
చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్దునూర్ గ్రామంలో చేర్యాల విజయ డైరీ పాల శీతలీకరణ కేంద్రం మేనేజర్, సూపర్వైజర్లను పాడి రైతులు గృహ నిర్భంధం చేశారు. ఈ నెల 29 న చేర్యాల పాల డైరీ నుంచి పంపించిన 5 వేల లీటర్ల పాలల్లో ఉప్పు శాతం అధికంగా ఉందని హైదరాబాద్ మెయిన్ డైరీ అధికారులు తిరస్కరించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆదివారం మేనేజర్ మురళి, సూపర్వైజర్ అంజిరెడ్డి, భాస్కర్ లద్దునూర్ పాలసేకరణ కేంద్రాలకు వెళ్లారు. దీంతో పాడిరైతులు రెండు రోజులుగా సేకరించిన1420 లీటర్ల పాలను ఎందుకు రిజెక్ట్ చేశారో చెప్పాలని నిలదీశారు. అధికారుల నుంచి సరైన జవాబు చెప్పకపోవడంతో గృహ నిర్భంధం చేసి తమకు రావాల్సిన పాల డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పంచ్, ఎంపీటీసీలు మాట్లాడి డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అధికారులను విడిచిపెట్టారు.