IPL 2025 CSK: జీతం తక్కువ ఇచ్చినా పర్లేదు.. చెన్నై జట్టుతో ఉండాలని ఉంది: సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్

IPL 2025 CSK: జీతం తక్కువ ఇచ్చినా పర్లేదు.. చెన్నై జట్టుతో ఉండాలని ఉంది: సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడడం ఏ ఆటగాడికైనా ఒక కల. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆ జట్టులో ఉండడమే దీనికి కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన కూల్ కెప్టెన్సీతో జట్టులో వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతాడు. ఒత్తిడి సమయంలోనూ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ వారికి పూర్తి స్వేచ్ఛనిస్తాడు. ధోనీ సమక్షంలో ఆడి స్టార్ ప్లేయర్లుగా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. తాజాగా ఒక దిగ్గజ క్రికెటర్ సైతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. అతడెవరో కాదు దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్. 

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సెటప్‌లో భాగం కావడానికి తాను ఆసక్తిగా ఉన్నానని స్టెయిన్ తెలిపాడు. ముఖ్యంగా ధోనీకి తాను పెద్ద అభిమానిని అని.. చెన్నై జట్టు ఒప్పుకుంటే తాను జీతం తగ్గించుకొని పని చేయడానికి సిద్ధమని ఈ సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ వెల్లడించాడు. ప్రపంచ కప్‌లు, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న వ్యక్తి మనస్సు ఎలా ఉంటుందో.. అతను ఎలా పని చేస్తున్నాడో నాకు చూడాలని ఉందని స్టెయిన్ వీడియో సంభాషణలో చెప్పుకొచ్చాడు.  

Also Read :- నవంబర్ 24, 25న రియాద్‌‌‌‌లో ఐపీఎల్ వేలం!

ప్రస్తుతం ఐపీఎల్ లో ధోనీ కెప్టెన్సీకి రిటైర్మెంట్ ప్రకటించి ప్లేయర్ గా మాత్రమే కొనసాగుతున్నాడు. 2025 ఐపీఎల్ లో అన్ క్యాప్డ్ ప్లేయర్ గా బరిలోకి దిగబోతున్నాడు. ఇప్పటివరకు మాహీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ 5 ట్రోఫీలు గెలుచుకుంది. మరోవైపు స్టెయిన్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున బౌలింగ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్ లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ జట్టుకు బౌలింగ్ కోచ్ గా పని చేస్తున్నాడు.