తొమ్మిదేండ్లలో దళితులకు దగా

జై తెలంగాణ.. జైజై తెలంగాణ నినాదాలు 2009 నుంచి2014 వరకు మారుమోగాయి. ఆ శబ్దమే అందరికి ప్రాణవాయువులా ఉండేది. చెత్త ఏరుకునే వాడి నుంచి కలెక్టర్ వరకు తెలంగాణ ఏర్పాటు తమ జీవిత లక్ష్యంగా ఉండేది. యువత ఒక్క నిమిషం ఆలోచించకుండా, రెప్ప వాల్చకుండా తమ శరీరాల్ని కొవ్వొత్తుల్లా తెలంగాణ తల్లికి హారతి ఇచ్చేది. తెలంగాణ అంటే ఒక కల్ట్, తెలంగాణ అంటే ఒక రిలీజియన్. కులం లేదు, మతం లేదు, చిన్నా, పెద్దా హోదా లేనే లేదు. ఆర్ఎస్ఎస్​ నుంచి ఆర్​ఎస్​యూ వరకు జెండాలు, సిద్ధాంతాల తేడా లేదు. తెలంగాణ ఏర్పాటే లక్ష్యం, గమ్యం, మార్గం. చిన్న రాష్ట్రాల్లో చిన్న కులాలకు సామజిక న్యాయం వస్తదని, ఆకాంక్ష, వెర్రి కోరిక. కేసీఆర్ ఎన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, తెలంగాణ ప్రజలు సహించారు.

తెలంగాణ కొడుకే కాదా అని మన్నించారు. రాజకీయ పరిజ్ఞాన్ని బాగా ఒంటపట్టిచ్చుకున్న కేసీఆర్.. తెలంగాణ ఆకాంక్షతో ఏర్పడ్డ ఆవేశాన్ని ఆసరాగా చేసుకొని ప్రజల మనోభావాలతో ఫుట్ బాల్ ఆడుకున్నారు. అందులో భాగంగా వచ్చిన పదాలే రాళ్లతో కొట్టి చంపండి, తల నరుక్కుంటా, గొంగడి పురుగునైనా ముద్దాడుతా, కాపలా కుక్కలా ఉంటా, బొంద పెడదాం, గాడిదకు గడ్డేసి ఆవుకు పాలుపిండటం, తెలంగాణ వస్తే ఒక్క పదవి తీసుకోను, లాగులు తడుస్తాయి ఇలా ఎన్నో పదాలు. అందులో ప్రత్యేకించి దళిత వర్గాల పట్ల చెప్పిన డైలాగ్ “తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి ముఖ్యమంత్రి దళితుడే’’. చాలా మంది దళితులు, దళిత నాయకులు అప్పటి నుంచి కలలుగన్నారు. అవి 9 ఏండ్ల తర్వాత పగటి కలలే అని గ్రహించారు. 

మూడెకరాల భూమి

దళితులకు మూడెకరాల భూమి అనే అంశం గురించి చెప్తూ.. కేసీఆర్ తన ప్రసంగాల్లో భూమి కేవలం ఆస్తి కాదు, ఆత్మగౌరవం అని అన్నారు. దాదాపు 10 లక్షల కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇచ్చి తీరుతా అని ప్రతి ఎన్నికల ప్రచారంలో ప్రసంగాలు ఇచ్చారు. చివరకు మొక్కుబడిగా కొందరికి ఇచ్చి, అందరికి పంగనామాలు పెట్టారు. కేవలం భూమినే కాదు, మోటార్, కరెంట్, పంట సాయం ఇలా ప్రతి ఎకరా నేనే వచ్చి దున్నుతా అనే రీతిలో నమ్మించాడు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందనే విధంగా , చివరకు దళితుల భూములను.. ప్రాజెక్టులు, రోడ్లు, రైతు వేదికలు, శ్మశాన వాటికలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నీటి పథకాలు ఇలా ప్రతి దానిని గుంజుకుంటున్నారు. గతంలో దళితులకు ఇచ్చిన  లక్షల ఎకరాల భూమి సర్కారు మళ్లీ తీసుకున్నది. 

ఎస్సీ సబ్ ప్లాన్ రద్దు

2013 జనవరి 24న అసెంబ్లీ చట్టం ద్వారా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను చట్టబద్ధం చేశారు. ఈ యాక్ట్ ప్రకారం మొత్తం బడ్జెట్ లో 15 శాతం ఎస్సీ సబ్ ప్లాన్ కు కేటాయించాలి. ఆ నిధులను కేవలం దళితుల సంక్షేమం, అభివృద్ధికి ఉపయోగించాలి. నిధులు మిగిలితే వచ్చే ఏడాదిలో ఖర్చు పెట్టాలి. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సుమారు18 లక్షల కోట్లు. ఎస్సీ సబ్ ప్లాన్ ప్రకారం వారికి ఇందులో దక్కాల్సిన మొత్తం రూ. 2,70,000 కోట్లు. కానీ కేసీఆర్ ఎస్సీ సబ్ ప్లాన్ ను రద్దు చేసి దళితుల ధనరాశులకు గండి కొట్టారు. దళితులు దాదాపు రూ. 2 లక్షల కోట్లు నష్ట పోయారు. ఈ పాపంలో దళిత ఎమ్మెల్యేలు, సీనియర్ మంత్రులు, సామాజిక నాయకులమని చెప్పుకునే వారు కొన్ని ఉత్సవ విగ్రహాల పదవులకు ఆశపడి దళితులకు ఉన్న ఒక చట్టబద్ధమైన హక్కును కోల్పోయేలా చేశారు.  

ఎస్సీ మంత్రులు ఏరి?

తెలంగాణలో 16 శాతం జనాభా ఉన్న దళితుల నుంచి కొన్ని రోజులు అసలు మంత్రివర్గంలో ప్రాతినిధ్యమే లేదు. ఉన్న ఒక్క మంత్రి. అది కూడా అవహేళనతో, పబ్లిక్ గా అవమాన పరుస్తూ దళితులకు ఒక ఛాలెంజ్ విసిరారు కేసీఆర్. మొక్కుబడిగా ఒకరిని పెట్టడం తప్ప, దళితుల ఆత్మగౌరవం కోసం ఎప్పుడూ కేసీఆర్​ ఆలోచించలేదు. జనాభా ప్రకారం దళితుల నుంచి ముగ్గురు మంత్రులు ఉండాలి.  

దళిత బంధు దగా 

దళిత బంధు పథకం ఎలాంటిదంటే.. ఓ సినిమాలో కోట శ్రీనివాస్ రావు దూలానికి కోడిని కట్టేసి, చూసుకుంటూ, లొట్టలు వేసుకుంటూ తెల్లన్నం తినడం లాంటిది. కేసీఆర్ ఆ సినిమా చాలా సార్లు చూశారు కాబట్టి దాని ప్రభావం బాగా ఉంది. 
హుజూరాబాద్ ఎన్నికల్లో వేసిన దళిత బంధు పాచికను అన్ని చోట్లా ఉపయోగిస్తున్నరు. చివరకు ఉద్యోగులకు కూడా దళితబంధు ఇస్తామన్నారు.  

అసైన్డ్ భూములు స్వాహా..

గత ప్రభుత్వాలు దళితులకు భరోసా కల్పించటానికి  సుమారు23 లక్షల ఎకరాల భూమిని  ఇచ్చారు. ఒకప్పుడ్డు రాళ్లూ, రప్పలు , గుట్టలుగా ఉన్న ఆ భూమి అదృష్టవశాత్తు ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ జిల్లాల్లో కోటి నుంచి రూ.50 కోట్లు ఒక ఎకరాకు రేటు వచ్చింది. దురదృష్టమేమిటంటే..కేసీఆర్ కన్ను వాటిపై పడ్డది. ధరణి తెచ్చారు. భూ హక్కు పోయింది. ల్యాండ్ పూలింగ్ పేరు మీద, ప్రాజెక్టుల పేరుమీద, అభివృద్ధి పేరుతో ఎకరాకు అయిదు నుంచి10 లక్షలు ఇచ్చి కోట్ల విలువైన ఆస్తిని స్వాహా చేశారు. 

ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం

ప్రభుత్వ ఉద్యోగాలతో దళితుల జీవన శైలి మారుతుంది. కానీ దళితులకు ఉద్యోగాలు, ఉన్నత పదవులు ఇవ్వకుండా అణచివేతకు గురి చేస్తున్నారు కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో 13 లక్షల ఉద్యోగాలు వచ్చాయంటున్నది. అలాంటప్పుడు12,000 గ్రామాల్లో ఊరికి108 ఉద్యోగాలు రావాలె కాదా? కీలమైన, కలెక్టర్ పదవుల్లో, సీఎంవో ఆఫీసులో దళితులు లేకుండా చేసిన ఘనత కేసీఆర్​దే.

పారిశ్రామిక నిర్లక్ష్యం

కేంద్ర ప్రభుత్వంలో అనేక పథకాలు దళితులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దేలా ఉన్నాయి. ముద్ర లోన్స్, స్టాండప్​ఇండియా, వెంచర్ క్యాపిటల్ ఫండ్, ప్రత్యేక దళితులకు రాయితీలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ కేసీఆర్ వాటిని రాష్ట్రానికి రానివ్వరు. దళిత బంధు అనే గుడ్డతో కళ్లకు గంతలు కట్టి దగా చేస్తున్నారు. దళితులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకపోవడంతో గత 9  ఏం డ్లలో అత్యధిక సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఇబ్బంది పాలవుతున్నాయి. ఇలా తొమ్మిదేండ్లలో అన్ని విధా లుగా వంచన చేసిన ఘనత కేసీఆర్ దే. ‘ఒక్కరిని మోసం చేస్తే అది నేరం.. వేల మందిని మోసం చేస్తే.. అది వ్యాపారం, కోట్ల మందిని మోసం చేస్తే.. అది రాజకీయం’ అనే సామెత కేసీఆర్ రాజకీయ ఒరవడికి సరిగ్గా సరిపోతుంది. ఉదాహరణకు 2018 మ్యానిఫెస్టోలో12 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఒక్క రూపాయి ఇవ్వలేదు. అలానే రైతు రుణ మాఫీ చేస్తామన్నారు చేయలేదు, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెడతామన్నారు..
పెట్టలేదు. 

దళిత ముఖ్యమంత్రి
.
స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏండ్లలో ఎప్పుడూ దళితుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం (కొన్ని నెలలు దామోదరం సంజీవయ్య తప్ప) రాలేదు. అసలు తెలంగాణ ఏర్పడే అవకాశం కల్పించింది డా. బీఆర్​అంబేద్కర్ పొందుపరచిన ఆర్టికల్ 3 ద్వారా. అది లేకుంటే, తెలంగాణ రాకుండే. అదే విషయం కేసీఆర్ పదే పదే చెప్తూ.. అంబేద్కర్ పేరు ఉచ్చరిస్తుం డేవారు. చాలా మంది దళితులు ఇటు రాష్ట్రం, అటు దళిత ముఖ్యమంత్రి పదవి డబుల్ ధమాకా వస్తదని ఉత్సాహంతో ఉండే. కానీ చాలా అవలీలగా వారి ఆశల్ని బొందపెట్టారు కేసీ ఆర్. అలా ఆదిలోనే హంసపాదు తప్పలేదు. 

సమయం వచ్చింది.. దళితులు మేల్కోవాలి

ఇక దళితులు కండ్లు తెరవాలి, కేసీఆర్​ను గద్దె దింపాలి. బీజేపీ ఒక దళితుడిని ప్రెసిడెంట్ చేసింది, ఒక దళితుడిని పార్టీ అధ్యక్షుడిని చేసింది, 12 మంది దళితులకు(15%)  కేంద్ర మంత్రి పదవులు ఇచ్చింది. అంబేద్కర్ ఎన్నికల్లో ఓడిపోతే రాజ్య సభ ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషించింది. భారత రత్న ఇచ్చింది, అంబేద్కర్ 5 ప్రధాన స్మృతులను పంచ తీర్థాలుగా తీర్చిదిద్దింది. దళితులు, సామాజిక సంఘాలు ఆలోచించాలి. బీజేపీ గెలిస్తే బీసీ, ఓసీతో పాటు దళితుడు కూడా సీఎం అయ్యే అవకాశం ఉంటది. ఆవేశంతో కాకుండా, ఆలోచనతో ముందుకు వెళదాం.. సామాజిక తెలంగాణను స్థాపిద్దాం.

- డా. బూర  నర్సయ్య గౌడ్ , మాజీ ఎంపీ, భువనగిరి