Daaku Maharaaj: సంక్రాంతి సినిమా ‘డాకు మహరాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

Daaku Maharaaj: సంక్రాంతి సినిమా ‘డాకు మహరాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

సంక్రాంతి సినిమాల్లో ఒకటైన ‘డాకు మహరాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. తిరుపతిలో వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాట ఘటన తమను కలచివేసిందని సితార ఎంటర్టైన్మెంట్స్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇలాంటి హృదయవిదారక ఘటన జరిగిన తర్వాత ‘ప్రీ రిలీజ్ ఈవెంట్’ చేసుకోవడం ఏమాత్రం సబబు కాదని ఈవెంట్ను రద్దు చేసుకున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది.

బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహరాజ్’ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను అనంతపురంలో గురువారం (జనవరి 9న) నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది. మంత్రి నారా లోకేష్ను ముఖ్య అతిథిగా పిలిచారు.

అయితే.. తిరుపతిలో విషాద ఘటన కారణంగా ఈ ఈవెంట్ను సినిమా యూనిట్ రద్దు చేసుకుంది. తిరుపతిలో వైకుంఠ ద్వార సర్వ దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలిరావడంతో బుధవారం తోపులాట చోటుచేసుకుంది. అది కాస్తా తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, దాదాపు 40 మంది అస్వస్థతకు గురయ్యారు.

వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని 9 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా జారీ చేస్తామని టీటీడీ ఇటీవల ప్రకటించింది. ఈ నెల 10,11,12 తేదీల్లో దర్శనానికి సంబంధించి లక్షా 20 వేల టోకెన్లను గురువారం ఉదయం 5 గంటల నుంచి జారీ చేస్తామని తెలిపింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రానికే భక్తులు భారీ సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు.

Also Read : బాలకృష్ణను బాల అని పిలవాలంటే భయమేసింది

శ్రీనివాసం, సత్యనారాయణపురం బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాలకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో భక్తులు రోడ్లపై గుమిగూడకుండా బైరాగిపట్టెడ వద్ద ఉన్న పద్మావతి పార్కులో ఉంచారు. అయితే అక్కడున్న టోకెన్ల జారీ కేంద్రంలో సిబ్బంది ఒకరు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించేందుకు గేట్ ఓపెన్ చేశారు. దీంతో టోకెన్లు ఇచ్చేందుకే గేట్ ఓపెన్ చేశారని అనుకున్న భక్తులు.. ఒక్కసారిగా క్యూలైన్ వద్దకు దూసుకొచ్చారు. ఇది కాస్తా తోపులాట, తొక్కిసలాటకు దారితీసింది.