![ఇంటింటికీ అచ్చమైన పాలు](https://static.v6velugu.com/uploads/2020/02/milk.jpg)
‘‘నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశాక అమెరికా వెళ్లాను. అక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేసి, ఐటీ కన్సల్టెంట్‌గా కొంతకాలం పనిచేశాను. మా ఆయన కెమికల్ ఇంజనీర్. ఇద్దరం అమెరికాలోనే కొంతకాలం ఉద్యోగాలు చేశాం. కొన్నాళ్ల తర్వాత ఇక్కడికొచ్చి ఏదైనా ఫుడ్ బిజినెస్ చేద్దామనిపించింది. ఏ బిజినెస్ చేద్దాం అని చాలారోజులు ఆలోచించి రీసెర్చ్ చేశాక.. డెయిరీ ఫామ్ పెడితే బాగుంటుందనిపించింది. మనం తినే వాటిలో ఏది ఉన్నా లేక పోయినా పాలు మాత్రం కచ్చితంగా ఉండాలి. కొన్ని ఇళ్లల్లో పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతిరోజు పాలు తాగుతారు. ఎప్పటి నుంచో పాలు మన డైలీ లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయాయి. అలాంటి పాలను ఇప్పుడు మనం చాలా మిస్ అవుతున్నాం. ముఖ్యంగా ప్రాసెస్డ్ మిల్క్ వచ్చాక స్వచ్ఛమైన బర్రె, ఆవు పాలు దొరకడం చాలా కష్టమైపోయింది. అందుకే సిటీలో కూడా స్వచ్ఛమైన పాలను ఇంటింటికీ అందించాలనే ఉద్దేశంతో డెయిరీ మొదలుపెట్టాం.
ఇలా మొదలైంది
స్వచ్ఛమైన పాలను అందరికీ అందుబాటులో అందించడమే మా బిజినెస్ లక్ష్యంగా పెట్టుకున్నాం. మా వారు కెమికల్ ఇంజనీర్ కాబట్టి డెయిరీ ఫామ్ మీద కొంత అవగాహన ఉంది. ‘పెద్ద చదువులు చదవుకుని డెయిరీ ఫామ్ పెట్టడమేంటి?’ అన్నారు కొంతమంది. కానీ ఇష్టపడి చేసే పనికి చదువుతో సంబంధం లేదని నా ఒపీనియన్. అందుకే ఎవరేమన్నా డెయిరీ మొదలుపెడదాం అని ఫిక్స్ అయ్యాం.
డెయిరీ ఫామ్ కోసం కొన్ని బర్రెలు, ఆవులతో పాటు కొంత స్థలం కూడా కావాలి. పశువులతో పాటు పశువుల మేత కూడా మేమే పండించాలనుకున్నాం. సిటీకి దూరంగా తాండూరులో కొంత భూమి కొని దాన్ని ఆర్గానిక్ మట్టిగా మార్చేశాం. మట్టిలో ఉన్న రసాయనాలు, పురుగుల మందులు తొలగించి మట్టిని శుభ్రం చేశాం. రసాయనాలు లేని మంచి పోషకాహారాన్ని తింటేనే పశువులు కూడా స్వచ్ఛమైన పాలు ఇవ్వగలుగుతాయి. అందుకే మేమే స్వయంగా దానికోసం గడ్డిని పండిస్తున్నాం. ఏవి తింటే పశువులు ఆరోగ్యంగా ఉంటున్నాయి. ఆహారాన్ని బట్టి మిల్క్ క్వాలిటీ ఎలా మారుతుంది. లాంటి విషయాలన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత మిల్క్ ప్రొడక్షన్‌ను స్టార్ట్ చేశాం.
ప్రొడక్ట్స్ కూడా..
స్వచ్ఛమైన పాలతో పాటే స్వచ్ఛమైన డెయిరీ ప్రొడక్ట్స్‌ను కూడా తయారు చేస్తే బాగుంటుందనిపించింది. అందుకే విదేశాల్లోని రకరకాల డెయిరీ ఫామ్స్‌కి వెళ్లి వాటి పనితీరును స్టడీ చేశాం. అలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి, అబ్జల్యూట్ పాలతో పాటు అబ్జల్యూట్ డెయిరీ ప్రొడక్ట్స్‌ను కూడా స్టార్ట్ చేశాం. పాల నుంచి తీసే వెన్న, నెయ్యి, పెరుగు, పన్నీర్ లాంటివి ఒకప్పుడు నేచురల్‌గా తయారు చేసేవాళ్లం. కానీ ఇప్పుడు అన్నింటికీ మెషిన్స్ వచ్చేశాయి. ఇప్పుడు దొరికే నెయ్యి, పన్నీర్‌లలో సహజత్వం లేకుండా పోయింది. అందుకే పాత విధానాల్లో ఇంట్లో చేసినట్టే ఉండాలని మెషిన్స్‌కి బదులు నేచరల్ విధానాలనే వాడుతున్నాం. పాలు, పన్నీర్, నెయ్యి, కోవా, మీగడ లాంటి అన్ని ప్రొడక్ట్స్.. ఎలాంటి ప్రిజర్వేటివ్స్, రసాయనాలు లేకుండా తయారు చేస్తాం. మా ప్రొడక్ట్స్‌లో కుండలో తోడేసిన గట్టిపెరుగు, పూసలా ఉండే నెయ్యి, పన్నీర్ చాలా ఫేమస్.
అచ్చంగా ఆర్గానిక్
నిజానికి మేము ప్రతీదీ ఆర్గానిక్ పద్ధతిలోనే తయారు చేస్తాం. కానీ ఈరోజుల్లో ‘ఆర్గానిక్’ అనే ట్యాగ్ ఉంటే కాస్ట్లీ అన్నట్టు బ్రాండ్ పడిపోయింది. అందుకే మేము ఆర్గానిక్ అనే ట్యాగ్ తగిలించకుండా ‘ఫామ్ ఫ్రెష్ ప్రొడక్ట్స్’ అని పిలుస్తున్నాం. ఇవి ప్యూర్ నేచురల్. కానీ కాస్ట్లీ కాదు. అందుకే మా బ్రాండ్ సక్సెస్ అవ్వగలిగింది. క్వాలిటీ, ప్యూరిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. కాబట్టే.. కొద్ది రోజుల్లోనే మాబ్రాండ్ పాపులర్ అయింది. మేము ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా.. నోటిమాట ద్వారానే మా బ్రాండ్ పేరు అందరికీ తెలిసింది.
ఇంటింటికీ డెలివరీ
ప్రస్తుతానికి మా బిజినెస్ బాగానే ఉంది. సిటీలో అబ్జల్యూట్ మిల్క్, మిల్క్ ప్రొడక్ట్స్ కొన్ని సూపర్‌మార్కెట్లు, ఆర్గానిక్ స్టోర్స్‌లో దొరుకుతున్నాయి. బిగ్ బాస్కెట్, సూపర్ డైలీలో ఆన్‌లైన్ ఆర్డరు కూడా ఇవ్వొచ్చు. ముందుముందు అచ్చంగా ప్రతీ ఇంటికీ పాలు డెలివరీ చేసేలా ప్లాన్ చేస్తున్నాం. ప్రాసెస్ చేసి ప్యాకెట్ల రూపంలో అందించకుండా.. తీసిన పాలు తీసినట్టుగా డైరెక్ట్‌గా ఇంటికి డెలివరీ చేయాలనుకుంటున్నాం. డీలర్ల ద్వారా ఆ పని చేస్తే కల్తీ జరిగే అవకాశం ఉందని సూపర్ డైలీ , బిగ్ బాస్కెట్ లాంటి సంస్థలతో టై అప్ అయ్యి, ఇచ్చిన పాలు ఇచ్చినట్టుగా ఇంటికి డెలివరీ చేసేలా ప్లాన్ చేస్తున్నాం. ఇంట్లో అందరూ ఒకప్పటిలా స్వచ్ఛమైన పాలను తాగేలా చేయడమే మా ఉద్దేశం. దానికోసం ఎంతైనా కష్టపడతాం.
ఓపిక ఉండాలి
డెయిరీ బిజినెస్‌కు ఈ రోజుల్లో చాలామంచి స్కోప్ ఉంది. కానీ దీన్ని కేవలం ప్రాఫిట్స్ కోసం కాకుండా ఇష్టపడి ప్యాషన్‌తో చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. పాలు అనేవి డైలీలైఫ్‌లో భాగం కాబట్టి వాటి క్వాలిటీ విషయంలో ఎంతో కేర్ తీసుకోవాలి. పశువుల మీద ప్రేమ, వాటి పెంపకంలో మెళకువలు తెలిసి ఉండాలి. పశువులు ఏయే సీజన్స్‌లో ఎంత పాలు ఇస్తాయి? వాటి ఆరోగ్యానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి? పశువుల దాణా ఎలా ఉండాలి? లాంటి విషయాలపై అవగాహన ఉండాలి. అలాగే స్వచ్ఛత మిస్ అవ్వకుండా ప్రొడక్షన్ యూనిట్‌ను ఎప్పటికప్పుడు సూపర్‌వైజ్ చేస్తూ ఉండాలి. ఎంతో ఓపికగా పనిచేస్తే.. తప్ప డెయిరీ బిజినెస్‌లో గ్రోత్ కనిపించదు. డెయిరీ ఫామ్ మొదలుపెట్టే ముందు కొన్ని డెయిరీ ఫారాలు చూసి, స్వయంగా పరిశీలించడం ముఖ్యం. అలాగే పాలు ఒక్కటే కాకుండా పాల ఉత్పత్తులను కూడా తయారుచేస్తూ బిజినెస్‌ను ఇంకా ఎక్స్‌ప్యాండ్ చేయొచ్చు.