కొంతమంది బ్రేక్ ఫాస్ట్ లో ఉడికించో, ఆమ్లెట్ వేసుకునో గుడ్లు తింటారు. గుడ్డులో హై కొలెస్ట్రాల్ ఉంటుందని, అది ఆరోగ్యానికి మంచిది కాదని చాలామంది నమ్ముతారు. దీని గురించి తెలిసినవారు ట్రేలకు ట్రేలు తినకుండా రోజూ రెండు తింటారంతే! రోజుకు రెండు గుడ్లు తింటే చాలు.. ఈ హెల్త్ బెనిఫిట్స్ పొందినట్టే!
మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది
ఒక గుడ్డులో 186 మిల్లిగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. 70 శాతం మందిలో కొలెస్ట్రాల్ పెరగడానికి గుడ్డు కారణం కాదు. మిగిలిన 30 శాతం మందిని ..హైపర్ రెస్పాండర్స్.. అని పిలుస్తారు. వీళ్లు గుడ్లు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అయితే గుడ్డు మంచి కొలెస్ట్రాల్ పెంచడంలోనూ తోడ్పడుతుంది. మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్లకు గుండె జబ్బుల ముప్పు తక్కువ. రోజుకు రెండు గుడ్లు... ఆరు వారాలు తింటే మంచి కొలెస్ట్రాల్ పది శాతం పెరుగుతుందని స్టడీల్లో తేలింది.
ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం, గోళ్లు
గుడ్డులో విటమిన్ బి, బి12, బి5, బయోటిన్, రైబోప్లేవిన్, థయమిన్, సెలీనియం ఉంటాయి. ఈ విటమిన్స్ శరీరానికి అందడం వల్ల ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం, గోళ్లు సొంతం అవుతాయి. ఈ విటమిన్స్ కణాలకు పోషకాలు అందించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
ఒకేసారి రెండు గుడ్లు తీసుకోవడం వల్ల 59 శాతం సెలీనియం, 32 శాతం విటమిన్ ఏ, 14 శాతం ఐరన్ శరీరానికి అందుతుంది. ఈ పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. జలుబు, జ్వరాన్ని పోగొట్టడంలోనూ గుడ్డుది ముఖ్య పాత్ర అని పరిశోధకులు చెబుతున్నారు.
ALSO READ | శివయ్యను దర్శించుకునేటప్పుడు చదవాల్సిన మంత్రాలు ఇవే..
కంటి చూపు మెరుగవుతుంది
గుడ్డులో ఉండే లుటేన్, జెక్సాంతిన్ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్స్ కన్నులో ఉండే మాక్యూలర్ రిజియన్ లో కనుగొన్నారు. లుటేన్, జెక్సాంతిన్, ఒమెగా-3 కన్ను ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయని స్టడీల్లో తేలింది. ఈ రెండు యాంటీ ఆక్సిడెంట్స్ కంటిలో మెయింటైన్ చేస్తే రెటీనా... క్షీణించిపోకుండా కాపాడుతాయి.
జ్ఞాపకశక్తి పెరుగుతుంది
గుడ్డులో ఉండే కోలిన్ అనే పదార్ధం మెదడు పని తీరుని మెరుగుపరుస్తుంది. జ్ఞాపశక్తిని పెంచుతుంది. ఇతర ఆహారాల్లో కోలిన్ కనిపెట్టడం చాలా కష్టమనే చెప్పాలి. ఇక, గర్భిణులు గుడ్డు తింటే ఎంత మంచిదో తెలిసిందే. కార్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన స్టడీలో.... రోజూ ఒక గుడ్డు తీసుకోవడం వల్ల లభించే కోలిన్స్... పుట్టబోయే బిడ్డ మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడుతుంది తేలింది.
డి- విటమిన్ అందిస్తుంది
మన దేశంలో ఎక్కువ మంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. గుడ్డు తీసుకోవడం వల్ల డి -విటమిన్ వల్ల ఎముకలకు క్యాల్షియం పీల్చుకునే శక్తి పెరుగుతుంది. దీంతో ఎముకలు, పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
–వెలుగు, లైఫ్–