దళితబంధు పంచాయితీ.. లబ్ధిదారులు ఎక్కువ.. యూనిట్లు తక్కువ

దళితబంధు పంచాయితీ..  లబ్ధిదారులు ఎక్కువ.. యూనిట్లు తక్కువ
  •      లబ్ధిదారులు ఎక్కువ.. యూనిట్లు తక్కువ 
  •      అనుచురులకే ఇచ్చేలా చూస్తున్న నేతలు 
  •      లిస్టుల తయారీ తీరుపై మండిపడుతున్న దళితులు 
  •      అధికార పార్టీ కార్యకర్తలు సైతం సీరియస్.. బుజ్జగిస్తున్న లీడర్లు

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు  సడిమెల్ల ఆంజనేయులు. సిద్దిపేట అర్బన్ మండలం బూర్గుపల్లి గ్రామం. కిడ్నీ సంబంధిత వ్యాధితో  పదేండ్లుగా బాధపడుతూ డయాలసిస్  చికిత్స చేయించుకుంటున్నాడు. ఆరోగ్యం కోసం ఊర్లో ఉన్న ఒక ఎకరం పొలం, ఇల్లును అమ్ముకున్నాడు. కుటుంబ సభ్యులు కూలీ పనులకు వెళ్లితే వచ్చే సంపాదనపై ఆధారపడి జీవిస్తున్నాడు. ప్రభుత్వం దళితబంధు అందజేస్తే ఏదైనా వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటానని అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నాడు. కానీ ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోతున్నాడు. ఇదీ ఆంజనేయులు ఒక్కడి పరిస్థితే కాదు.. జిల్లాలో చాలా మంది లబ్ధిదారుల పరిస్థితి ఇలాగే ఉంది. 

సిద్దిపేట, వెలుగు : జిల్లాలోని ప్రతి పల్లెలో దళితబంధు పంచాయితీ నడుస్తోంది. దళితబంధును ఆశిస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండడం.. యూనిట్లు తక్కువగా మంజూరు కావడంతో రగడ మొదలైంది. వచ్చిన కొద్దిపాటి యూనిట్లను అధికార పార్టీ లీడర్లు వారి అనుచరులకే కేటాయిస్తుండడంతో దళితబంధు జాబితాల తయారీ తీరుపై దళితులు మండిపడుతున్నారు. ప్రస్తుతం పల్లెల్లో రెండోత విడత దళితబంధు లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు జరుగుతోంది. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్  నియోజకవర్గాలతో పాటు జిల్లా పరిధిలోకి వచ్చే జనగామ, మానకొండూరు నియోజకవర్గాల్లోని మండలాలకు సంబంధించి రెండో విడత 5 వేల దళిత బంధు యూనిట్లు మంజూరయ్యాయి. కాగా నియోజకవర్గానికి 1100 చొప్పున కేటాయిస్తున్నారు. దీనికి సంబంధించి ఈనెల 16 లోగా లిస్టులు రెడీ చేయాల్సి ఉంది.

ఈ క్రమంలో మండలాల వారీగా స్పెషల్ ఆఫీసర్లు జాబితాలను సిద్ధం చేసి స్థానిక ఎమ్మెల్యే అనుమతితో కలెక్టర్ కు పంపుతారు. అయితే యూనిట్లు తక్కువగా మంజూరు కావడంతో గ్రామాల్లోని అన్ని దళిత కుటుంబాలకు దళితబంధు అందే పరిస్థితి లేదు. ఈ క్రమంలో అధికార పార్టీ లీడర్లు కొత్త కొత్త ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నారు. ఈ పథకం నిరంతర ప్రక్రియ అని, కొన్ని చోట్ల గ్రామాలకు మంజూరైన యూనిట్లను అందరూ సమానంగా పంచుకోవాలని చెబుతున్నారు. కాగా మరికొన్ని చోట్ల తమకు భవిష్యత్తులో ఇస్తామని అగ్రిమెంట్ ఇవ్వాలని, ఇంకొన్ని చోట్ల గ్రామసభలు నిర్వహించి ఎంపిక చేయాలని లబ్ధిదారులు డిమాండ్​ చేస్తున్నారు. 

బుజ్జగింపుల పర్వం..

దళితబంధు జాబితాల తయారీపై వ్యతిరేకత వస్తుండడంతో ఆయా ప్రాంతాల్లోని అధికార పార్టీ నేతలు బుజ్జగింపు పర్వానికి తెరలేపారు. కొండపాక మండలంలో ఒక గ్రామంలో నిరసన వ్యక్తం చేసిన వారిని బుజ్జగించడంతో పాటు వారిలో కొందరికి దళిత బంధు ఇస్తామని  నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. మరొక గ్రామంలో ప్రతి పక్ష పార్టీ సానుభూతి పరులు తమ పార్టీలో చేరితే దళిత బంధు ఇస్తామని ఆశచూపుతున్నట్టు సమచారం. దుబ్బాక నియోజకవర్గంలో అవసరమైన చోట్ల బీజేపీ సానుభూతి పరులకు దళిత బంధు ఇవ్వాలనే దిశగా అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.

ఆందోళనలు... ఘర్షణలు

దళితబంధు జాబితాల తయారీ విషయంలో పలు గ్రామాల్లో ఆందోళన, నిరసన కార్యక్రమాలతో పాటు ఘర్షణలు చోటు చేసుకుంటున్న ఉదంతాలు ఉన్నాయి. వీటిని చాలా చోట్ల బయటకు రాకుండా చూస్తున్నారు.

  •     నారాయణ రావు పేట మండలం లక్ష్మీదేవిపల్లిలో ఇటీవల దళితబంధు జాబితా తయారీ విధానంపై ఘర్షణ జరిగి ఒక యువకుడి చేయి విరిగింది.
  •     సిద్దిపేట అర్బన్ మండలం బూర్గుపల్లికి చెందిన వారు తమ పేర్లను దళిత బంధుకు పరిశీలించడం లేదని మంత్రి క్యాంపు ఆఫీస్​ వద్ద నిరసన తెలిపారు.
  •     కొండపాక మండలం అంకిరెడ్డి పల్లిలో సర్పంచ్, ఎంపీటీసీలు తమకు అనుకూలురైన వారికే దళిబంధు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని గ్రామంలో ర్యాలీ నిర్వహించి వారి దిష్టిబొమ్మలను      దహనం చేశారు.
  •     కొండపాకలో దళిత బంధు కోసం మహిళలు పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ను  అడ్డుకుని నిరసన తెలిపారు.
  •     వర్గల్ మండలం నాచారంలో దళిత బంధు జాబితాలను ఏకపక్షంగా తయారు చేస్తున్నారని  రాస్తారోకో చేపట్టారు. 
  •      కొమురవెల్లి మండలం గురువన్నపేటలో బీఆర్ఎస్ నేతలు తమకు అనుకూలమైన వారి పేర్లతో దళిత బంధు లిస్టు తయారు చేస్తున్నారని ఆరోపిస్తూ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి         యాదగిరిరెడ్డి దిష్టి బొమ్మలను బీఆర్ఎస్ కార్యకర్తలే దహనం చేశారు.

గ్రామ సభల్లో ఎంపిక చేయాలి

దళితుల స్థితిగతులను మార్చడం కోసం ప్రవేశపెట్టామంటున్న దళితబంధు ఇప్పుడు అర్హులైన వారికి అందే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పథకం పేరిట సాగుతున్న రాజకీయాలు దళితులను మనోవేదనకు గురి చేస్తున్నాయి.  గ్రామ సభలు నిర్వహించి అర్హులైన పేదలను దళిత బంధుకు ఎంపిక చేయాలి. 

-  సనువల ప్రసాద్ , జిల్లా దళిత సంఘం నాయకుడు