- దళితుబంధు లిస్ట్‌పై తెగని పంచాయితీ
- పెండింగ్‌లో ఎమ్మెల్యే రాములు నాయక్ జాబితా
- ఫస్ట్ లిస్ట్ అప్రూవ్ చేసుకున్న మదన్ లాల్
ఖమ్మం, వెలుగు : వైరా నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్, బీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్ మధ్య దళితబంధు లిస్ట్ పంచాయితీ కంటిన్యూ అవుతున్నది. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో మదన్‌లాల్ జోక్యం చేసుకోవడం, ఆయన పంపిన లిస్ట్‌ను మంత్రి అజయ్ కుమార్ ఒత్తిడితో కలెక్టర్ ఆమోదించారని రాములు నాయక్ ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే రాములు నాయక్ 1,100 మంది పేర్లతో జాబితా సిద్ధం చేసి దాదాపు మూడు వారాలు దాటుతున్నా.. అది ఫైనల్ కాలేదు. 472 మంది పేర్లతో మదన్ లాల్ ఇచ్చిన జాబితాను మంత్రి ఒత్తిడి మేరకు కలెక్టర్ అప్రూవ్ చేశారని రాములు నాయక్ అంటున్నారు.
దీంతో తన నియోజకవర్గంలో మీ పెత్తనం ఏంటంటూ ఇప్పటికే ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి అజయ్ కుమార్ మీద రాములు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి హరీశ్ రావు ఫోన్లో మాట్లాడి గొడవ సద్దుమణిగే ప్రయత్నం చేసినా.. ఇంకా పంచాయితీ తెగలేదని తెలుస్తున్నది. బుధవారం (ఇయ్యాల) కొంత మంది ముఖ్య నేతలతో హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావును కలిసేందుకు వెళ్లాలని రాములు నాయక్ నిర్ణయించారు. ఈ పంచాయితీ హరీశ్ వద్దే తేల్చుకోవాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
ALSO READ: చంద్రబాబు అరెస్ట్‌పై తప్పుడు ప్రచారం : విజయశాంతి
తాను పంపిన దళిత బంధు జాబితా ఆమోదింపజేసుకోవాలని రాములు నాయక్ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మదన్ లాల్ సెకండ్ లిస్ట్ తయారీలో ఉన్నట్టు సమాచారం. లబ్ధిదారుల ఎంపిక తన చేతుల మీదుగా జరిగితేనే వచ్చే ఎన్నికల్లో తనకు మేలు జరుగుతుందన్న భావనలో మదన్ లాల్ ఉండగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను లెక్క చేయడం లేదంటూ రాములు నాయక్ మండిపడుతున్నారు.
మంగళవారం కొంత మంది లబ్ధిదారులు వైరాలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లి.. తమకు దళితబంధు వస్తుందా? లేదా? అని ఆరా తీశారు. వారిని పిలిపించుకొని ఎమ్మెల్యే రాములు నాయక్ ధైర్యం చెప్పారు. తాను హైదరాబాద్ వెళ్తున్నానని, ఎలాగైనా ఇప్పిస్తానంటూ వారికి సర్ది చెప్పారు. రాములు నాయక్‌తో కలిసి మదన్ లాల్ పనిచేయాల్సి ఉండగా.. వీరిద్దరూ ఇలా గొడవలు పడడం ప్రత్యర్థులకు కలిసి వస్తుందా అనే చర్చ కార్యకర్తల్లో జరుగుతున్నది.