సిద్దిపేట, వెలుగు: గత బీఆర్ఎస్ సర్కారు తెచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ఓ పేద దళిత రైతు ఆత్మహత్య చేసుకున్నాడని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో భూభారతిపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ ఓ పేద దళిత రైతు ప్రాణాన్ని తీసిందని ప్రస్తావించారు.
ఏం జరిగిందంటే..
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన మద్దెల కిష్టయ్య(73) అనే దళిత రైతు ఇదే గ్రామానికి చెందిన ఎం.విజేందర్ రెడ్డి నుంచి 35 ఏండ్ల క్రితం1452 సర్వే నెంబర్ లో ఏడెకరాల భూమి కొన్నాడు. ఆ భూమి ధరణి వచ్చిన తర్వాత వేరే వాళ్ల పేరుపై అక్రమంగా పట్టా చేశారు. న్యాయం చేయాలంటూ రెవెన్యూ, పోలీసు అధికారుల చుట్టూ కిష్టయ్య తిరిగాడు. అధికారులు, పోలీసులు న్యాయం చేయకపోగా.. వేసుకున్న బోర్లను అక్రమ పట్టాదారులు ధ్వంసం చేస్తుండటం, అప్పుల పాలు కావడంతో మనస్తాపం చెందిన కిష్టయ్య 2023 జనవరి 21న పొలంలోనే విషం తాగి చనిపోయాడు. కిష్టయ్యలాగా ఎవరికీ అన్యాయం జరగకూడదనే భూ భారతి రూపొందించినట్టు మంత్రి తెలిపారు.