దళితబంధు ఇప్పిస్తనని..రూ.6 లక్షల కమీషన్​

  •     డబ్బులు వాపస్ ​ఇవ్వాలని సర్పంచ్​ ఇంటి ముందు బాధితుల ధర్నా
  •     సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలం తోర్నాలలో ఘటన

చేర్యాల, వెలుగు :  దళితబంధు ఇప్పిస్తానంటూ ఓ సర్పంచ్ ​కొడుకు దళితుల నుంచి లక్షల్లో వసూలు చేసి ముఖంచాటేశాడు. పథకం రాదని గుర్తించిన పేదలు తమ డబ్బులు వాపస్​ఇవ్వాలని డిమాండ్​చేస్తూ సర్పంచ్​ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలం తోర్నాలలో వెలుగులోకి వచ్చింది. తొర్నాల బీఆర్ఎస్​సర్పంచ్ తాళ్లపల్లి రాజమ్మ కొడుకు భిక్షపతి రెండో విడతలో దళిత బంధు స్కీమ్ ఇప్పిస్తానని పేదలకు ఆశచూపాడు. తనకు కమీషన్​ఇస్తే.. పథకం వచ్చేలా చూస్తానని నమ్మించాడు.

ఈ మేరకు గ్రామానికి చెందిన పేదలు మ్యాక యాదగిరి, వంగ ఎల్లయ్య, పేరం రవి, మ్యాక శేఖర్, పేరం పర్శరాములు, ఎర్ర మల్లేశం నుంచి రూ. లక్ష చొప్పున మొత్తం రూ.6 లక్షలు వసూలు చేశాడు. అడిగినప్పుడల్లా ఇదిగో అదిగో అంటూ దాటవేస్తున్నాడు. స్కీమ్ రాకపోతే ఇచ్చిన డబ్బులు మిత్తితో కలిపి వాపస్ ఇస్తానని మొదట్లో నమ్మబలికిన భిక్షపతి.. ఇప్పుడు ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు.

ఎవరికిచ్చారో వాళ్లనే అడగాలని వారు తప్పుకోవడంతో మంగళవారం బాధితులు సర్పంచ్​ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తమ డబ్బులు తమకు వచ్చే వరకు ధర్నా విరమించమని తేల్చిచెప్పారు. కాగా బీఆర్ఎస్ మండల స్థాయి నాయకుడు చెబితేనే దళిత బంధు కోసం వారి దగ్గర డబ్బులు తీసుకుని ఆయనకు ఇచ్చినట్లు సర్పంచ్​కొడుకు భిక్షపతి చెప్తున్నాడని బాధితులు అంటున్నారు.