జమ్మికుంట, వెలుగు: రెండో విడత దళితబంధు పైసలు వెంటనే రిలీజ్చేయకపోతే, లోక్సభ ఎన్నికల్లో 2వేల మందితో నామినేషన్లు వేస్తామని లబ్ధిదారులు హెచ్చరించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితబంధు లబ్ధిదారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండో విడత దళితబంధు పైసలు అందకపోవడంతో ఇప్పటికే ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. మొదటి విడత పైసలతోపాటు అప్పు తెచ్చి చాలా మంది వ్యాపారాలు మొదలుపెట్టారని, వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. పార్లమెంట్ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అకౌంట్లలో పైసలు వేయాలని కోరారు. ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే 4,900 మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం ఫ్రీజ్చేసిన రెండో విడత పైసల కోసం 45 రోజులుగా అధికారులకు వినతిపత్రాలు ఇస్తూ.. పోరాటం చేస్తున్నామన్నారు.
ప్రభుత్వం స్పందించకుంటే వారం పది రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని, హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రెండు వేల మందితో, కలెక్టరేట్ ముందు 5 వేల మందితో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. సీఎంఓ ఆఫీసుకు 4,900 మంది లబ్ధిదారులు స్పీడ్ పోస్ట్ ద్వారా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్జిరాక్స్పేపర్లు జతచేసి లెటర్లు పంపాలని పిలుపునిచ్చారు.