మాకూ దళితబంధు ఇవ్వాలి.. దళితులు ఆందోళన

మాకూ దళితబంధు ఇవ్వాలి..  దళితులు ఆందోళన

మెదక్​ జిల్లా శివ్వంపేట మండలం అల్లిపూర్  గ్రామ దళితులందరికీ  దళితబంధు ఇవ్వాలని గురువారం  గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు దళితులు ఆందోళనకు దిగారు. తమ ఊరిలో 70  దళిత కుటుంబాలు ఉన్నాయని, అందరికీ దళితబంధు ఇవ్వాలని ఎమ్మెల్యేకు ఇప్పటికే చాలా సార్లు విజ్ఞప్తి చేశామని వారు తెలిపారు. తమకు సరైన ఉపాధి అవకాశాలు లేక కుటుంబ పోషణ భారంగా ఉందన్నారు. 

దళితబంధు కింద ఆర్థిక సహాయం మంజూరు చేస్తే స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుంటామన్నారు. అలాగే, అర్హులకే బీసీ, దళిత బంధు, గృహలక్ష్మి ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ గురువారం సిద్దిపేట  జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో కాంగ్రెస్​ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా, ర్యాలీ నిర్వహించారు. లచ్చపేట-రామక్కపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. 

కాంగ్రెస్​ నేతలు మాట్లాడుతూ అర్హులైన నిరుపేద బీసీ, దళిత కుటుంబాలకు దళితబంధు ఇవ్వకుండా బీఆర్ఎస్​ కార్యకర్తలకే ఇవ్వడమేంటని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు ఎవరైతే తీసుకుంటున్నారో వారినే బీఆర్ఎస్​ పార్టీ ఓట్లు అడగాలని, పథకాలు రాని కుటుంబాల వద్దకు ఓట్ల కోసం వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.