ఖైరతాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలమని దళిత మేధావుల ఫోరం ప్రకటించింది. అయితే అది శాస్త్రీయంగా, ఎలాంటి న్యాయపరమైన అవరోధాలు లేకుండా ఉండాలని స్పష్టం చేసింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఫోరం నేతలు డాక్టర్ ఎమ్ఎఫ్ గోపీనాథ్, ప్రొఫెసర్లు లక్ష్మీనారాయణ, కేవై రత్నం మాట్లాడారు. రాష్ట్రాల ఇష్టానుసారం వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని, కానీ అది శాస్త్రీయం కాదన్నారు. పార్లమెంటు ద్వారా చట్టబద్ధత ఉండేలా వర్గీకరణ జరగాలన్నారు.
ఎస్సీ రిజర్వేషన్లకు దేశవ్యాప్త చట్టబద్ధతను కల్పించే ఆర్టికల్ 341కు వక్రీకరణ జరిగిందన్నారు. అంతర్గత వర్గీకరణ విషయంలో చట్టబద్ధ మార్పులు పార్లమెంటు ద్వారానే చేయాలని ఈ ఆర్టికల్ సూచిస్తుందన్నారు. మాలలు మనువాదులు అని కొందరు అసహనంతోనే కామెంట్లు చేస్తున్నారని.. కానీ మాలలు మనువాదులు కారని తెలిపారు. మనువాదులు మాలలకు శత్రువులని స్పష్టం చేశారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో మాలలకు ఎక్కువ వాటా దక్కుతోందన్న వాదనలో నిజం లేదన్నారు.
తెలంగాణలో 25 నుంచి 30 లక్షల మంది మాలలు ఉన్నప్పటికీ.. మాలల్లో ఒక్క ఐపీఎస్ అధికారి కూడా లేడన్నారు. కులగణన నెలరోజుల్లోనే పూర్తయినట్టు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలోనూ వాస్తవం లేదని ఫోరం నేతలు చెప్పారు. కులగణన సర్వేను మరో 6 నెలలు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ వర్గీకరణకు గైడ్ లైన్స్ ను సూచిస్తూ ఏక సభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ ను కలిసి వినతి పత్రం ఇస్తామని తెలిపారు. సమావేశంలో డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ కుమార స్వామి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మామిడి నారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.