కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మున్సిపల్​ అధికారులను వేడుకున్న వ్యాపారులు

జమ్మికుంట, వెలుగు : సుమారు 60ఏళ్లుగా కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తున్నామని, అర్దరాత్రి కాంప్లెక్స్​లను కూల్చి మా బతుకులు రోడ్డున పడేసింది కాక, ఇప్పుడు చుట్టూ ముళ్ల కంచె వేసి మా పొట్టలు కొట్టొద్దంటూ జమ్మికుంటలోని చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కమిషనర్​ సమ్మయ్య, సీఐ రాంచందర్ రావు, సిబ్బంది, పోలీసులు గురువారం రాత్రి కూల్చివేసిన స్థలంలో శుక్రవారం ముళ్ల కంచె వేయడానికి యత్నించగా వ్యాపారులు అడ్డుకున్నారు. అనంతరం జమ్మికుంటకు వచ్చిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్​ రెడ్డి, హుజూరాబాద్ టీఆర్ఎస్ ఇన్​చార్జి గెల్లు శ్రీనివాస్​యాదవ్​కు వ్యాపారులు వినతి పత్రం సమర్పించారు. భవన నిర్మాణ సముదాయం చేపట్టే వరకు కూల్చివేసిన స్థలంలోనే కూరగాయలు అమ్ముకుంటామని వేడుకున్నారు. 

దేవాలయ పురాతన భవనాల పరిశీలన

‌‌‌‌వేములవాడ, వెలుగు: స్థానిక రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పురాతన సంస్కృత పాఠశాల, శివపురంను శుక్రవారం రాష్ట్ర దేవాదాయశాఖ ఎస్ఈ మల్లికార్జున్ రెడ్డి, ఈఈ దుర్గాప్రసాద్ పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ భవనం పటిష్టతకు సంబంధించిన నాణ్యత ప్రమాణాల పరీక్ష నిర్వహించగా శిథిలావస్థకు చేరినట్లుగా గుర్తించామన్నారు. భవనం 1975లో నిర్మించినట్లు పేర్కొన్నారు. వారి వెంట ఆలయ ఈఈ రాజేశ్, డీఈలు రఘునందన్, రామేశ్వర్ రావు, ఏఈలు ఉన్నారు. 

ఎన్నికలొస్తేనే నిర్వాసితులు గుర్తొస్తారా?

‌‌‌‌వేములవాడ, వెలుగు: ఎన్నికలొస్తేనే ప్రభుత్వానికి నిర్వాసితులు గుర్తుకొస్తారా? అని కాంగ్రెస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ చార్జి అది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ​ వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణాలో, ముంపు గ్రామాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముంపు గ్రామస్తులకు డబుల్​బెడ్ రూం కోసం రూ.5 లక్షల 4 వేలు ఇస్తానన్న మాటను సీఎం కేసీఆర్​ నిలుపుకోవాలన్నారు. ముంపు గ్రామస్తులు 29న చేపట్టిన మహాధర్నాకు మద్దతు ఇస్తున్నామన్నారు. సమావేశంలో సర్పంచ్​లు రాజ్ కుమార్, ప్రదీప్​, ఎంపీటీసీ రాజశేఖర్., నాయకుల పాల్గొన్నారు.  

లంబాడాల అభివృద్ధికి కృషి 

కొత్తపల్లి, వెలుగు: లంబాడాల అభివృద్ధికి కృషి చేస్తానని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్​కుమార్ అన్నారు.  శుక్రవారం కొత్తపల్లి మండలం చింతకుంట శాంతినగర్​లోని సంత్ సేవాలాల్ మహరాజ్, దుర్గామాత ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తరతరాలుగా వెనుకబడ్డ బంజారా జాతి ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు పయనిస్తోందన్నారు. శాంతినగర్​లో బంజారా భవన్ నిర్మాణానికి తనవంతుగా రూ.10 లక్షలు, ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు, ఎల్.రమణ నిధుల నుంచి రూ.10 లక్షల చొప్పున కేటాయించేలా కృషి చేస్తానన్నారు. అనంతరం లంబాడాలు వినోద్​కుమార్​ను సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ తిరుపతినాయక్, ఐడీసీ మాజీ చైర్మన్ శంకర్​రెడ్డి, ఎంపీపీ శ్రీలత- పాల్గొన్నారు. 

