పొద్దున్నే నిద్ర లేవగానే పనుల హదావుడి. ఒక్కసారిగా ఆరోజు చేయాల్సిన పనులన్నీ గుర్తుకు వస్తాయి. ఇంట్లో పిల్లలు, వంట. ఇంటి పనులు... కంగారుగా ఉంటుంది. ఆలోచించుకోడానికి అవకాశమే ఉండదు. రాత్రి పడుకునే ముందు తెల్లారి ఏవేవో చేయాలాని నిర్ణయించుకుంటారు. ప్రశాంతంగా నిద్రలేకపోవడం వల్ల అన్నీ గాలికి పోతాయి. అందుకే రోజును ఎలా ప్రారంభించాలో రాత్రి అనుకుని పడుకుంటే సరిపోదు. మరుసటి రోజుకు ప్రణాళిక వేసుకో వాలి. అదీ.. సమయం, చేయాల్సిన పనులను బట్టి ఉండాలి.
నిద్ర లేచే టైం.. ఎన్ని గంటలకు స్నానం. ..ఎంత సమయంలో బ్రేక్ ఫాస్ట్, పిల్లలను స్కూల్లో ఎప్పుడు దించాలి. ఆఫీసుకు ఏ సమయానికి బయల్దేరాలి. వీలైతే వ్యాయామానికి ఎంత సమయం కేటాయించుకోవాలి, ఆఫీసులో ముఖ్యమైన పనులు, సొంతపనులు, ఎవరినన్నా కలవాలంటే వాళ్లకు ఇవ్వాల్సిన సమయం... అన్నింటికి ఒక టైం టేబుల్ ను వేసుకోవాలి. అనుకున్న టైంకు కరెక్టుగా చేయలేకపోయినా... ఐదు, పది నిమిషాలు అటు ఇటు అయినా ఫర్వాలేదు. ముఖ్యంగా మరుసటి రోజు ప్రణాళికను పడుకునే ముందు వేసుకోవడం మంచి లక్షణం. టెన్షన్ ఉండదు. అయితే ఈ ప్రణాళిక అందరికీ ఒకేలా ఉండదు. ఎవరి పనులు... అవసరాలను బట్టి వాళ్లే వేసుకోవా లి. అందరూ ఇలాంటి ప్రణాళిక వేసుకుంటే రోజును హాయిగా, ఆనందంగా ప్రారంభించొచ్చు.
-వెలుగు,లైఫ్-