కాంగ్రెస్​ నాకు అన్యాయం చేసింది.. కేసీఆర్​ అవమానించిండు

కాంగ్రెస్​ నాకు అన్యాయం చేసింది.. కేసీఆర్​ అవమానించిండు

ఆరేండ్లుగా తెలంగాణ వెనక్కి పోతున్నది.. అదే నా బాధ

‘వీ6-వెలుగు’ ఇంటర్వ్యూలో ఎంపీ డీఎస్​

హైదరాబాద్​, వెలుగు: ‘‘ఆరేండ్లుగా రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి పోతున్నదనే బాధ.. నన్ను ఆవేదనకు గురి చేస్తున్నది. స్కీమ్​లతోనే ఓట్లు తెచ్చుకోవాలనే పాలన సాగుతున్నది. అభివృద్ధి పట్టించుకోవటం లేదని మెల్లమెల్లగా అందరికీ తెలుస్తున్నది. నేను మాట్లాడటం సరైంది కాదు.. కానీ నా మౌనం వెనుక ఏముందో అందరికీ అర్థమవుతున్నది’’ అని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్​ అన్నారు. రెండుసార్లు పీసీసీ చీఫ్​గా ఉమ్మడి ఏపీలో కీలక పాత్ర పోషించిన డీఎస్​ అటు తెలంగాణ ఉద్యమంలోనూ.. ఇటు ఉద్యమం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. 2015లో టీఆర్ఎస్​లో చేరి ఎంపీగా ఎన్నికయ్యాక.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ‘వీ6 –వెలుగు’ ఇంటర్వ్యూలో డీఎస్ పలు సంగతులు పంచుకున్నారు.

వీ6-వెలుగు:  2015 వరకు నిత్యం వార్తల్లో ఉన్న మీరు.. తర్వాత  ఎందుకు సైలెంటయ్యారు? ఎంపీగా ఉండి కూడా.. పొలిటికల్​ యాక్టివిటీ ఎందుకు తగ్గించారు?

డీఎస్:  నేను మౌనంగా  ఎందుకు ఉన్నానో  మీరే  ఆలోచించాలి.  నేను మౌనంగా ఉండే వ్యక్తిని కాదు. నా మౌనం.. మౌనం కాదు. వ్యూహాత్మక  మౌనమా అంటే అవసరాన్ని బట్టి  స్పందిస్తాను. ప్రజలకు అర్థమవుతున్నది.

2004, 2009లో మీరు పీసీసీ చీఫ్​గా ఉన్నప్పుడు కాంగ్రెస్  అధికారంలోకి వచ్చింది. అలాంటి కాంగ్రెస్‌ను వదిలి టీఆర్ ఎస్ లోకి వచ్చినందుకు ఎప్పుడైన బాధపడ్డరా ?

ఖచ్చితంగా కాంగ్రెస్ లో నాకు అన్యాయం జరిగింది. రెండుసార్లు పీసీసీ చీఫ్​గా ఉన్నాను.  నేను , వైఎస్, పార్టీ సీనియర్లతో కలిపి రాష్ట్ర మంతా అన్ని జిల్లాలు బస్సు యాత్ర చేసినం. పార్టీ గెలుపునకు కృషి చేసినం.  అట్ల 2004లో అధికారంలోకి వచ్చినం. ఆ వాస్తవాన్ని సోనియా గ్రహించారు. నన్ను నమ్మి పదవి ఇచ్చారు. అంతా ఓపెన్ గా చేశా కాబట్టి ఫలితం అలా పెద్ద ఎత్తున వచ్చింది.

మూడోసారి పీసీసీ పదవి ఇవ్వలేదనా మీ బాధ?

