గచ్చిబౌలి–కొండాపూర్​ రూట్​లో మూడు నెలలు తిప్పలు తప్పవ్

  • గచ్చిబౌలి–కొండాపూర్​ రూట్​లో డైలీ భారీగా ట్రాఫిక్ జామ్
  • ఫ్లై ఓవర్ ​నిర్మాణ పనుల కారణంగా  డైవర్షన్స్​
  • ఉదయం, సాయంత్రం వేళల్లో వెహికల్స్ రద్దీ 
  • ఆఫీసులకు వెళ్లొచ్చే టైమ్​లో ఇబ్బంది పడుతున్న ఎంప్లాయీస్​


మాదాపూర్, వెలుగు: హైటెక్​సిటీలో జరుగుతున్న అభివృద్ధి నిర్మాణాలతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గచ్చిబౌలి–కొండాపూర్​రూట్లో కొత్తగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనుల కారణంగా సైబరాబాద్​ట్రాఫిక్​పోలీసులు మూడు నెలల పాటు ఆ రూట్ ను క్లోజ్​చేసి ట్రాఫిక్​డైవర్షన్​అమలు చేస్తూ నాలుగు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 10వ తేదీ వరకు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని ట్రాఫిక్​పోలీసులు ఎక్కడికక్కడ వాహనదారులను కట్టడి చేస్తున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్​జామ్​ఏర్పడుతోంది. బయోడైవర్సిటీ–సైబర్​టవర్స్, ఐకియా–ఏఐజీ హాస్పిటల్​రూట్, గచ్చిబౌలి ఓఆర్​ఆర్, శిల్పా లే అవుట్​ఫ్లైఓవర్​మీదుగా ఐకియా జంక్షన్​రూట్లలో ఉదయం, సాయంత్రం వేళల్లో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరుతున్నాయి. 

రూట్లు క్లోజ్​చేసి డైవర్షన్​

ఎస్ఆర్ డీపీ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలి ఓఆర్​ఆర్​నుంచి కొండాపూర్​వైపు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపడుతోంది. ఓఆర్​ఆర్​నుంచి గచ్చిబౌలి చౌరస్తా వరకు పిల్లర్ల నిర్మాణం పూర్తికాగా.. గచ్చిబౌలి చౌరస్తా నుండి కొండాపూర్​వైపు పిల్లర్ల నిర్మాణం జరగాల్సి ఉంది. ఈ పనులను తొందరగా పూర్తిచేసేందుకు గచ్చిబౌలి–కొండాపూర్​రూట్​ను ట్రాఫిక్​అధికారులు క్లోజ్​చేశారు. ఈ రూట్లో వెళ్లే అన్ని వెహికల్స్​ను బయోడైవర్సిటీ టూ సైబర్​టవర్స్, బయోడైవర్సిటీ టూ ఏఐజీ రూట్, గచ్చిబౌలి ఐఐఐటీ నుంచి డీఎల్ఎఫ్​రూట్, లెమన్​ట్రీ నుంచి గూగుల్​సిగ్నల్ రూట్లలో ట్రావెల్​చేయాలని పోలీసులు రూట్​మ్యాప్​ రిలీజ్​చేశారు. 

4.4 కి.మీ. జర్నీకి ముప్పావుగంట

ఈ డైవర్షన్​కారణంగా ఆయా రూట్లలో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్​జామ్​అవుతోంది. గచ్చిబౌలి టూ కొండాపూర్​ రూట్​క్లోజ్​కావడంతో వెహికల్స్​అన్నింటినీ ట్రాఫిక్ పోలీసులు బయోడైవర్సిటీ నుండి ఐకియా జంక్షన్​ మీదుగా సైబర్​టవర్స్, ఏఐజీ రూట్లలో మళ్లిస్తున్నారు. బయోడైవర్సిటీ నుండి సైబర్​టవర్స్​వరకు 4.4 కి.మీ. ట్రావెల్​చేయడానికి సాధారణంగా 15 నిమిషాల సమయం పడుతుంది. అయితే, డైవర్షన్​కారణంగా ఈ రూట్​ మొత్తం వెహికల్స్​తో నిండిపోయి దాదాపు ముప్పావుగంట పడుతోంది. ఐకియా జంక్షన్​మొత్తం వెహికల్స్​తో నిండిపోతోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రద్దీ కొనసాగుతోంది. 

ప్రశ్నిస్తున్న వాహనదారులు

ఓ వైపు 40 డిగ్రీల ఎండలో డైవర్షన్ల​కారణంగా ఎక్కువ దూరం ట్రావెల్​చేయాల్సి వస్తుండటం.. దీనికి తోడు భారీగా ట్రాఫిక్​ జామ్​అవుతుండటంతో అధికారులపై వాహనదారులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల పాటు రోడ్లను క్లోజ్​చేయడం ఏంటని రోడ్లపై డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్​పోలీసులతో వాహనదారులు గొడవకు దిగుతున్నారు. దీనిపై అధికారులు సైతం స్పందిస్తున్నారు. ఫ్లైఓవర్​నిర్మాణ పనుల కారణంగా గచ్చిబౌలి–కొండాపూర్​రూట్ ను క్లోజ్​చేయాల్సి వచ్చిందని, ఇందుకు సహకరించాలని సైబరాబాద్ ట్రాఫిక్​ ఉన్నతాధికారులు కోరుతున్నారు. ట్రాఫిక్​ జామ్​పై సైబరాబాద్ ​ట్రాఫిక్​ జాయింట్​ సీపీ నారాయణ్​నాయక్​ మంగళవారం ట్రాఫిక్​అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రద్దీని తగ్గించడం, డైవర్షన్స్ పై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రద్దీని తగ్గించేందుకు సలహాలు, సూచనలు, పరిష్కారాలు ఇవ్వాలని సిటిజన్స్​ను కోరారు.  

రాత్రి సమయంలో డైవర్షన్స్ పెట్టాలి 

గచ్చిబౌలి–కొండాపూర్ ​రూట్​ను క్లోజ్​చేయడం వల్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ట్రాఫిక్ జామ్ ​కారణంగా ఇంటికెళ్లేసరికి రాత్రి అవుతోంది. ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను రాత్రి పూట చేపడుతూ, అప్పుడే ట్రాఫిక్ డైవర్షన్​ పెడితే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
– భారతి, స్టాఫ్​ నర్స్, గచ్చిబౌలి

ఆఫీస్​కు వెళ్లలేక వర్క్​ఫ్రమ్​హోం చేస్తున్న..
డైవర్షన్ ​వల్ల మియాపూర్ ​నుంచి 

నానక్​రాంగూడకు దూరం పెరగడంతో పాటు రద్దీ​ఏర్పడుతుండటంతో ఆఫీస్​కు టైమ్​కు వెళ్లలేకపోతున్నా. దీంతో వర్క్​ ఫ్రమ్​ హోం తీసుకున్నా. 
– శ్రీకాంత్​, సాఫ్ట్​వేర్ ఎంప్లాయ్