- ఆలేరు ఆత్మీయ సమ్మేళనంలో గళమెత్తిన బీఆర్ఎస్ లీడర్లు
- సర్పంచ్‌లకు బిల్లులు వస్తలేవని, స్థానిక సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఫైర్
- ప్రజల్లో అసంతృప్తి మొదలైంది
- ఇలాగైతే మున్ముందు కష్టమేనని ఆందోళన
యాదాద్రి, వెలుగు: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ లీడర్లు గళమెత్తారు. ప్రజలు, కార్యకర్తల సమస్యలపై పార్టీ పెద్దలను ప్రశ్నించారు. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని మోటకొండూరులో శుక్రవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మోటకొండూరు మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, లీడర్లు తమ బాధలు చెప్పుకున్నారు.
‘‘ఏండ్లు గడుస్తున్నా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తలేరు. అర్హులకు దళితబంధు రావడం లేదు. మాకేం మేలు జరిగిందని ప్రజలు మొహం మీదే అంటున్నారు. మన కార్యకర్తలు కూడా బాధ పడుతున్నారు. ఇలాగైతే మున్ముందు కష్టమే’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలో క్షేత్రస్థాయిలో అసంతృప్తి, అసమ్మతి మొదలైందని.. దీన్ని మొగ్గలోనే తుంచకుంటే పార్టీకే ప్రమాదమని హెచ్చరించారు. సర్పంచ్ లు ఊళ్లల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు వస్తలేవని, స్థానిక సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని వాపోయారు. ‘‘ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలకు మధ్య దూరం పెరిగింది. దాన్ని సరిదిద్దేందుకు పెద్ద లీడర్లు ప్రయత్నించడం లేదు. కార్యకర్తలకు కాంగ్రెస్‌లో ఉన్న ప్రాధాన్యం బీఆర్ఎస్లో లేదు. ఏ విషయంలోనూ తమకు గుర్తింపు లేనప్పుడు పార్టీలో ఉండి లాభమేంటని కార్యకర్తలు బాధపడుతున్నారు” అని అన్నారు. గృహలక్ష్మి స్కీమ్‌లో కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
మంత్రి రాగానే కరెంట్ కట్..
ఆత్మీయ సమ్మేళనానికి విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆలస్యంగా వచ్చారు. ఆయన వచ్చిన కొద్ది సేపటికే కరెంట్పోయింది. అంతకు ముందే తమ ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన కరెంట్ఇస్తోందని లీడర్లు చెప్పడం.. కరెంట్ మంత్రి రాగానే కరెంట్పోవడంతో వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులు, లీడర్లు అందరూ ముసిముసిగా నవ్వడం గమనార్హం. మరోవైపు మంత్రి జగదీశ్‌రెడ్డి వేదికపై కూర్చొని నిద్రపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆత్మీయ సమ్మేళనం జిల్లా ఇన్చార్జ్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతుండగా మంత్రి కునుకు తీశారు. కాగా, ఆలేరు నియోజకవర్గానికి మోత్కుపల్లి నర్సింహులు తర్వాత 20 ఏండ్లుగా ఎవరికీ మంత్రి పదవి దక్కలేదని మీటింగ్‌లో పలువురు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో గొంగిడి సునీతను గెలిపిస్తే కచ్చితంగా మంత్రి అవుతారని కామెంట్ చేశారు.