సమస్యలు వెంటనే పరిష్కరించండి

బల్దియా ఎదుట శానిటేషన్ సిబ్బంది ఆందోళన

జగిత్యాల, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని బల్దియా ఆఫీస్ ఎదుట శానిటేషన్ సిబ్బంది శుక్రవారం ఆందోళనకు దిగారు. తమ వేతనాల్లో కోత విధిస్తున్నారని, చెప్పులు, సబ్బులు, నూనె తదితర వస్తువులు ఇవ్వడం లేదని అరోపించారు. అనారోగ్యంతో ఒక రోజు పనికి రాకుంటే తర్వాత విధుల్లోకి తీసుకోకుండా సతాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా అభద్రతా భావంతో పని చేస్తున్నామని వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

సెల్ ఫోన్ దొంగల అరెస్టు

16 ఫోన్లు, మోటార్ ​సైకిల్​ స్వాధీనం

కరీంనగర్ క్రైం, వెలుగు: నగరంలోని పలు ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళుతున్న వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు ఎత్తుకెళుతున్న దొంగలను శుక్రవారం టు టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఫోన్​ల చోరీలపై ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా రేకుర్తిలోని విజయపురికాలనీ, చింతకుంట టీఆర్ కే నగర్​కు చెందిన బోదాసు నర్సింహ అలియాస్ బాబి(19), ఒర్సు రాజేందర్(27) బోదాసు శేఖర్( 37)తోపాటు ఒక మైనర్​ను పట్టుకున్నారు. వారి వద్దనుంచి 16 సెల్ ఫోన్లు, డీలక్స్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. టు టౌన్ ఇన్​స్పెక్టర్​లక్ష్మీబాబు, ఎస్ఐలు నరేశ్, మహేశ్​ను అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ అభినందించారు.

ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌ బాధితులు ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు రండి

గోదావరిఖని, వెలుగు : ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌ బాధితులు ఎవరు ఎవరికి డబ్బులిచ్చినా పూర్తి వివరాలతో రావాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ శుక్రవారం పేర్కొన్నారు. ఆగస్టు 27,28 తేదీలలో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల లోపు బాధితులు తన క్యాంపు ఆఫీస్​కు రావాలన్నారు. బాధితులకు అన్యాయం జరిగితే ఉపేక్షించబోనని, తన అనుచరులైనా, పార్టీ కార్యకర్తలైనా తప్పు సరిదిద్దుకోకపోతే శిక్ష తప్పదని హెచ్చరించారు.

పార్టీకి పూర్వ వైభవం తేవాలి

తెలంగాణ అవినీతిలో కూరుకుపోయింది
  
కరీంనగర్ టౌన్, సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు:
జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి ఆరోపించారు. శుక్రవారం కరీంనగర్​డీసీసీ ఆఫీస్ లో, సిరిసిల్లలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు విస్త్రృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా ఒక్కటై అవినీతి సంపాదన కోసం తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు చేతులు చాపారని అన్నారు. సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రజలు నమ్ముతున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ప్రతీ కార్యకర్త అంటున్నారని, ఈ విషయం ప్రియాంకా గాంధీకి చెబుతానని వెల్లడించారు.  కష్టపడి సాధించుకున్న తెలంగాణ అవినీతిలో కూరుకుపోయిందని, సోనియా ఇచ్చిన తెలంగాణను కాపాడుకోవాలంటే ప్రతి కార్యకర్త రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలన్నారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్ అనుసరిస్తున్న  ప్రజా వ్యతిరేక విధానాలపై దృషి సారించాలని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్లు సత్యనారాయణ, నాగుల సత్యానారాయణ, మేడిపల్లి సత్యం, బల్మూరి వెంకట్, ఆది శ్రీనివాస్  పాల్గొన్నారు.

