
హనుమకొండ సిటీ, వెలుగు : దళితబంధు పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ హెచ్చరించారు. దళితబంధును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏకశిలా పార్కు నుంచి ర్యాలీగా హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్ల వరకు చేరుకొని అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ దళితబంధు అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.
ఎమ్మెల్యేల అనుచరులకు మాత్రమే పథకాలు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల హామీ మాటలకే పరిమితమైందని, గృహలక్ష్మి పథకం కింద నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు మాత్రమే కేటాయిస్తామనడం సరికాదన్నారు.కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంగి ఎలేందర్, జన్ను రవి, హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మల మనోహర్, రెంటాల దేవా, నాయకులు రాజారపురత్నం, రాచర్ల రాజేందర్, ఓరుగంటి శ్రీనివాస్, బత్తుల సుప్రియ పాల్గొన్నారు.