IPL 2025: డేట్ లాక్ చేసుకోండి.. ఆ రోజే ఐపీఎల్‌లో తొలిసారి 300 పరుగులు: డేల్ స్టెయిన్

IPL 2025: డేట్ లాక్ చేసుకోండి.. ఆ రోజే ఐపీఎల్‌లో తొలిసారి 300 పరుగులు: డేల్ స్టెయిన్

ఐపీఎల్ ఇప్పటివరకు 300 పరుగులు నమోదు కాలేదు. చాలా జట్లు 250 కి పైగా పరుగులు సాధించినా 300 పరుగుల స్పెషల్ మ్యాజిక్ ఫిగర్ ను ఇప్పటివరకు ఏ జట్టు టచ్ చేయలేదు. బ్యాటింగ్ పిచ్ లు, బ్యాటర్ల హవాతో ఐపీఎల్ లో బౌలర్ల కష్టాలు కొనసాగుతున్నాయి. భారీ హిట్టింగ్ తో బౌలర్లను బ్యాటర్లు దడిపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో 300 పరుగులు బాదడం ఖాయంగా కనిపిస్తుంది. అభిమానులు కూడా ఈ సారి 300 పరుగులు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మాటలకూ బలాన్ని చేకూరుస్తూ సౌతాఫ్రికా మాజీ స్టార్ బౌలర్ డేల్ స్టెయిన్ 300 పరుగులు ఏ మ్యాచ్ ద్వారా వస్తాయో జోస్యం తెలిపాడు.

ALSO READ | PSL 2025: ఐపీఎల్‌లో మిస్సింగ్.. పాకిస్థాన్‌లో రూలింగ్: కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా సన్ రైజర్స్ మాజీ స్టార్

"చిన్న జోస్యాన్ని చెబుతున్నాను. ఏప్రిల్ 17 న ఐపీఎల్ లో మనం తొలిసారి 300 పరుగుల స్కోర్ ను చూస్తాము". అని స్టెయిన్ తన ఎక్స్ లో రాసుకొచ్చాడు.  ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 17 న సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఇరు జట్లలో పవర్ ఫుల్ హిట్టర్లు ఉండడంతో స్టెయిన్ ఈ మ్యాచ్ లో 300 పరుగులు వస్తాయని అంచనా వేశాడు. హెడ్, అభిషేక్ శర్మ, క్లాసన్, ఇషాన్ కిషాన్, నితీష్ రెడ్డిలతో సన్ రైజర్స్ దుర్బేధ్యంగా ఉంది. మరోవైపు ముంబై జట్టులో రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య వంటి అంతర్జాతీయ స్టార్లు ఉన్నారు. 

ఆదివారం (మార్చి 23) సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఏకంగా 528 పరుగులు నమోదయ్యాయి. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బ్యాటర్ల ధాటికి బౌలర్లు కుదేలయ్యారు. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 286 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ లో రాజస్థాన్ రాయల్స్ 242 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్ లో అత్యధిక పరుగులు  చేసిన రికార్డ్ సన్ రైజర్స్ పేరిట ఉంది. 2024 ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై సన్ రైజర్స్ 287 పరుగులు చేసింది.