దళిత ఎంపవర్​మెంట్..  ఎన్నికల స్టంట్​

దళిత ఎంపవర్​మెంట్..  ఎన్నికల స్టంట్​

ప్రతి ఉద్యమానికి ప్రేరణ కలిగించేది పాటనే. జనాలను చైతన్యం చేసేది, ఉద్యమాలకు ఉత్తేజం కలిగించేది డప్పు దండోరానే. ఈ ఆటాపాటలతో తెలంగాణ ఉద్యమంలో దళితులు కీలక పాత్ర పోషించారు. రాష్ట్రం కోసం లాఠీ దెబ్బలు తిన్నారు. జైలు జీవితం గడిపారు. ప్రాణ త్యాగాలు చేశారు. కానీ, రాష్ట్రం వచ్చినంక అదే దళితులు అన్ని రంగాల్లో అణచివేతకు గురయ్యారు. రాష్ట్ర జనాభాలో 18 శాతమున్న దళితులు.. తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరింత వెనకబడ్డారు. దళితులను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎన్నో హామీలిచ్చిన రాష్ట్ర సర్కార్.. ఇప్పటివరకు వాటిలో ఒక్కటన్నా నెరవేర్చలేదు. ఇప్పుడు మళ్లీ దళిత ఎంపవర్​మెంట్ పేరుతో కొత్త రాగమెత్తుకుంది. అది దగాకోరు నినాదమే.. ఓట్ల కోసం ఆడుతున్న నాటకమే. 
రాజకీయంగా తొక్కేస్తున్రు... 
రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, జనాభా దామాషా ప్రకారం దళితులకు 21 స్థానాలు దక్కాలి. కానీ, 18 స్థానాలనే రిజర్వు చేశారు. ఇక అన్ రిజర్వుడ్ స్థానాల్లో అధికార పార్టీ దళితులకు అవకాశమే ఇవ్వడం లేదు. 17 మంది ఉన్న మంత్రివర్గంలో ముగ్గురు దళితులు ఉండాలి. కానీ, ఒక్కరికే పదవి ఇచ్చి చేతులు దులుపుకుంది. 17 పార్లమెంట్ స్థానాలకు గాను కేవలం మూడింటిలోనే ఎస్సీ ఎంపీలు ఉన్నారు. ఓసీల జనాభా చాలా తక్కువగా ఉన్నప్పటికీ, అత్యధిక స్థానాల్లో వారే ఉన్నారు. ఇలా లెక్కలు చెప్పుకుంటూ పోతే కేవలం రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ స్థానాలు తప్ప, మిగతా చోట్ల దళితులకు అవకాశం ఇవ్వడం లేదు. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో తాము చెప్పినట్టు వినే వాళ్లనే నిలబెట్టి, అగ్ర కులాలు అధికారం చెలాయిస్తున్నాయి.  
ఇచ్చిన హామీలన్నీ ఏమైనయ్? 
ఉద్యమ సమయంలోనే దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ‘ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్నట్లుగా దళితులను మోసం చేశారు. సీఎం పదవి ఇవ్వకున్నా, కనీసం దళితులకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యమైనా ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మరోసారి ఓట్లు దండుకున్నాడు. గెలిచినంక ఆ హామీని పక్కన పెట్టేశాడు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా దళితులకు జరిగిన లబ్ధి నామమాత్రమే. సబ్సిడీ ట్రాక్టర్లు, కార్లు నిజమైన లబ్ధిదారులకు దక్కకుండా, అధికార పార్టీ నేతల బినామీలకు దక్కాయి. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ప్రకటనకే పరిమితమైంది. తండాలను పంచాయతీలుగా చేసినట్లే, దళితవాడలనూ పంచాయతీలుగా చేస్తారని కలలుగన్న దళితులకు నిరాశే మిగిలింది. దళితులకు ఊర్లల్లో పెద్ద కులపోళ్లతో సమానంగా పదవులు ఉన్నప్పటికీ, ఇప్పటికీ వాళ్ల ముందు కూర్చునే పరిస్థితులు మాత్రం లేవు. ఒకవేళ ధైర్యం చేసి కూర్చుంటే బెదిరిస్తున్నారు. ఈటల వ్యవహారంతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చింది. బహుజనులంతా ఏకమయ్యే ప్రమాదం ఉందని పసిగట్టిన కేసీఆర్.. ఇప్పుడు కొత్తగా దళిత రాగం ఎత్తుకున్నాడు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన అట్రాసిటీ కేసులను గాలికొదిలేసి, కేవలం మరియమ్మ లాకప్ డెత్ కేసు విషయంలో మాత్రమే చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అన్ని అట్రాసిటీ కేసులపై విచారణ జరిపించాలి. కులాంతర వివాహాలకు అందిస్తామన్న ప్రోత్సాహకంలో, విదేశాలకు చదువుకునేందుకు వెళ్లే దళిత బిడ్డలకు ఇచ్చే ప్రోత్సాహకంలోనూ సర్కార్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. దళిత బిడ్డలు ఇప్పుడిప్పుడే యూనివర్సిటీ చదువుల స్థాయికి వస్తుంటే, ప్రభుత్వం వాటికి నిధులియ్యక నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇస్తోంది. ఇలా రాసుకుంటూ పోతే స్వరాష్ట్రంలో దళితుల గోసలు ‘చెప్తే రామాయణం.. వింటే భారతం’! 
