బలగం ‘మొగిలయ్య’కు దళితబంధు

నర్సంపేట, వెలుగు :   బలగం ‘మొగిలయ్య’ కు  రాష్ర్ట ప్రభుత్వం దళిత బంధును శాంక్షన్​ చేసిందని  నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి వెల్లడించారు.   వరంగల్​ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు బలగం సినిమాలో క్లైమాక్స్​ సాంగ్​  ‘‘తోడుగా మా తోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కాడెళ్లినావు కొమురయ్యా..” పాడి  ప్రేక్షకుల మన్ననలు పొందిన విషయం తెలిసిందే.  కొంతకాలంగా మొగిలయ్యను వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు,  ఆయన కుటుంబం పడుతున్న కష్టాలపై వచ్చిన వార్తలు అందరినీ కలిచివేశాయి.

 దీంతో పలువురు దాతలు ముందుకు వచ్చి తోచిన ఆర్థిక సాయం అందించారు. మొగిలయ్య కుటుంబ పరిస్థితిని  సీఎం దృష్టికి తీసుకెళ్లిన స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి  దళిత బంధు శాంక్షన్​ చేయించారు.  బుధవారం నర్సంపేట క్యాంప్​ ఆఫీసుకు మొగిలయ్య, కొమురమ్మ దంపతులు వచ్చి దళితబంధు శాంక్షన్​ చేయించినందుకు ఎమ్మెల్యే పెద్దికి  కృతజ్ఞతలు తెలిపారు.