
- అవి కూడా బాల్కసుమన్ అనుచరులకే
- పునాదులు దాటని డబుల్ బెడ్రూమ్లు
- దళితులు, నిరుపేదలకు తీవ్ర నిరాశ
- అభివృద్ధి పనులన్నీ పెండింగ్‌లోనే
వెలుగు ప్రత్యేక ప్రతినిధి, చెన్నూర్: రాష్ర్ట ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన దళితబంధు, డబుల్ బెడ్రూమ్ఇండ్లు చెన్నూర్ నియోజకవర్గంలో ఉత్తవే అయ్యాయి. దళితబంధు స్కీమ్ కింద ఫస్ట్ ఫేజ్‌లో నియోజకవర్గానికి 100 యూనిట్లు మాత్రమే కేటాయించారు. సెకండ్ ఫేజ్‌లో సెగ్మెంట్‌కు 1500 యూనిట్లను సాంక్షన్ చేస్తామని చెప్పి పెండింగ్‌లో పెట్టారు. ఫస్ట్ ఫేజ్‌లో మంజూరైన 100 యూనిట్లను సైతం పేదలకు ఇవ్వకుండా ఎమ్మెల్యే బాల్క సుమన్ వెంట తిరిగే లీడర్లకే రెండు, మూడు ఇండ్ల చొప్పున ఇచ్చారు. పలువురు ప్రతిపక్ష పార్టీల లీడర్లకు రెండు, మూడు ఇండ్లు ఆఫర్ ఇచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేసుకున్నారు. అంటే.. సర్కారు పైసలతో నాయకులను కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
నియోజకవర్గంలో తమకు దళితబంధు వస్తే ఏదైనా బిజినెస్ పెట్టుకుందామని ఆశపడ్డ నిరుపేద దళితులకు నిరాశే మిగిలింది. సెకండ్ ఫేజ్‌లో అయినా వస్తుందనుకుంటే బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలే పోటీపడ్డారు. ఎమ్మెల్యేకు దగ్గరి మనుషులనే లబ్ధిదారులుగా సెలెక్ట్ చేశారు. రేపు మాపంటూ సెకండ్ ఫేజ్‌ను పెండింగ్‌లో పెట్టడంతో వారు సైతం నిరాశ చెందుతున్నారు. బీసీ బంధు, మైనారిటీ బంధు సైతం ఊరికి ఒకరిద్దరికే వచ్చింది. గృహలక్ష్మిదీ అదే పరిస్థితి. ప్రభుత్వ పథకాలు అందకపోవడంతో ఆయా వర్గాలకు చెందిన పేదలు బాల్క సుమన్‌పై భగ్గుమంటున్నారు.
పునాదుల్లోనే డబుల్ బెడ్ రూమ్స్..
చెన్నూర్‌లోని నేషనల్ హైవే 63 పక్కన డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు స్టార్ట్ చేసి నాలుగేండ్లు అవుతున్నా పునాదులకే పరిమితమయ్యాయి. రూ.21.02 కోట్లతో 400 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించాల్సి ఉండగా, బేస్మెంట్ లెవల్లోనే ఆగిపోయాయి. పట్టణంలో ఎక్కడా జాగలేనట్టు నేషనల్ హైవే 63 పక్కనున్న జగన్నాథ కుంటలో స్థలం కేటాయించారు. ఈ ల్యాండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూకు కన్వర్షన్ కాలేదు. దీంతో పక్క సర్వేనంబర్ పై ఫస్ట్ బిల్లు లేపారు. కాంట్రాక్టర్‌ను కమీషన్ల కోసం ఇబ్బంది పెట్టడం, సెకండ్ బిల్లు పెండింగ్ ఉండడంతో పనులు బంద్ చేసి ఇక్కడినుంచి సామాన్లన్నీ తీసుకొనిపోయాడు. దీంతో పేదలకు డబుల్ బెడ్రూంలు కలగానే మిగిలాయి.