2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్  ఫుల్ ఫిల్ చేయలేదు.  వైఎస్ సీఎం అని ఎన్నికల ముందే సోనియా నాకు చెప్పారు. తర్వాత నేను, వైఎస్  ఎంతో సన్నిహితంగా ఉన్నం. ఎన్నికల సమయంలో టికెట్లు ఇచ్చేటప్పుడు ఇద్దరి మధ్య  వివాదాలు వచ్చాయి. అవన్నీ పార్టీ గెలుపు కోసమే.  2009 ఎన్నికలకు ముందు కూడా  వైఎస్ దృష్టిలో వేరే పేర్లు ఉండొచ్చు. కానీ సోనియా నన్ను నియమించారు. కష్టపడ్డాం..అధికారంలోకి వచ్చాం. ఎన్నికల్లో నా బ్యాడ్ లక్.  ఓడిపోవటంతో నా భవిష్యత్ దెబ్బతిన్నది. గెలిస్తే సీఎం అయ్యేవాడిని.

టీఆర్ఎస్‌ను సోనియాకు, కాంగ్రెస్ హై కమాండ్ కు దగ్గర చేయటానికి మీరు, వెంకటస్వామి కృషి చేశారు కదా..?

నేను పీసీసీ చీఫ్‌గా నావంతు ప్రయత్నం చేశాను. వెంకటస్వామితో నాది తండ్రీకొడుకుల బంధం. సోనియా, ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్  సీనియర్ లతో చర్చించి  వెంకటస్వామి చాలా కృషి చేశారు.  వెంకటస్వామి కరుడు కట్టిన తెలంగాణ వాది.

ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్​ నుంచి బయటకు ఎందుకు వచ్చారు?

ఎమ్మెల్సీ సీటు ముఖ్యం కాదు. పార్టీకి నేను చేసిన సేవలు మరచిపోయారు. నన్ను పక్కనపెట్టి ఓ లేడీకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. ఆవేదన , బాధ కలిగింది. నా అసంతృప్తిని బయటపెట్టలేదు. 15 రోజుల గ్యాప్ లో  సోనియాకు 3 లెటర్లు రాసిన. పిలుపు వస్తదని అనుకున్న. అసలు ఆ లెటర్లు సోనియా దగ్గరకు చేరినయో లేదో తెల్వదు. తర్వాత కేసీఆర్  నుంచి ఫోన్​ వచ్చింది. నాలుగుసార్లు హరీశ్​ను పంపించి రాయబారాలు నడిపారు. ఎంపీ లేదా మంత్రి పదవి ఇస్తమన్నరు. నేను తిరస్కరించిన. కాంగ్రెస్ లో అవమానం జరిగింది.. టీఆర్​ఎస్​లో అలా జరగద్దు.. తెలంగాణ భవన్ లో కూర్చొనే విధంగా రూమ్ ఉండాలి.. నిత్యం అందరిని కలిసేలా ఉండాలని చెప్పిన. తర్వాత రోజు కేసీఆర్​ను కలిసి  రెండున్నర గంటలు మాట్లాడిన. నీకు గౌరవం ఇస్త.. సలహాదారు పోస్టు ముందు ఇస్త.. పార్టీలో పదవి గురించి ఆలోచిస్త.. అన్నడు.

అందరూ కేసీఆర్  పార్టీలో చేరారు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూస్తే ఎలా ఉంది..?

అంతా కేసీఆర్ మహత్యం. ఎవరిని ఉండనివ్వడు. తానే ఉండాలంటడు కేసీఆర్ . మిగతా సీట్లు ఇతర పార్టీల వాళ్లను లాగేసుకుంటడు. టీడీపీ, కాంగ్రెస్ లో గెలిచిన వాళ్లను టీఆర్ ఎస్ లో చేర్చుకుంటుండు. పార్టీని మెర్జ్ చేసుకుంటడు. అది ఆయన చాకచక్యం.

రాష్ట్రంలో పాలనపై మీ అభిప్రాయం..?

