సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారని రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేటలో పాడి రైతులు మండిపడ్డారు. సిరిసిల్లా- కామారెడ్డి ప్రధాన రహదారిపై పాడిరైతులు ధర్నా చేపట్టారు. రైతులకు మద్దతుగా బీజేపీ నాయకులు నిరసనలో పాల్గొన్నారు. లీటర్ కు నాలుగు రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని కల్పిస్తామని మోసం చేశారని ఆరోపించారు.
2018 సంవత్సరంలో జిల్లాలో పర్యటించిన కేసీఆర్ పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం రైతులను ఆదుకుంటానని చెప్పారని గుర్తు చేశారు. హామీలన్నీ తూతూ మంత్రంగా కొన్ని నెలలు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 50 నెలలుగా ప్రోత్సాహం నిలిపివేయడంతో తాము నష్టపోతున్నామని వాపోయారు. వెంటనే సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రైతులు డిమాండ్ చేశారు.