ఓ సాదా సీదా వరుడి ఊరేగింపుకు 400 మంది పోలీసులు భద్రత అంటే మామూలు విషయం కాదండోయ్.. ముఖ్యమంత్రో.. ప్రధానో.. పర్యటనలకు వస్తున్నారంటే ఆ రేంజ్ భద్రత ఉంటుంది. అటువంటిది ఓ పెళ్లి కొడుకు సొంత ఊరిలో గుర్రంపై ఊరేగడానికి భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంత సెక్యూటిరీ ఎందుకంటారా..! అగ్రవర్ణ కులాలకు భయపడి..
రాజస్థాన్, అజ్మీర్ జిల్లాలోని శ్రీనగర్ గ్రామానికి చెందిన లోకేష్ అనే వ్యక్తికి.. వారి పొరుగు గ్రామం రాయిగర్‌కు చెందిన అరుణ అనే యువతితో వివాహం నిశ్చయమైంది. వరుడిని.. పెళ్లి కుమార్తె ఇంటికి గుర్రంపై సవారీ చేయిస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లాలని కుటుంబీకులు నిర్ణయించగా.. అగ్రవర్ణ కులాల వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ విషయం ముందుగా తెలుసుకున్న వధువు తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఊరేగింపు సమయంలో అగ్రవర్ణ కులాల వారు దాడి చేసే అవకాశముందని, తగు భద్రత కలిపించాలని ఫిర్యాదు చేశాడు. దాంతో గ్రామంలో సుమారు 400 మంది పోలీసులు మోహరించారు.
Also Read :- వావ్.. ఇంటిని క్లీన్ చేసినట్టు .. ట్రైన్ బెర్త్ ను తుడిచింది.
వరుడి ఇంటి నుంచి ప్రారంభమైన వివాహ ఊరేగింపు భారీ పోలీసు భద్రత నడుమ కొనసాగింది. చివరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాఫీగా పెళ్లి కొడుకు.. తనకు కాబోయే మామ గారి ఇంటికి చేరుకున్నాడు.
గతంలో దళితుల పెళ్లి ఊరేగింపుల్లో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నందున ముందు జాగ్రత్తగా పోలీసులను ఆశ్రయించినట్లు వధువు తండ్రి తెలిపారు.