షమీం అక్తర్ నివేదికను సవరించాలి : దళిత సంఘాలు

షమీం అక్తర్ నివేదికను సవరించాలి : దళిత సంఘాలు

ఆసిఫాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్రంలో పర్యటించిన షమీం అక్తర్ ఏకసభ్య కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టు తప్పులు తడకగా ఉందని, దాన్ని సవరించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఆదివారం వాంకిడి మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహుల్కర్ మాట్లాడుతూ.. కమిషన్ సిద్ధం చేసిన నివేదికలో చాలా తప్పులు ఉన్నాయని, ఏకపక్ష నిర్ణయంతో మాల, మహర్లకు తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు. మాదిగలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోందని.. మహర్, మాల సంఘాల నాయకులు ఇచ్చిన వినతులను పూర్తిగా స్వీకరించలేదని ఆరోపించారు. 

ఫిబ్రవరి 4న రాష్ట్ర అసెంబ్లీలో బిల్లును ఆమోదిస్తూ సోషల్ జస్టిస్ డే గా నిర్ణయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా షమీం అక్తర్ నివేదిక నకలు కాపీలను దహనం చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి దుర్గం సునీల్, ఉపాధ్యక్షుడు దుర్గం హంసారాజ్, సమాజ్ అధ్యక్షుడు విలాస్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రోషన్, విజయ్, అరుణ్, దుర్గం దీపక్ తదితరులు పాల్గొన్నారు.