దళిత బంధు అట్ల ఇచ్చి.. ఇట్ల తీస్కున్నరు

సూర్యాపేటలో 58 మందికి పంపిణీ చేసిన మంత్రి, ఎమ్మెల్యే
సర్కార్ డబ్బులు ఇవ్వకపోవడంతో వాహనాలు తిరిగి తీసుకెళ్లిన డీలర్లు
మళ్లా ఎప్పుడు ఇస్తరోనని ఎదురుచూస్తున్న లబ్ధిదారులు
షోరూమ్ ల నుంచి బండ్లు తెప్పిచ్చి, ఫొటోలు దిగి పంపిణీ చేసినట్లు కలర్ ఇచ్చిన లీడర్లు  

సూర్యాపేట, వెలుగు: దళిత బంధు స్కీమ్ కింద ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో రాష్ట్ర సర్కార్ పైసలు జమ చేయకపోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు పంపిణీ చేసిన వాహనాలను షోరూమ్​ల డీలర్లు వెనక్కి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో మంత్రి జగదీశ్​రెడ్డి, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు కార్లు, ట్రాక్టర్లు , హార్వెస్టర్లు, ఇతర ట్రాన్స్​ పోర్ట్​ వెహికల్స్​ కలిపి మొత్తం 58 యూనిట్లు ఆర్భాటంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు, లీడర్లతో కలిసి ఫొటోలు దిగారు. కానీ ఆయా లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు పడకపోవడంతో డీలర్లకు ఆఫీసర్లు బిల్లులు చెల్లించలేకపోయారు. దీంతో లబ్ధిదారులకు ఇచ్చిన వాహనాలను డీలర్లు తీసుకెళ్లిపోయారు. సర్కార్ ఎప్పుడు తమ అకౌంట్లలో పైసలు వేస్తదోనని, ఎప్పుడు వెహికల్స్​తిరిగి ఇస్తరోనని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.  

ఇచ్చిన తెల్లారే తీస్కపోయిన్రు... 

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలాన్ని దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా సర్కార్ ఎంపిక చేసింది. ఈ మండలంలో 3,750 మంది లబ్ధిదారులను గుర్తించారు. వీళ్లకు యూనిట్లు గ్రౌండింగ్​చేసేందుకు కలెక్టర్ అకౌంట్​లో రూ.50 కోట్లు జమయ్యాయి. అయితే ఇంతలోనే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 100 మంది చొప్పున దళిత బంధు ఇస్తామని సర్కార్ ప్రకటించడంతో... సూర్యాపేట జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 300 మంది, తుంగతుర్తి నియోజకవర్గంలో 45 మంది కలిపి మొత్తం 345 మందిని ఆఫీసర్లు ఎంపిక చేశారు. పైలెట్​ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన తిరుమలగిరి మండలంలోని 3,750 యూనిట్లను గ్రౌండింగ్ చేయకుండా వదిలేసిన సర్కార్... నియోజకవర్గాల్లో ఎంపిక చేసినోళ్లకు మార్చి 31లోగా యూనిట్లు అందజేయాలని ఆదేశించింది. దీంతో మంత్రి జగదీశ్​రెడ్డి, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు కలిసి ఈ నెల 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా హడావిడిగా ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇందులో భాగంగా కార్లు, ట్రాక్టర్లు, హర్వెస్టర్లు, ట్రాన్స్​పోర్ట్ వాహనాలు ఎంచుకున్న లబ్ధిదారులకు అదే రోజు పంపిణీ చేశారు. సూర్యాపేట నియోజకవర్గంలోని రామన్నగూడెం, కోదాడ నియోజకవర్గంలోని గుడిబండ, తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రం, హుజూర్ నగర్ నియోజకవర్గంలోని కోమటికుంట, కిష్టాపురం గ్రామాల్లో మొత్తం 58 మందికి వాహనాలు అందజేశారు. అయితే ఆ తెల్లారే లబ్ధిదారుల ఇంటికి వచ్చిన డీలర్లు... తమకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని చెప్పి, వాహనాలను తిరిగి తీసుకెళ్లిపోయారు. తమకు సర్కార్ డబ్బులు ఇచ్చినంకనే తిరిగి ఇస్తామని చెప్పారు. 

ఫొటోల కోసమే తెప్పించిన్రు... 

హుజూరాబాద్ తో పాటు ఖమ్మం జిల్లా చింతకాని, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగర్​కర్నూల్​ జిల్లా సారగొండ, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధును అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ స్కీం కింద ఎస్సీ కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున వాళ్ల అకౌంట్లలో వేస్తామని చెప్పింది. ముందుగా హుజూరాబాద్​లో 20 వేల మంది అకౌంట్లలో డబ్బులు జమ చేసినా యూనిట్లు మాత్రం గ్రౌండింగ్‌‌ చేయలేదు. మిగతా 4 మండలాల్లోనూ ఎక్కడా గ్రౌండింగ్ ​చేయలేదు. ఇంతలోపే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులకు దళితబంధు ఇస్తామని సర్కార్ ప్రకటించింది. ఇందుకు రూ.1,180 కోట్లు విడుదల చేసినా, లబ్ధిదారుల అకౌంట్లలో జమ కావడం లేదు. మార్చి 31లోగా 40 వేల యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని సర్కార్ ఆదేశించడంతో ఆయా జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా షోరూమ్ ల నుంచి బండ్లు తెప్పించి యూనిట్లు గ్రౌండింగ్​ చేసినట్లు కలర్ ఇచ్చారు. వీళ్లు పంపిణీ చేసినట్లు ఫొటోలు తీసుకొని వెళ్లిపోయాక, డీలర్లు వచ్చి వాహనాలను తీసుకుపోయారు.

ఇచ్చిన బండి తీస్కపోయిన్రు... 

దళిత బంధు కింద బొలెరో ఎంచుకున్నం. ఈ నెల 5న హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి చేతుల మీదుగా బండి ఇచ్చిన్రు. ఫొటోలు కూడా తీసుకున్నరు. తెల్లారి షోరూమ్ వాళ్లు వచ్చి బండి తీసుకెళ్లిన్రు. ఏందని అడిగితే మీకు అకౌంట్ల ఇంకా డబ్బు పడలేదని, పడినంక మళ్లీ తీసుకొచ్చి ఇస్తామని చెప్పిన్రు. అందుకే ఎప్పుడు పైసలు పడ్తయోనని ఎదురు చూస్తున్నం.
- కొత్తపల్లి శివ రజిత, కోమటికుంట, హుజూర్ నగర్