- సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా డిమాండ్
- సీపీఐ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు షురూ
వరంగల్, వెలుగు: కోల్‍కతాలో మహిళా డాక్టర్‍పై హత్యాచారం ఘటనలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ డి.రాజా డిమాండ్ చేశారు. తమ రక్షణ కోసం జాతీయ స్థాయిలో చట్టం తీసుకురావాలని డాక్టర్లు కోరుతుంటే కేంద్రం పట్టించుకోవట్లేదని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగంపై ఆర్‍ఎస్‍ఎస్, బీజేపీ కలిసి ప్రత్యక్ష దాడి చేస్తున్నాయన్నారు. రిజర్వేషన్లను ఎత్తేసేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని ఆయన రాజా ఆరోపించారు. హనుమకొండ నక్కలగుట్టలో సీపీఐ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ మూడు రోజుల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి.
డి.రాజా ముఖ్య అతిథిగా హాజరై సమావేశాలను ప్రారంభించి మాట్లాడారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఏపీ సీఎం చంద్రబాబు ఎన్డీయేలో ఎంతకాలం ఉంటారో తెలియదని అన్నారు. త్వరలో హర్యానా, జమ్మూకాశ్మీర్ లో జరిగే ఎన్నికల్లోనూ లోక్ సభ ఫలితాలే వస్తాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‍లో పేదోళ్ల చదువులు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించలేదని, కార్పొరేట్ శక్తుల ప్రయోజనం కోరేలా బడ్జెట్ ఉందన్నారు. దేశం అభివృద్ధి చెందితే.. ఉచిత రేషన్ ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని ప్రధాని మోదీని ఆయన ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పని అయిపోయింది
రాష్ట్రంలో బీఆర్‍ఎస్ పని అయిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ సృష్టించిన సంక్షోభం ఇంకా కొనసాగుతోందన్నారు. 8 నెలలు గడిచినా కొత్త ప్రభుత్వం ఆ సంక్షోభం నుంచి బయటపడలేకపోతోందని చెప్పారు. ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన సూచించారు.
రుణమాఫీ, జీరో కరెంట్, గృహజ్యోతి అమలుపై వ్యతిరేకత వస్తోందని.. ఈ విషయంలో ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలన్నారు. బీఆర్‍ఎస్ దెబ్బతిన్నందున బీజేపీ బలపడే చాన్స్ ఉందని, బీజేపీ రాకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్ రెడ్డి, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు.