ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన కొద్ది రోజులుగా వరుసగా డైలీ కేసుల నమోదులో తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన నాలుగు రోజుల్లో చూస్తే మంగళవారం ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించిన బులిటెన్‌లో కొత్త కేసుల సంఖ్య 13,819 కాగా, ఆ తర్వాతి రోజున 13,618 కేసులు నమోదయ్యాయి. గురువారం ప్రకటించిన బులిటెన్‌లో 13,474 కొత్త కేసులు నమోదు కాగా, ఇవాళ్టి బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో కేసులు 13 వేల దిగువకు వచ్చాయి. నిన్న ఒక్క రోజులో 40,635 మందికి టెస్టులు చేయగా.. 12,561 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#COVIDUpdates: 28/01/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 28, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 22,45,713 పాజిటివ్ కేసు లకు గాను
*21,17,822 మంది డిశ్చార్జ్ కాగా
*14,591 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,13,300#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/TpdJX1qJNz
రాష్ట్రంలో రోజువారీ కేసులు తగ్గినప్పటికీ.. ఇవాళ మరణాలు పెరిగాయి. రోజూ పదిలోపే డెత్స్ నమోదవుతుండగా ఇవాళ 12 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలులో 1710 మందికి, గుంటూరులో 1625 మందికి, వైఎస్‌ఆర్ కడప జిల్లాలో 1215 మందికి, విశాఖపట్నంలో 1211 మందికి, ఈస్ట్ గోదావరిలో 1,067 మందికి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1009 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా కారణంగా విశాఖలో ముగ్గురు, కర్నూలు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు చొప్పున, అనంతపురం, చిత్తూరు, విజయనగరం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఇవాళ 12 మంది మరణించారు. అయితే గడిచిన 24 గంటల్లో 8,742 మంది కరోనా నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం 1,13,300 మంది చికిత్స పొందుతున్నారని వివరించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,591కి చేరినట్లు ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది.