బాలుడిని ముద్దు పెట్టుకోవడంపై క్షమాపణ చెప్పిన దలైలామా

బాలుడిని ముద్దు పెట్టుకోవడంపై క్షమాపణ చెప్పిన దలైలామా

టిబెట్ బౌద్ధమత గురువు, ఆధ్యాత్మికవేత్త దలైలామా ఓ బాలుడిని ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయన ఆ బాలుడికి, అతని కుటుంబసభ్యులకు క్షమాపణ చెబుతున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దలైలామా వద్దకు ఇటీవల ఓ భారతీయ బాలుడు వచ్చాడని, తన వద్ద ఆశీర్వాదం తీసుకునే క్రమంలో.. నువ్వు నా నాలుకను చప్పరించగలవా అని దలైలామా, ఆ బాలుడిని వీడియోలో అడగడం వినవచ్చు. ఆ తర్వాత అతడి పెదవులపై దలైలామా ముద్దు పెట్టినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఓ మత గురువు అయిన మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? పిల్లలతో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ మండిపడ్డారు.

ఈ సందర్భంగా దలైలామా ఆ బాలుడికి, అతని కుటుంబసభ్యులకు క్షమాపణలు తెలియజేస్తున్నట్టు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ఒక బాలుడు దలైలామాను కౌగిలించుకోవచ్చా అని ఇటీవల ఓ సమావేశాన్ని చూపించే వీడియో వైరల్ గా మారింది. ఇది చాలా మందిని బాధపెట్టిందని భావిస్తూ.. బాలుడికి, అతని కుటుంబ సభ్యులతో పాటు ప్రపంచంలోని చాలా మంది స్నేహితులకు క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నానని రాసుకొచ్చారు. దలైలామా బహిరంగంగా, కెమెరాల ముందు కూడా అతను అమాయకంగా, సరదాగా కలుసుకునే వ్యక్తులను తరచుగా ఆటపట్టిస్తాడని, ఈ ఘటనపై ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారని ట్వీట్ లో పేర్కొన్నారు. 

దలైలామా ఈ తరహా వివాదాలను ఎదుర్కోవడం కొత్తేం కాదు. కొన్ని సంవత్సరాల క్రితం తన వారసుడు మహిళ కావాలంటే ఆమె ఆకర్షణీయంగా ఉండాలని దలైలామా చేసిన వ్యాఖ్య అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై దలైలామా క్షమాపణలు తెలియజేశారు.

https://twitter.com/DalaiLama/status/1645312490597937152