పాడి రైతులను ఆదుకోవాలె

తెలంగాణలో పాడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పాలకు మార్కెట్​లో గిట్టుబాటు ధర దొరకడం లేదు. రాష్ట్రంలో ఉన్న ఒక్కో కుటుంబానికి రోజుకు దాదాపు లీటరు చొప్పున సుమారు కోటి లీటర్ల పాలు అవసరం. కానీ డిమాండ్​కు తగినంత ఉత్పత్తి జరగడం లేదు. దీంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ డెయిరీ ఇతర రాష్ట్రాల నుంచి పాలు కొంటోంది. ఈ లోటును తీర్చడానికి 50 శాతం సబ్సిడీపై ఇంటికో బర్రెను కొనుగోలు చేసి ఇస్తామని గతంలో సీఎం కేసీఆర్​ ప్రకటించారు. కానీ ఎక్కడా రాలేదు. కొన్ని చోట్ల ఇస్తున్నా.. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన చాలా గేదెల్లో నాణ్యమైనవి ఉండటం లేదని రైతులు అంటున్నారు. పాడి రైతులను ఆదుకునేందుకు విజయ డెయిరీతోపాటు మదర్‌‌, కరీంనగర్‌‌, ముల్కనూర్‌‌ డెయిరీల్లో పాలు పోసే రైతులకు లీటరుకు నాలుగు రూపాయలు ప్రోత్సాహకాన్ని ఇస్తామని ప్రకటించారు. కొన్ని నెలలు ఆ ప్రోత్సాహకం ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత ఇవ్వడం ఆపేసింది. దీంతో రైతులు పాడి పరిశ్రమను వదిలి ఇతర మార్గాలు చూసుకుంటున్నారు. దీంతో పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోతోంది. 

ప్రైవేటు డెయిరీల్లోనూ ధర లేక..

తెలంగాణలో జిల్లాలవారీగా ఉన్న విజయ డెయిరీతోపాటు పలు ప్రైవేటు డెయిరీల ద్వారా నిత్యం పాల సేకరణ జరుగుతోంది. అయితే డెయిరీల్లో పాలు పోసే రైతులకు మార్కెట్​ధర దొరకడం లేదు. వెన్న శాతం, ఎస్ఎల్​ఆర్​పేరుతో పాలు నాణ్యతగా లేవని డబ్బులు తగ్గించేస్తున్నాయి. పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండే వర్సాకాలంలోనైతే ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వకపోగా లీటర్​రేటు కూడా తగ్గించేస్తున్నాయి. ఇటు పాడి రైతులకు గిట్టుబాటు ధర దొరక్కపోగా.. వినియోగదారులకూ పాలు తక్కువ ధరకు దొరకడం లేదు. మధ్యలో డెయిరీలే లాభపడుతున్నాయి. 

కేరళ సర్కారు తరహా..

పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. అర్హులైన రైతులకు 50 శాతం సబ్సిడీపై బర్రెలను ఇచ్చి.. మేత, దాణాకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కేరళ రాష్ట్రం పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా సాగుతోంది. ఆ రాష్ట్రంలోని కేరళ కో ఆపరేషన్​ ​మిల్క్ ​మార్కెటింగ్​ఫెడరేషన్ ​ద్వారా పాడి రైతులకు ప్రోత్సహకాలు అందజేస్తోంది. ఈ ఫెడరేషన్​ఆవుపాలకు లీటరుకు రూ.38 ఇస్తుండగా, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని పాడి రైతులు రూ. 17 నుంచి రూ.35 వరకే పొందుతున్నారు. పాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం పాల ఉత్పత్తిదారులకే కేటాయిస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తోంది. అయ్యంకాళి ఉరబన్‌‌ ఉపాధి హామీ పథకం (ఏయూఈజీఎస్‌‌) ద్వారా కేరళ ప్రభుత్వం పట్టణ ప్రాంతంలోని పాడి రైతులకు కూడా ఉపాధి చూపుతోంది. ఇలాంటి విధానాన్ని తెలుగు రాష్ట్రాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉంది. 

పాల ఉత్పత్తిపై దృష్టి పెట్టాలె..

కేరళలోని కోజికోడ్‌‌లో ఇటీవల రెండు రోజుల పాటు జరిగిన మొదటి ఆలిండియా డెయిరీ ఫార్మర్స్‌‌ వర్క్‌‌షాప్‌‌లో ఆలిండియా డెయిరీ ఫార్మర్స్‌‌ ఫెడరేషన్‌‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పాడి సహకార సంఘాలను మెరుగుపరచడంతోపాటు, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ ఫెడరేషన్​ ఏర్పాటు చేశారు. నవంబర్‌‌ 26న వర్గీస్‌‌ కురియన్‌‌ జయంతిని పాడి రైతుల దినోత్సవంగా నిర్వహించాలని వర్క్‌‌షాప్‌‌లో ప్రతినిధులు నిర్ణయించారు. 
- మూడ్ శోభన్,
రాష్ట్ర సహాయ కార్యదర్శి, 
తెలంగాణ రైతు సంఘం