- కులసంఘాలకు గాలం, యూత్‌పై నజర్
- పెండ్లిళ్లు, పేరంటాలు, పరామర్శలు
- సోషల్‌మీడియా వేదికగా జోరుగా ప్రచారం
- జిల్లాలో గరంగరంగా అసెంబ్లీ పాలిటిక్స్
నిజామాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే లీడర్లు, ఆశావహుల ఓటర్లను చేరువయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. టికెట్ల ఖరారుతో బీఆర్ఎస్ అభ్యర్థులు, అభ్యర్థిత్వంపై ఆశగా ఉన్న ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ లీడర్లు డైలీ ప్రోగ్రామ్స్నిర్వహిస్తూ, ప్రజల నోళ్లల్లో మెదిలేందుకు ట్రై చేస్తున్నారు. కార్యకర్తల ఇండ్లలో పెండ్లిళ్లు, పేరంటాలు ఏమున్నా అటెండయ్యేందుకు ప్రయార్టీ ఇస్తున్నారు. యువతను ప్రభావితం చేసే ఫేస్బుక్, వాట్సాప్ తదితర సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ లలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
కారు.. జోరు..
బీఆర్ఎస్ హైకమాండ్ జిల్లాలోని అయిదు నియోజకవర్గాలకు సిట్టింగ్ఎమ్మెల్యేలనే అభ్యర్థులుగా ప్రకటించింది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ప్రారంభించారు. అర్బన్ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా ప్రతిరోజూ నగరంలోని అయిదు డివిజన్లు తిరుగుతున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ ఓటర్లను కలుస్తున్నారు. యూత్‌ను ఆకర్షించేందుకు ఇప్పటికే రెండుసార్లు జాబ్‌మేళాలు నిర్వహించారు. రూరల్ఎమ్మెల్యే బాజిరెడ్డి కుల సంఘాలకు ఫండ్స్ఇస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న డెవలప్మెంట్పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
బోధన్ఎమ్మెల్యే షకీల్ లబ్ధిదారులకు షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి చేస్తూ, లబ్ధిదారులకు భోజనాలు పెట్టిపంపుతున్నారు. ఇటీవల నియోజకవర్గంలోని యువతకు సొంత ఖర్చుతో డ్రైవింగ్‌లైసెన్సులు ఇప్పించే కార్యక్రమాన్ని స్టార్ట్చేశారు. షకీల్భార్య అయేషా తన ఫౌండేషన్‌ద్వారా హైస్కూల్గర్ల్స్టూడెంట్స్కు సైకిళ్లు అందిస్తున్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కూడా కొత్తగా ఓటు హక్కు పొందినవారికి డ్రైవింగ్ లైసెన్సులంటూ యూత్ మద్దతు పొందే ప్రయత్నాలు పడుతున్నారు.
గడపగడపకు కాంగ్రెస్..
గడపగడపకు కాంగ్రెస్పేరిట ఆ పార్టీ ఆశావహులు ప్రజల వద్దకు వెళ్తున్నారు. పార్టీ అభ్యర్థులు స్పష్టం చేయనప్పటికీ పబ్లిక్మధ్య ఉండేందుకు ప్రయార్టీ ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్సీనియర్నేత, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అద్దె బిల్డింగ్‌లో ఆఫీసు ఏర్పాటు చేశారు. ఆర్మూర్‌లో తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని మార చంద్రమోహన్ప్రచార వాహనాన్ని తిప్పుతున్నారు. ఆయనతో పాటు టికెట్‌కు దరఖాస్తు చేసిన వారిలో మరో ఏడుగురు ప్రచారం షురూ చేశారు. అర్బన్, రూరల్, బాల్కొండ రేసులో ఉన్న వారు ఆయా నియోజకవర్గాల్లో నిరంతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
బీజేపీలో హుషారు..
సెల్ఫ్ ప్రోగ్రామ్స్ కు తోడు పార్టీ నిర్ణయించిన కార్యక్రమాలతో బీజేపీ ఆశావహులు నిత్యం ప్రజల మధ్య ఉంటున్నారు. ప్రవాస్ అభియాన్ పేరుతో కర్నాటక, మహారాష్ట్ర, అసోం రాష్ట్రాల ఎమ్మెల్యేలు గతవారం జిల్లాలోని నియోజకవర్గాల్లో పర్యటించారు. ప్రస్తుతం మేరా మిట్టి – మేరా దేశ్కార్యక్రమంతో పల్లెలోని ప్రతీ వీధిలో తిరుగుతున్నారు. వారం కింద స్టూడెంట్స్ఇష్యూస్పై ఎమ్మెల్సీ కవిత ఇంటిని, డబుల్బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ టాపిక్‌పై రెండు రోజుల క్రితం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. ప్రచారంలో భాగంగా సిట్టింగ్ ఎమ్యెల్యేల వైఫల్యాలే టార్గెట్‌గా విమర్శలకు పదును పెడుతున్నారు.