
వరంగల్, వెలుగు: వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగ జంగాల కళాకారుడు, బలగం సినిమాలో పాటతో ఆకట్టుకున్న గాయకుడు పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు మంజూరు చేసింది. మొగిలయ్య కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకునే క్రమంలో ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో 'బలగం మొగిలయ్యకు ఆపదొచ్చింది' శీర్షికతో ‘వీ6 వెలుగు’ కథనం ప్రచురించింది. దీనికి మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‍రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డి స్పందించారు.
ట్రీట్మెంట్కు అవసరమైన ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. దళితబంధు ఇచ్చేలా చొరవ చూపుతామని ప్రకటించారు. ఈ క్రమంలో మంగళవారం వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య... మొగిలయ్య దంపతులకు దళితబంధు మంజూరు చేసిన పేపర్లను అందజేశారు. తర్వాత ఇద్దరినీ
సన్మానించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, ఎల్‍డీఎం రాజు పాల్గొన్నారు.