దళిత ఎంపవర్​మెంట్.. ఓట్ల కోసమే 
ఇచ్చిన హామీల్లో ఒక్కటన్నా నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు దళిత ఎంపవర్​మెంట్ పేరుతో కొత్త రాగం ఎత్తుకుంది. ఎన్నికల్లో దళితుల ఓట్లను దండుకోవాలనే దురుద్దేశంతోనే ఇలా చేస్తోంది. దళిత ఎంపవర్​మెంట్ కోసం కమిటీ వేయకుండానే.. దళితులకు తనేదో చేయబోతున్నానని, అసలు దళితుల్లో పేదలే ఉండబోరనట్టు సీఎం కేసీఆర్ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నాడు. జనాభా దామాషా ప్రకారం దళితులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా, పదవులన్నీ తన సామాజిక వర్గాలకు కట్టబెట్టుకొని కొత్త నాటకం ఆడుతున్నాడు. ప్రభుత్వంలో ఉన్నోళ్లకే అపాయింట్​మెంట్ ఇవ్వడనే అపవాదును మోస్తున్న కేసీఆర్.. దళిత ఎంపవర్​మెంట్ పేరుతో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. లెనిన్ అన్నట్లుగా ‘‘ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు’’. ఇక తరచూ లెనినిస్టులం, మార్క్సిస్టులం అని చెప్పుకునే, దళితులకు తమ పార్టీల్లో ప్రాధాన్యం ఇవ్వని  కమ్యూనిస్టు పార్టీలు.. ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఉనికిని కోల్పోయిన ఆ పార్టీలు.. తమలోని ఆధిపత్య కులాలకు ఓ రెండు మూడు ఎమ్మెల్యే టికెట్ల కోసం అధికార పార్టీతో లాలూచీపడ్డాయి. తమ పార్టీల్లో ఉన్న దళితులను తమతో సమానంగా చూడని కమ్యూనిస్టు నాయకులు.. దళితుల అభ్యున్నతికి ప్రతిపాదనలు చేయడంపై పునరాలోచించుకోవాలి. కామ్రేడ్ మారోజు వీరన్న చెప్పినట్లు.. కుల-వర్గ జమిలి పోరాటాలు మాత్రమే దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెడతాయి. మొన్న జరిగిన దళిత ఎంపవర్​మెంట్ మీటింగ్.. చాయ్ బిస్కెట్ మీటింగే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. 
ఉద్యోగాల్లోనూ వివక్ష.. 
ఇప్పటికీ గ్రామాల్లో చాలామంది దళితులకు భూములు లేవు. వాళ్లకు ఉన్న వాటిలో ఈనాం భూములే అధికం. అవి అమ్మడానికి, కొనడానికి వీల్లేదు. కనీసం బ్యాంకు లోన్లు కూడా రావు. పైగా ఆ భూములనూ వివిధ కారణాలతో ప్రభుత్వం తీసుకుంటుండడంతో పేద దళితులు కూలీలుగా బతుకు వెళ్లదీస్తున్నారు. తమ లాంటి పరిస్థితే ముందుతరాలకు రావొద్దని చాలామంది దళితులు తమ పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చదివిన దళిత బిడ్డలు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరితే అక్కడ వివక్షకు గురవుతున్నారు. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న దళితులు.. ప్రమోషన్లలోనూ వివక్షను ఎదుర్కొంటున్నారు. అగ్రకులాల దోపిడీకి బలైపోతున్నారు.                                           - ముఖేష్ సామల సోషల్​ అనలిస్ట్​