
- గత ఐదు సెషన్లుగా లాభాల్లో మార్కెట్
- సోమవారం 24,100 పైన నిఫ్టీ
- మెరిసిన బ్యాంక్ షేర్లు
ముంబై: బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు వరుసగా ఐదో సెషన్‌లోనూ లాభాల్లో కదిలాయి. సెన్సెక్స్ సోమవారం 800 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 24,100 పైన ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతుండడంతో ఇండెక్స్‌లు ర్యాలీ చేస్తున్నాయి. గత ఐదు సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ. 32 లక్షల కోట్లు పెరగడం విశేషం. ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.423 లక్షల కోట్లకు చేరుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రిజల్ట్స్ మెప్పించడంతో నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ సోమవారం సుమారు రెండు శాతం పెరిగింది. యూఎస్, -ఇండియా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతుండడం కూడా కలిసొస్తోంది. సెన్సెక్స్ సోమవారం 855 పాయింట్లు (1.09 శాతం) పెరిగి 79,409 వద్ద, నిఫ్టీ 274 పాయింట్లు ఎగసి 24,126 వద్ద ముగిశాయి.
మార్కెట్ పెరగడానికి కారణాలు..
ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ల ర్యాలీ బ్యాంకింగ్ షేర్లు సోమవారం ర్యాలీ చేశాయి. ఇంట్రాడేలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.3 శాతం పెరగగా, ఐసీఐసీఐ బ్యాంక్ 0.9 శాతం లాభపడి ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ రెండు బ్యాంకుల నికర లాభం మార్చి క్వార్టర్‌లో అంచనాలను అధిగమించింది. మిగిలిన బ్యాంకుల ఫలితాలు కూడా బాగుంటాయనే అంచనాలు పెరిగాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2.47శాతం లాభపడగా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 2.13 శాతం పెరిగింది.
విదేశీ ఇన్వెస్టర్లు రీఎంట్రీ
ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) మన స్టాక్ మార్కెట్లలో మళ్లీ కొనుగోళ్లు మొదలుపెట్టారు. గత మూడు సెషన్లలో నికరంగా రూ.8,500 కోట్ల విలువైన షేర్లను కొనగా, సోమవారం మరో రూ. 2,000 కోట్ల షేర్లను కొన్నారు. ఇండియా ఎకానమీ మెరుగ్గా ఉంటుందనే అంచనాలు ఎక్కువయ్యాయి. యూఎస్‌తో చర్చలు యూఎస్‌తో జరుగుతున్న టారిఫ్ చర్చలలో ఇండియా ముందుంది. అమెరికా వైస్ -ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇండియా టూర్‌తో ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇరు దేశాల మధ్య వీలున్నంత తొందరగా ట్రేడ్ డీల్ కుదురుతుందనే అంచనాలు బలపడ్డాయి. “ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ, ఇండియా జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం వృద్ధి సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. డాలర్ బలహీనపడుతుండడంతో మన స్టాక్ మార్కెట్ వైపు ఎఫ్‌పీఐలు చూస్తున్నారు” అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ అభిప్రాయపడ్డారు.