పాలన ఎట్ల ఉందో అందరికీ అర్థమవుతున్నది. రాష్ట్రం వెనక్కి పోతుందనే బాధ ఒక్కటే ఉంది.  ప్రభుత్వం అంటే స్టేట్ అభివృద్ధి చేయాలి. అది బాధ్యత. ఆర్థిక పరిస్థితి అంతా మట్టిలో కలిసిపోయింది. ప్రజలకు ఏదో స్కీమ్స్ ఇస్తున్నా.. వాటి పేరు మీద ప్రజలకు ఏదో చేస్తున్నా.. అని చెప్పుకుంటున్నరు. వాటిలో సగం దండి కొడుతున్నరు. అందరూ చూస్తున్నరు. అందరూ గమనిస్తురు. నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. కొన్ని టీవీలు, పేపర్లను కేసీఆర్​ రాయనిస్తలేడనే  టాక్ ఉంది. తెలంగాణ కేసీఆర్ చేతిల్లో ఉంది. ఈ ఆరేండ్లలో  రాష్ట్రానికి వచ్చిన లాభం.. ప్రజలకు వచ్చిన లాభం.. రాష్ట్ర అభివృద్ధి.. ప్రజల బాగోగులు ఎట్ల ఉన్నయ్.. అనే వాస్తవాలు మీడియా చెప్పాలి.

టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తరా..?

ఎందుకు రిజైన్ చేయాలి? ఎన్నికల కంటే ముందు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యేల చేత కవిత  సంతకాలు పెట్టించారు. అప్పటికీ అర్వింద్​ బీజేపీలో చేరలేదు. సీఎంకు కవిత లెటర్ రాసిందని ఎమ్మెల్యేలు నాకు ఫోన్ చేసి చెప్పిన్రు. తమను అపార్థం చేసుకోకండని,  బలవంతంగా  సంతకాలు పెట్టినమని అన్నరు.  వాళ్ల పార్టీ వాళ్ల ఇష్టం. యాక్షన్ తీసుకోవాలని అప్పుడే ఛాలెంజ్ చేసిన.

టీఆర్​ఎస్  పార్లమెంటరీ భేటీలకు పిలుస్తున్నరా.. బిల్స్​ ఓటింగ్​ టైమ్​లో విప్​ ఇస్తున్నరా?

వాళ్లనే అడగండి. ఇప్పటి వరకు అలాంటిది జరగలేదు. రైతుల బిల్ రాజ్యసభకు వచ్చే ముందు ఎంపీ సంతోష్​ నాకు ఫోన్ చేసిండు.  కేకే మాట్లాడిండు. రేపు విప్ ఇస్త..వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పిండు. ఎక్కడున్నరు అని అడిగితే ‘ఫ్లైట్ లో ఉన్న .. దిగమంటే ఎలా దిగుతరు. ఐయామ్ సారీ.. నేను హైదరాబాద్ వెళుతున్న..’ అని చెప్పిన. తరువాత మాట్లాడుత అని ఎస్ ఎంఎస్ పంపిన.

ఇప్పుడు మీకు 73 ఏండ్లు. భవిష్యత్ లో ఎన్నికల్లో పోటీ చేస్తరా..? రిటైర్ అవుతరా..?

నేను రిటైర్ కాను. చనిపోతేనే రిటైర్ మెంట్. పోటీ చేస్తేనే రాజకీయాల్లో ఉన్నట్ల..? ఎన్నికల్లో పోటీ చేయకుండా చాలా మంది రాజకీయాల్లో ఉన్నరు. తెలంగాణ కోసం నేనెంత కష్టపడ్డానో జయశంకర్​కు తెలుసు. ఎంతో మంది చనిపోయారు..తెలంగాణ పోరాటంలో నా రోల్​ ఏమిటో  కేసీఆర్ కు తెలుసు. నేను చెబితే గొప్పలు చెప్పినట్లు అయితది.

టీఆర్ఎస్‌లో ఉండలేరు… తర్వాత.. బీజేపీనా?  కాంగ్రెస్‌లో చేరుతారా.. ?