పట్టణంలో వేలాది మంది పేదలకు ఇండ్లు లేక డబుల్ బెడ్రూంల కోసం ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ అందరికీ ఇండ్లు ఇస్తానని మాయమాటలు చెప్పి మోసం చేశారని పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందమర్రిలో రూ.29.68 కోట్లతో 560 డబుల్ బెడ్రూం నిర్మాణాలు చేపట్టారు. వీటిలో 400 కంప్లీట్కాగా, 160 ఇండ్లు అసంపూర్తిగా ఉన్నాయి. నిర్మాణం పూర్తయిన ఇండ్లను సైతం అర్హులకు కేటాయించలేదు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.15.15 కోట్లతో 286 ఇండ్లు నిర్మించారు. వాటిని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. కానీ ఇంతవరకు లబ్దిదారులకు కేటాయించలేదు. 2బీహెచ్‌కేల కోసం బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలే పోటీపడుతున్నారు. నియోజకవర్గంలో వేలాది మంది నిరుపేదలు కిరాయి ఇండ్లలో కాలం వెళ్లదీస్తున్నారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కంప్లీట్ కాలే....
మందమర్రి, రామకృష్ణాపూర్, చెన్నూర్‌లో రూ.7.20 కోట్ల చొప్పున మొత్తం 21.60 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు ఆగిపోయాయి. చెన్నూర్‌లో బిల్డింగ్ కంప్లీట్ కాకముందే మంత్రి హరీశ్ రావుతో ఓపెనింగ్ చేయించారు. నెలలు గడుస్తున్నా పనులు పూర్తికాకపోవడంతో వ్యాపారులు, ప్రజలు మండిపడుతున్నారు. పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. చిరువ్యాపారులు రోడ్ల పక్కన ఎండ, వానలో కూరగాయలు అమ్ముకుంటూ అవస్థలు పడుతున్నారు.
బీఆర్ఎస్ లీడర్లకే ఇచ్చిన్రు..
నాకు గుంట భూమి కూడా లేదు. కూలినాలి చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాను. రోజూ రెక్కాడనిదే డొక్కాడని పరిస్థితి. మా ఊళ్ళో 70 పర్సెంట్ దళితులే ఉన్నరు. కానీ నాలాంటి పేదలకు దళితబంధు రాలేదు. సర్కారు కొలువు ఉన్న వ్యక్తి కుటుంబానికి ఇచ్చిన్రు. అతను ఎంపీటీసీ బంధువు కావడంతోనే దళితబంధు వచ్చింది. ఎమ్మెల్యే బాల్క సుమన్ నిరుపేద కుటుంబాలను పట్టించుకోలేదు. దీంతో బీఆర్ఎస్ లీడర్లకు మాత్రమే లబ్ధి జరిగింది తప్ప పేద దళితులకు నిరాశే మిగిలింది.
‑ దుర్గం వినోద్, ఆలుగామ, కోటపల్లి
బేస్మెంట్ లెవల్లోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్..
యువతకు ఉపాధి కోసం వివిధ రంగాల్లో కోచింగ్ ఇచ్చేందుకు రూ.5 కోట్లతో చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బిల్డింగ్ పనులు బేస్మెంట్ లెవల్లోనే ఆగిపోయాయి. నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా పనులు చేయకపోవడంతో బేస్మెంట్కు పగుళ్లు తేలి శిథిలావస్థకు చేరాయి. కోచింగ్ కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులు స్కిల్ డెవలప్మెంట్ పనులు ఎప్పుడవుతాయని ప్రశ్నిస్తున్నారు.
డంపింగ్ యార్డు పనులు సైతం....
రూ.కోటి వ్యయంతో పట్టణ శివారులోని బుద్ధారం రోడ్డులో నిర్మిస్తున్న డంపింగ్ యార్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులు కూడా పూర్తికాకుండానే మంత్రి హరీశ్‌రావుతో ఓపెనింగ్ చేయించారు. ప్రస్తుతం పట్టణంలోని అన్ని వార్డుల నుంచి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పక్కనున్న ఖాళీ స్థలంలో కుప్పలు పోసి తగులపెడుతున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగ కమ్మేస్తోంది. పరిసర ప్రాంతాల ప్రజలు రోగాలబారిన పడుతున్నామని వాపోతున్నారు.