గరిడేపల్లి, వెలుగు: అధికార పార్టీ నాయకులకే దళిత బంధు ఇస్తున్నారని బీజేవైఎం రాష్ట్ర నాయకుడు సంకినేని వరుణ్ రావు ఆరోపించారు. గరిడేపల్లి మండలం పోనుగొడు గ్రామానికి చెందిన దళితులు శనివారం ఉదయం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. మధ్యాహ్నమైనా కలెక్టర్ బయటకు రాకపోవడంతో విషయం తెలుసుకున్న సంకినేని వరణ్‌రావు వారిని లోపలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో దళితులు కలెక్టర్ బయటకు రావాలని నినాదాలు చేయడంతో.. కొందరిని లోపలికి అనుమతిచ్చారు. అయితే ఆ సమయంలో మీటింగ్ జరుగుతుండడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులతో పాటు లోపలికి వెళ్లిన సంకినేని వరుణ్ రావును ‘ ఎవరు నువ్వు.. లోపలికి ఎందుకు వచ్చావ్.. మీటింగ్ అడ్డుకున్నందుకు కేసు పెడతా’ అని బెదిరించారు. దీంతో బాధితులు తమకోసం వచ్చాడంటూ కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు.
అనంతరం బాధితులు మాట్లాడుతూ గ్రామంలో 25 మందికి దళితబంధు మంజైరైతే 18 మంది బీఆర్‌ఎస్ నేతలే ఉన్నారని మండిపడ్డారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, ఇండ్లు, కారు ఉన్న వారు కూడా ఉన్నారని ఆరోపించారు. సర్పంచ్‌ను అడిగితే బీఆర్‌ఎస్‌లో చేరాలని ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ వాళ్లేనని తమకెలా తెలుస్తుందని కలెక్టర్ ప్రశ్నించగా.. లిస్ట్ ఫైనల్ చేసింది మీరే కదా అంటూ బాధితులు నిలదీశారు. దీంతో ఎంక్వైరీ చేసి అనర్హులను లిస్ట్ నుంచి తొలగిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.