ఖమ్మం, వెలుగు: చింతకాని మండలంలో దళితబంధు కింద బర్రెల యూనిట్లను ఎంపికచేసుకున్న లబ్ధిదారులు యూనిట్ల గ్రౌండింగ్ ఆలస్యం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కోమట్లగూడెం, లచ్చుగూడెం తదితర గ్రామాలకు చెందిన లబ్ధిదారులు జడ్పీ మీటింగ్ హాల్ లో గ్రీవెన్స్‌కు వచ్చారు. తమకు వెంటనే బర్రెల యూనిట్లు ఇప్పించాలంటూ కలెక్టర్ వీపీ గౌతమ్‌ను కోరారు. లంపీ స్కిన్ వ్యాధి వ్యాప్తి కారణంగా పశువుల రవాణాపై ఆంక్షలు ఉన్నాయని, ఒకట్రెండు వారాల్లో గ్రౌండింగ్ చేస్తామని చెప్పారు. అప్పటికీ రాకపోతే తమ యూనిట్లు మార్చుకునేందుకు అవకాశమివ్వాలని లబ్ధిదారులు కోరగా, ఒకసారి యూనిట్లను ఎంపిక చేసుకున్న తర్వాత మార్పు కుదరదని స్పష్టం చేశారు.
అంతకు ముందు గ్రీవెన్స్ కు వస్తున్న వెటర్నరీ జేడీ వేణు మనోహర్‌ను జడ్పీ ఆఫీస్ ఆవరణలో లబ్ధిదారులు ఘెరావ్ చేశారు. తమను నెలల తరబడి తిప్పుతున్నారంటూ నిలదీశారు. లంపీ స్కిన్ కారణంగా ఆలస్యమవుతుందని సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. భూమి కౌలు తీసుకొని గడ్డి పెంచితే నిరుపయోగంగా మారిందని, బర్రెల యూనిట్లు తీసుకోవాలని చెప్పిన ఆఫీసర్లే ఇప్పుడు ఆలస్యం చేస్తున్నారని వాపోయారు. చింతకాని మండలంలో 3800 మంది లబ్ధిదారుల్లో 540 మంది బర్రెల యూనిట్లను ఎంపిక చేసుకున్నారు. అందరి అకౌంట్లలో రూ.10 లక్షల చొప్పున ఆఫీసర్లు డబ్బులు జమ చేసినా, యూనిట్ల గ్రౌండింగ్ కాలేదు. హర్యానా నుంచి గేదెలు తీసుకొస్తే మన రాష్ట్రంలో వాతావరణానికి తేడా వచ్చి పశువులు చనిపోతున్నాయని, పక్కనే ఉన్న ఏపీ నుంచి తమకు గేదెలు తెచ్చుకునే అవకాశం కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఇదిలాఉంటే రెండు వారాల్లో బర్రెలు ఇయ్యకుంటే నిరహార దీక్షలు చేపడతామని వారు హెచ్చరించారు.
లంచాలు ఇవ్వలేక ఉద్యోగానికి రాజీనామా
భద్రాద్రి కొత్తగూడెం: లంచాలు ఇవ్వలేకనే తన ఉద్యోగానికి రాజీనామా చేశానని సుజాతనగర్ మండలం గరీబ్‌పేట గ్రామదీపిక షహనాజ్‌బేగం కలెక్టర్ అనుదీప్ కు కంప్లైట్ ఇచ్చారు. కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. సీసీ శ్రీలక్ష్మి తనకు రావాల్సిన జీతాన్ని ఇవ్వకుండా వేధిస్తున్నారని, ఏ లోన్ కావాలన్నా, జీతం కావాలన్నా లంచం ఇవ్వాల్సిందేనని వాపోయారు. ఇక ధరణిని రద్దు చేయాలని పాండురంగాపురానికి చెందిన రైతులు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీలో తమ ఇండ్లను గ్రామపంచాయతీలో నమోదు చేసుకున్నామని, ఇంటి పన్నులు చెల్లిస్తున్నామని, అయినా జీపీ ఆఫీసర్లు ఇంటి నెంబర్లు రద్దు చేశారని మల్లికారాణి కలెక్టర్‌కు దరఖాస్తు అందించారు. అడిషనల్ కలెక్టర్ కె. వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.