కమలాపూర్, వెలుగు: దళితబంధు లబ్ధిదారుల ఫోటో సేకరణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన దళితబంధు యాప్‌లో పని చేయలేమని, ఆ పని నుంచి వెసులుబాటు కల్పించాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శులు శనివారం కమలాపూర్ఎంపీడీవో పల్లవికి వినతిపత్రం అందజేశారు. హుజురాబాద్నియోజకవర్గవ్యాప్తంగా దళితబంధు పథకంలో గుర్తించిన లబ్ధిదారులకు ఇప్పటివరకు 80 శాతం యూనిట్లను అందజేశారు. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు యాప్‌లో యూనిట్లు అందుకున్న లబ్ధిదారుల వివరాలు, వారి ఫోటోను పొందుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. వారం క్రితం ఇదే విషయంపై ఎస్సీ కార్పొరేషన్ నుంచి గూగుల్ మీటింగ్ నిర్వహించారు. దళితబంధు పథకంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, యాప్‌కు తాము పని చేయలేమని మీటింగ్‌లో పంచాయతీ కార్యదర్శులు తేల్చిచెప్పారు. అయినప్పటికి ప్రభుత్వం యాప్విషయంలో తగ్గలేదు. దీంతో కమలాపూర్మండలంలోని పలు గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు శనివారం ఎంపీడీవో ఆఫీసుకు వెళ్లి ఎంపీడీవో పల్లవికి వినతిపత్రం అందించారు.
దళితబంధు పథకం కింద తీసుకున్న వెహికల్స్‌ను చాలామంది లబ్ధిదారులు అమ్ముకున్నారని, ఇంకొందరు వెహికల్స్‌ను వేరే ప్రాంతాలకు లీజుకు ఇచ్చారని చెప్పారు. అలాగే యూనిట్లలో షాపుల విషయంలోనూ అక్రమాలు జరిగాయని, ఒక్కో షాపుపై ముగ్గురు నలుగురు లబ్ధిదారులు దళితబంధు డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. దీనిపై అడిగితే లబ్ధిదారులు స్పందించడం లేదన్నారు. ఫోన్లకు రెస్పాండ్కావడం లేదని, యూనిట్ల విషయంలో సరైన ప్రణాళిక లేకుండా స్కీంను అమలు చేసి ఇప్పుడు ఫోటోలను లోడ్చేయమటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. యాప్ పనుల నుంచి పంచాయతీ కార్యదర్శులను తప్పించాలని కోరారు.