హన్మకొండ సభను విజయవంతం చేయండి

జమ్మికుంట, వెలుగు: హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో శనివారం జరిగే బీజేపీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం జమ్మికుంటలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్​కుటుంబ పాలన నుంచి కాపాడుకోవాలని అన్నారు. బీజేపీని చూపి అధికార టీఆర్ఎస్  భయపడుతోందని పేర్కొన్నారు. సమావేశంలో పట్టణాధ్యక్షులు మల్లేశ్, బీజేపీజిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

యోగా సాధనతో మెరుగైన ఫలితాలు 

కరీంనగర్ సిటీ, వెలుగు: యోగా సాధనతో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ తెలిపారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి యోగా, స్పోర్ట్స్ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ యోగ సాధకులు నూటికి నూరు శాతం అనుకున్న లక్ష్యాలు సాధిస్తారని అన్నారు. పోటీలలో జిల్లా నుంచి 300 మంది బాలబాలికలు పాల్గొన్నారు. కార్యక్రమంలో హార్టికల్చర్ డిప్యూటీ  డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఉపాధ్యక్షులు రమేశ్​రెడ్డి  పాల్గొన్నారు.

150 సీట్లతో ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌లు 

గోదావరిఖని, వెలుగు : ఈ అకడమిక్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌ నుంచే 150 సీట్లతో ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌లు నిర్వహించేందుకు రామగుండం మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీకి ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ అనుమతి ఇచ్చిందని ఎమ్మెల్యే చందర్‌‌‌‌‌‌‌‌, ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ హిమబిందు తెలిపారు. శుక్రవారం స్థానిక గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో కేక్‌‌‌‌‌‌‌‌ కట్‌‌‌‌‌‌‌‌ చేసిన అనంతరం వారు మాట్లాడారు. మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీలో 12 మంది ప్రొఫెసర్లు, 54 మంది అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్లు టీచింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తారన్నారు. అన్ని విభాగాలకు చెందిన ప్రత్యేక వార్డులలో ఐసీయూ, ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ థియేటర్లు, ల్యాబ్‌‌‌‌‌‌‌‌, ఎక్స్‌‌‌‌‌‌‌‌రే ఏర్పాటు చేశామని, త్వరలో సీటీ స్కాన్‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌ కూడా రాబోతుందన్నారు. సమావేశంలో మేయర్‌‌‌‌‌‌‌‌ అనిల్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, డిప్యూటీ మేయర్‌‌‌‌‌‌‌‌ అభిషేక్‌‌‌‌‌‌‌‌ రావు, డిప్యూటీ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ అశోక్‌‌‌‌‌‌‌‌, కార్పొరేటర్లు సుమలత, బాలరాజ్‌‌‌‌‌‌‌‌
 పాల్గొన్నారు. 

ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలి 

జిల్లాలో అటవీ విస్తీర్ణం తక్కువగా ఉంది

తిమ్మాపూర్, వెలుగు:  గ్రామాలలోని  ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలు నాటాలని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ స్పెషల్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ శాంత కుమారి తెలిపారు. హరితహారంలో భాగంగా మండల కేంద్రంలో రాజీవ్ రహదారికి ఇరువైపులా నాటుతున్న మొక్కలను శుక్రవారం ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కకు నీరు పోసి కాపాడాల్సిన బాధ్యతను గ్రామ పంచాయతీ పాలకవర్గం తీసుకోవాలని అన్నారు. కరీంనగర్ జిల్లాలో అటవీ విస్తీర్ణం తక్కువగా ఉందన్నారు. జిల్లాలో 35.90 కి.మి. పొడవులో 16 వేల మొక్కలు నాటే కార్యక్రమంలో పెద్ద మొక్కలకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అనంతరం కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ ప్రతి మండలంలో టార్గెట్ ప్రకారం గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేసుకొని మొక్కలు నాటాలన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా అటవీ శాఖ అధికారి నర్సింగరావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత, మున్సిపల్ కమిషనర్ ఇస్లావత్, ఆర్డీఓ ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

జగిత్యాల, వెలుగు: స్థానిక జగిత్యాల-, నిజామాబాద్ రోడ్డుపై ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొని ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట్ గ్రామానికి చెందిన ఎల్లాల ఆకాశ్​గురువారం ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం బైక్ పై జగిత్యాలకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ సమీపంలోని రహదారిపై జగిత్యాల డిపోకు చెందిన బస్సును ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆకాశ్​అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. 

పింఛన్ ​దరఖాస్తులను ఆన్​లైన్​ చేయరా?