ఏ పార్టీలో చేరుతా అనేది  టైమ్ డిసైడ్ చేస్తది. మోడీ పాలన బాగుంది. విదేశీ వ్యవహారాలు చాలా బాగున్నయ్.  కేసీఆర్ పాలన… ఓట్ల కోసమే. రాష్ట్రాన్ని కేసీఆర్​ దృష్టిలో పెట్టుకోవటం లేదు.

అంటే బీజేపీ లో చేరుతరా..?

అట్ల ఎందుకు అనుకోవాలి. ఏదైనా కావొచ్చు. కాంగ్రెస్ పాలన కూడా  బాగుండె.

టీఆర్ఎస్  మీద ఎందుకు అసంతృప్తి?

ఎంపీ పదవి ఆఫర్  చేసింది వాళ్లే. 2, 3 నెలల్లోనే నన్ను కేసీఆర్ ఇగ్నోర్ చేసిండు. పక్కన పెట్టిండు. అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ప్రగతి భవన్​కు వెళ్లినా చూసి చూడనట్టు వ్యవహరించిండు. టైమ్ అడిగితే కూడా ఇవ్వలేదు. నేను జాయిన్ అయిన రోజు కేసీఆర్ మాటలకు, తర్వాత మాటలకు చాలా తేడా వచ్చింది.  కాంగ్రెస్ నాయకత్వాన్ని  వీక్ చేయాలనుకున్నడు.

మీ కుమారుడు అర్వింద్​ బీజేపీ అభ్యర్థిగా కవిత మీద పోటీ చేశాడనే  మిమ్మల్ని టీఆర్​ఎస్​లో పక్కన పెట్టారా..?

బీజేపీలో చేరాలని అర్వింద్ కు నేను ఏనాడూ చెప్పలే. బీజేపీలో చేరుతున్నట్లు అర్వింద్ చెప్పగానే..
విషయాన్ని నేనే బాధ్యతగా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన. ‘పోతే పోనియి ఎందుకు బాధ
పడుతున్నవ్..’ అని కేసీఆర్ అన్నడు. అప్పట్లో సెప్టెం బర్ 17న రాజ్ నాథ్ నిజామాబాద్ పర్యటనకు
ముందు నేను ప్రగతి భవన్ కు వెళ్లిన. ఆ టైంలో ప్రగతిభవన్ వద్ద నన్ను 2 గంటలు వెయిట్
చేయించిన్రు. కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలె. వేరే రూమ్ లోకి వెళుతుంటే.. ఎదురుపడ్డా ను.
‘కొడుకు బీజేపీలోకి పోతుంటే ఎంత భయపడుతున్నడో చూడుండ్రి’ అని కేసీఆర్ అందరి ముందే
నన్ను అవమానించిండు. దేవుడే కేసీఆర్ కు బుద్ధిచెబుతాడని మనసులోనే అనుకున్న. ప్రగతి
భవన్ కు వెళ్లటం అదే చివరిసారి. ‘సొంత కుటుంబసభ్యులే మంచి స్టేజ్ లో ఉండాలి.. వేరే వాళ్లు
బలంగా ఉండొద్దు..’ అనేది కేసీఆర్ అభిమతం. నాకే కాదు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి
ఇట్లనే జరిగింది. పిలిచేటప్పుడు కేసీఆర్ ఇచ్చే మర్యాదను తట్టు కోలేం. తర్వాత సైలెంట్ గా
వ్యవహారం చేస్తడు. అందరేమో గానీ మా కేకే సక్సెస్ అయిండు.. ఆయన అదృష్టం బాగుంది. కేకే
చాలా సైలెంట్ గా ఉన్నడు.

For More News..

హేమంత్ హత్యలో కూలీలే కిరాయి హంతకులు

హుస్సేన్ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నీళ్లు.. కొబ్బరి నీళ్లెప్పుడైతయ్