హుజూరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లో ప్రవేశపెట్టిన దళితబంధు స్కీంను రెండేండ్లుగా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని దళితబంధు సమన్వయ కమిటీ చైర్మన్ కొత్తూరు రమేశ్ విమర్శించారు. ఆ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఎన్నికల ప్రచారానికి వస్తే తమ ఇండ్లలోకి అడుగుపెట్టనివ్వబోమని ఆయన పేర్కొన్నారు. ఆదివారం హుజూరాబాద్ లో ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో రెండువేల మందికి దళితబంధు మొదటి విడత కూడా రాలేదన్నారు.
రెండో విడత కూడా చాలా మందికి రావాల్సి ఉందన్నారు. అధికారుల దగ్గరికి వెళ్లినా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎలక్షన్ కోడ్ కు, దళితబందుకు సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అన్ని అర్హతలు ఉన్నా కొంతమందికి దళితబంధు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీచేస్తున్న ఈటల రాజేందర్, పాడి కౌశిక్ రెడ్డి, ప్రణవ్ మొదటగా దళితబంధుపై పూర్తి క్లారిటీ ఇచ్చిన తర్వాతే ప్రచారం కొనసాగించాలన్నారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వెంటనే దళిత బంధు మొదటి, రెండో విడతలు పూర్తిచేసేలా అధికారులను ఆదేశించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో దళిత బంధు సమన్వయ కమిటీ నాయకులు సొల్లు రమేశ్, ముప్పు భిక్షపతి, గడ్డం దయాకర్, రాజయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.