస్‌‌‌‌ మనెరో (స్పెయిన్‌‌‌‌) చేతిలో కంగుతిన్నది. దీంతో 1994 తర్వాత ఫస్ట్‌‌‌‌ రౌండ్‌‌‌‌లోనే వెనుదిరిగిన తొలి డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌గా వొండ్రుసోవా చెత్త రికార్డును మూటగట్టుకుంది. 

30 ఏళ్ల కిందట లోరి మెక్‌‌‌‌నీల్‌‌‌‌ చేతిలో ఓడిన స్టెఫీ గ్రాఫ్‌‌‌‌ పేరిట ఈ రికార్డు ఉండేది. సరిగ్గా 12 నెలల కిందట ఇదే సెంట్రల్‌‌‌‌ కోర్టులో విమెన్స్‌‌‌‌ టైటిల్‌‌‌‌ నెగ్గిన తొలి అన్‌‌‌‌సీడెడ్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గా రికార్డు సృష్టించిన వొండ్రుసోవా ఈసారి తొలి రౌండ్ కూడా దాటలేకపోయింది. గత నెలలో బెర్లిన్‌‌‌‌ టోర్నీలో తుంటి గాయానికి గురైన వొండ్రుసోవా కోర్టులో  చురుగ్గా కదల్లేకపోయింది. 66 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో ఏడు డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌, 28 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.  

ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో టాప్‌‌‌‌సీడ్‌‌‌‌ స్వైటెక్‌‌‌‌ (పోలెండ్‌‌‌‌) 6–3, 6–4తో కెనిన్‌‌‌‌ (అమెరికా)పై, ఎలీనా రిబకినా (కజకిస్తాన్‌‌‌‌) 6–3, 6–1తో రుస్‌‌‌‌ (రొమేనియా)పై, జెసికా పెగులా (అమెరికా) 6–2, 6–0తో క్రుగెర్‌‌‌‌ (అమెరికా)పై గెలిచి రెండో రౌండ్‌‌‌‌లోకి అడుగుపెట్టారు. మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో రెండో సీడ్ నొవాక్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌ (సెర్బియా) 6–1, 6–2, 6–2తో కొప్రివా (చెక్‌‌‌‌)పై ఈజీగా నెగ్గాడు. ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో జ్వెరెవ్‌‌‌‌ (జర్మనీ) 6–2, 6–4, 6–2తో బీయాన్‌‌‌‌ (స్పెయిన్‌‌‌‌)పై, హుర్కాజ్‌‌‌‌ (పోలెండ్‌‌‌‌) 5–7, 6–4, 6–3, 6–4తో అల్బోట్‌‌‌‌ (మాల్డోవా)పై, మినుర్‌‌‌‌ (ఆస్ట్రేలియా) 7–6 (1), 7–6 (3), 7–6 (4)తో డక్‌‌‌‌వర్త్‌‌‌‌ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. కానీ ఆరో సీడ్ రష్యా స్టార్ ఆండ్రీ  రబ్లెవ్‌‌‌‌కు చుక్కెదురైంది.  కమేసన (అర్జెంటీనా) 6–4, 5–7, 6–2, 7–6 (5)తో  అతడిని ఓడించాడు.