
సౌతాఫ్రికా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ఐపీఎల్ 2025 ప్రారంభమైన రెండు రోజులకే ఏ మ్యాచ్ లో 300 పరుగులు వస్తాయో జోస్యం తెలిపాడు. 2025 మార్చి 24 న "చిన్న జోస్యాన్ని చెబుతున్నాను. ఏప్రిల్ 17 న ఐపీఎల్ లో మనం తొలిసారి 300 పరుగుల స్కోర్ ను చూస్తాము". అని స్టెయిన్ తన ఎక్స్ లో రాసుకొచ్చాడు. స్టెయిన్ చెప్పిన రోజు రానే వచ్చింది. ఐపీఎల్ 2025 లో భాగంగా గురువారం (ఏప్రిల్ 17) ముంబై ఇండియన్స్ తో, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ముంబై వాంఖడే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తుంది.
ఇరు జట్లలో పవర్ ఫుల్ హిట్టర్లు ఉండడంతో స్టెయిన్ ఈ మ్యాచ్ లో 300 పరుగులు వస్తాయని అంచనా వేశాడు. హెడ్, అభిషేక్ శర్మ, క్లాసన్, ఇషాన్ కిషాన్, నితీష్ రెడ్డిలతో సన్ రైజర్స్ దుర్బేధ్యంగా ఉంది. మరోవైపు ముంబై జట్టులో రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య వంటి అంతర్జాతీయ స్టార్లు ఉన్నారు. ఆదివారం (మార్చి 23) సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఏకంగా 528 పరుగులు నమోదయ్యాయి. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 492 పరుగులు వచ్చాయి. నేడు జరగనున్న మ్యాచ్ లో 300 పరుగులు రాకపోయినా ఈ రెండు భారీ స్కోర్ వచ్చేలా ఉంది.
ఐపీఎల్ ఇప్పటివరకు 300 పరుగులు నమోదు కాలేదు. చాలా జట్లు 250 కి పైగా పరుగులు సాధించినా 300 పరుగుల స్పెషల్ మ్యాజిక్ ఫిగర్ ను ఇప్పటివరకు ఏ జట్టు టచ్ చేయలేదు. బ్యాటింగ్ పిచ్ లు, బ్యాటర్ల హవాతో ఐపీఎల్ లో బౌలర్ల కష్టాలు కొనసాగుతున్నాయి. భారీ హిట్టింగ్ తో బౌలర్లను బ్యాటర్లు దడిపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో 300 పరుగులు బాదడం ఖాయంగా కనిపిస్తుంది. అభిమానులు కూడా ఈ సారి 300 పరుగులు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ టోర్నీలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో పాటు ముంబై ఇండియన్స్ తడబడుతుంది. రెండు జట్లు కూడా ఆడిన 6 మ్యాచ్ ల్లో 2 విజయాలు సాధించి.. మరో నాలు మ్యాచ్ ల్లో ఓడిపోయాయి. ఈ రోజు జరగబోయే మ్యాచ్ కు ఇరు జట్లకు అత్యంత కీలకం. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటుంది.
Will Wankhede witness a high-scoring thriller today? 😬#SRHvsMI #IPL2025 pic.twitter.com/57KbkyA82y
— CricTracker (@Cricketracker) April 17, 2025