ఉద్యోగులపై  కౌన్సిలర్ల ఆగ్రహం

మెట్ పల్లి, వెలుగు : ఆసరా, వితంతు, వికలాంగుల పింఛన్ల కోసం అప్లై చేసుకున్న దరఖాస్తులను రెండేళ్లుగా ఆన్ లైన్ చేయకుండా బల్దియా ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం బల్దియా లోని చైర్ పర్సన్ రణవేని సుజాత ఛాంబర్ లో నిర్వహించిన సమావేశంలో పలువురు కౌన్సిలర్లు మాట్లాడారు. వార్డులో పింఛన్​కోసం అప్లికేషన్ పెట్టుకున్న అనంతరం ఆన్​లైన్​లో చెక్​చేసుకోగా  పింఛన్​మంజూరు కాలేదని, డేటా నాట్ ఫౌండ్ అని వస్తోందన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు, మున్సిపల్​కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని చైర్ పర్సన్ ను కోరారు. అలాగే సిబ్బంది నిర్లక్ష్యంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.  సమావేశంలో కౌన్సిలర్ల కిషోర్, పురుషోత్తం, ఉమే రశీదా, ఫర్జానా బేగం తదితరులు పాల్గొన్నారు.

క్రెడిట్ కార్డ్ ఇస్తామని మోసం

రూ.లక్షా 40 వేలు డ్రా చేసిన నిందితుడు

గంభీరావుపేట, వెలుగు: క్రెడిట్ కార్డు ఇస్తామని ఫోన్​చేసి, ఖాతా ఖాళీ చేసిన ఘటన గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన మొటాటి శ్రీనివాస్ కు గురువారం అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి క్రెడిట్ కార్డు ఇస్తామని చెప్పగా.. ఫేక్ కాల్ అని శ్రీనివాస్ ఫోన్ పెట్టేశాడు. దీంతో అతడు మళ్లీ ఫోన్ చేసి తాను బ్యాంకు ఉద్యోగినని చెప్పి ఆధార్ కార్డు, ఐడీ కార్డు, వాటితోపాటు ఓ లింకును శ్రీనివాస్ వాట్సాప్ కు పంపించాడు. నమ్మిన శ్రీనివాస్ లింకును ఓపెన్ చేయడంతో తన బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్షా 40 వేలు డ్రా అయ్యాయని మెసేజ్ వచ్చింది. ఓటీపీలు, సీవీవీ నంబర్ చెప్పకుండానే డబ్బులు డ్రా అయ్యాయని బాధితుడు వాపోయాడు. వెంటనే సైబర్ క్రైం, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అప్రమత్తమై రూ.61 వేలను ఫ్రీజ్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్​తెలిపారు.

భూ తగాదాలతో వ్యక్తి హత్య

మేడిపల్లి, వెలుగు: మండలంలోని కొండాపూర్ లో భూ తగాదాలతో వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. కొండాపూర్ కు చెందిన పెండెం లక్ష్మణ్(58)కు అదే గ్రామానికి చెందిన జంగిలి నరేశ్, జంగిలి గంగనర్సయ్య కు మధ్య ఐదారేళ్లుగా భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో గురువారం లక్ష్మణ్ పొలం పనుల కోసం వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతకగా పొలంలోని బురదలో గాయాలపాలై చనిపోయి పడి ఉన్నట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం ఉదయం విచారణ చేపట్టారు. మృతుడి కొడుకు చంద్ర శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధీర్ రావు తెలిపారు. 

ఏకాగ్రతతో చదివితేనే సత్ఫలితాలు

జగిత్యాల, వెలుగు: ఏకాగ్రతతో చదివితేనే సత్ఫలితాలు వస్తాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల బీసీ స్టడీ సర్కిల్ ను పరిశీలించిన ఎమ్మెల్యే, బల్దియా చైర్ పర్సన్ శ్రావణితో కలిసి స్టూడెంట్స్ కు కోచింగ్ మెటీరియల్, రైటింగ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీలో దేశంలోనే  రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు వైద్యశాఖలో 13 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. కార్యక్రమం లో వైస్ చైర్మన్ శ్రీనివాస్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సాయిబాబా, కౌన్సిలర్ ఫోరం జిల్లా అధ్యక్షులు రాంకుమార్ పాల్గొన్నారు.