ఇదొక స్కూల్.. వీళ్లు చెప్పేదో చదువు.. పీరియడ్ వచ్చిందని క్లాస్ నుంచి గెంటేశారు..!

ఇదొక స్కూల్.. వీళ్లు చెప్పేదో చదువు.. పీరియడ్ వచ్చిందని క్లాస్ నుంచి గెంటేశారు..!

కోయంబత్తూర్: తమిళనాడులో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన జరిగింది. పీరియడ్స్ గురించి అపోహలు, మూఢనమ్మకాలను విడనాడి అమ్మాయిలు ధైర్యంగా ముందుకెళుతున్న ఈరోజుల్లో ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసింది. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా కినతుకడవు తాలూకా సెంగుట్టైపాళయం గ్రామంలోని స్వామి చిద్భవానంద మెట్రిక్ హైయ్యర్ సెకండరీ స్కూల్ వార్తల్లో నిలిచింది. ఈ ప్రైవేట్ స్కూ్ల్లో 8వ తరగతి చదువుతున్న ఒక బాలికను క్లాస్ రూం బయట సైన్స్ ఎగ్జామ్ రాసింది.

విద్యార్థులంతా క్లాస్ రూంలో కూర్చుని పరీక్ష రాస్తే.. ఈ అమ్మాయిని మాత్రమే ఎందుకు బయటకూర్చోబెట్టారంటే.. ఈ బాలికకు నెలసరి వచ్చింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈ బాలికకు నెలసరి రావడంతో స్కూల్ యాజమాన్యం, టీచర్లు క్లాస్ రూం బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించారు. అవును.. మీరు చదివింది అక్షరాలా నిజం. సునీతా విలియమ్స్ వంటి మహిళలు అంతరిక్షం చుట్టొచ్చి భూమి మీదకు సురక్షితంగా తిరిగొచ్చిన 20వ శతాబ్దంలోనే ఈ అమానుష ఘటన జరిగింది.

ఏప్రిల్ 7, 2025న ఈ ఘటన జరిగింది. ఇలా బయట కూర్చోబెట్టి పరీక్ష రాయిస్తు్న్న విషయాన్ని సదరు బాలిక కన్నతల్లికి చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. ఆ బాలిక తల్లి ఆ మరుసటి రోజు స్కూల్ కు వెళ్లి తన కూతురు ఎదుర్కొంటున్న వివక్షను కళ్లారా చూసింది. సమాజానికి చూపించాలనుకుంది. ఫోన్లో ఆ ప్రైవేట్ స్కూల్ నిర్వాకం మొత్తాన్ని రికార్డ్ చేసింది. బాలిక ఒక్కతే క్లాస్ బయట కూర్చుని పరీక్ష రాస్తున్న వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా ఈ వీడియో వైరల్ అయింది.

ఆ పాఠశాల యాజమాన్యం దుశ్చర్యపై బాధిత బాలిక గ్రామస్తులు పొలాచ్చి సబ్ కలెక్టర్ను కలిసి ఆ వీడియోను చూపించి.. ఆ అమానుషం గురించి వివరించారు. స్కూల్ మేనేజ్మెంట్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వివక్ష ఘటన కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ పవన్ కుమార్ జి గిరియప్పనవర్ దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించారు.