అఫ్ఘన్లను అత్యాశ దెబ్బతీస్తోంది.. మేలుకుంటే రాబోయే రోజుల్లో వారిదే పెత్తనం: డేల్ స్టెయిన్

అఫ్ఘన్లను అత్యాశ  దెబ్బతీస్తోంది.. మేలుకుంటే రాబోయే రోజుల్లో వారిదే పెత్తనం: డేల్ స్టెయిన్

అఫ్ఘన్ల సత్తా ఏంటో తెలియాలంటే.. రెండేళ్ల క్రితం భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్(2023) ఫలితాలు ఓసారి చూడాలి. అండర్ డాగ్‌లుగా బరిలోకి దిగిన అఫ్ఘనిస్తాన్.. ఆ టోర్నీలో ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లను మట్టికరిపించింది. అయినప్పటికీ, అగ్రశ్రేణి జట్లు తేరుకున్నది లేదు. ఆ మరుసటి ఏడాది జరిగిన 2024 టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు అర్హత సాధించి.. తమ విజయాలు చేతివాటం కాదని నిరూపించారు. ఆ పొట్టి ప్రపంచకప్‌లో ఏకంగా బలమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లను ఓడించారు.

ఇప్పుడు మరోసారి అటువంటి ప్రదర్శన. దూకుడే తమ మంత్రమని విర్రవీగుతున్న ఇంగ్లండ్ జట్టును లాహోర్ గడ్డపై బోల్తా కొట్టించారు.  ఏకంగా 300పైచిలుకు చేసి.. ఛేదనలో ఇంగ్లీష్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఈ ప్రదర్శనలు వారిని ప్రశంసించేలా చేస్తున్నాయి. మాజీ క్రికెటర్లందరూ అఫ్ఘన్లకు జై కొడుతున్నారు. తాజాగా, సఫారీ స్పీడ్‪గన్ డేల్ స్టెయిన్ వారిపై ప్రశంసలు కురిపించారు. 

ఆఫ్ఘన్ల వ్యక్తిగత ప్రదర్శనలు, వారి ఐకమత్యం రాబోయే రోజుల్లో జట్టుకు మరిన్ని విజయాలు అందించిపెడతాయని స్టెయిన్ అభిప్రాయపడ్డారు. రాబోయే 10 ఏళ్లలో ఆఫ్ఘనిస్తాన్ ఐసిసి టోర్నమెంట్ గెలవగలదని జోస్యం చెప్పారు. కాకపోతే వారికి ఓర్పు, సహనం అవసరమని నొక్కి చెప్పారు.

"గతంలో ఆటగాళ్ళు సమయం దొరికినప్పుడల్లా కౌంటీ క్రికెట్ ఆడటానికి వెళ్ళేవారు. ఎంతో ఓపిగ్గా ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడి ఆటను మెరుగుపరుచుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలు లేవు. ఉరుకుల పరుగుల జీవితం. రెండు నిముషాల పాటు ఇన్‌స్టాగ్రామ్ కథనాన్ని చదివే సమయం లేదు. అఫ్ఘనిస్తాన్ క్రికెటర్ల ఆట ఇంతే. వేసిన ప్రతి బంతికి వికెట్ పడాలని కోరుకుంటున్నారు.. కొట్టిన ప్రతి బంతికి  ఆరు పరుగులు రావాలని ఆశ పడుతున్నారు.."

Also Read :- ఇంగ్లాండ్‌తో మ్యాచ్.. తుది జట్టులో బవుమాకు నో ఛాన్స్

"బహుశా..! ఈ ఆశలు టీ20 క్రికెట్ వల్లే. ఆ జట్టులో చాలా మంది ప్లేయర్లు ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగులు ఆడుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త మెళుకువలు నేర్చుకుంటున్నారు. ఇది మంచిదే. ఆర్థికంగానూ వారికి సహాయ పడుతుంది. కాకపోతే టెస్టులు, వన్డేలు.. టీ20లకు భిన్నమని వారు గుర్తించాలి. ఓర్పు చాలా అవసరం. అఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ళు నేర్చుకోవలసిన అతిపెద్ద విషయాలలో ఇదొకటి. ఇదొక్కటి అలవరచుకుంటే, రాబోయే 10 ఏళ్లలో వారు ఖచ్చితంగా ఐసీసీ టోర్నమెంట్లను గెలవగలరు.." అని స్టెయిన్ అన్నారు. 

అఫ్ఘన్ల ఊగిసలాట.. 

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్ఘనిస్తాన్ భవిష్యత్ నేడు తేలనుంది. శనివారం జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్.. 207 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను  ఓడిస్తే.. అఫ్ఘన్లు సెమీస్‌ చేరతారు. ఇప్పటికే మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ 15 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు నష్టపోయి 87 పరుగులు చేసింది.