దళిత మహాయోగి దున్న ఇద్దాసు

దళిత మహాయోగి దున్న ఇద్దాసు

సాహిత్యాన్ని, సంస్కృతిని, సామాజిక సమైక్యతని సుసంపన్నం చేసిన మహనీయులు ఎందరో ధృవతారలై  ప్రకాశిస్తున్నారు. అలాంటివారిలో తెలంగాణలో అగ్రగణ్యుడు దున్న ఇద్దాసు.  ఆచార్య  బిరుదురాజు రామరాజు వంటి పరిశోధకులు ఇద్దాసును ‘మాదిగ మహాయోగి’గా కీర్తించారు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి వంటి చరిత్రకారులు, సాహిత్య చరిత్ర రచయితలు ఇద్దాసును ‘తొలి దళిత కవి’గా గుర్తించారు. అచల యోగిగా, సంకీర్తనాకారుడిగా, తత్త్వకవిగా, ప్రసిద్ధుడైన దున్న ఇద్దాసు అట్టడుగు కులాల్లో చైతన్యానికి బాటలు వేసిన మహనీయుడు.

నల్గొండ జిల్లా పెద్దఊర మండలం చింతపల్లి గ్రామంలో క్రీ.శ. 1811 సెప్టెంబర్       లో దున్న ఇద్దాసు జన్మించాడు. ఎల్లమ్మ, రామయ్య వీరి తల్లిదండ్రులు. పశువుల కాపరిగా, జీతగాడిగా ఇద్దాసు పనిచేశాడు. మోటకొడుతూ, ఆశువుగా తత్త్వాలు పాడేవాడు. సాధువుల సాంగత్యంతో పూర్తిగా భక్తిమార్గంలోకి వచ్చాడు. లింగధారణ చేసి పంచాక్షరీ మంత్ర ఉపదేశం పొందాడు. రాజయోగ సాధన, కొంతకాలం ఏకాంతంగా యోగసాధన చేసి పూర్ణయోగిగా మారినాడు. కాలక్రమంలో అనేక మహిమలను చూపినాడు. ఊరూరు తిరుగుతూ భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ ప్రజల్లోకి ఉద్యమ తరహాలో భక్తిని తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దాసుకు వందలాది మంది శిష్యులు తయారయ్యారు. వందలాది గ్రామాలు తిరుగుతూ ప్రస్తుతం నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా అచ్చంపేట సమీపంలో ఉన్న అయ్యవారిపల్లె గ్రామానికి చేరుకొని, అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో అనేక తత్త్వాలను, కీర్తనలను, మేలుకొలుపులను ఆశువుగా చెప్పాడు. 

ఆధిపత్య ధోరణిపై ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రాలు

భగవంతుని ముందు అన్ని కులాలవారు సమానమేనని ఇద్దాసు ప్రబోధించాడు. ఆధిపత్య భావనను ఇద్దాసు తన కీర్తనలలో ప్రశ్నించాడు. ఆత్మన్యూనత నుంచి బయటపడమని అట్టడుగు కులాలకు సందేశమిచ్చాడు. ఇద్దాసు మహిమలను అపహాస్యం చేసినవారిని ఉద్దేశించి చెప్పిన కీర్తన చాలా ప్రముఖమైనది.  బాహ్యశుద్ధి కన్న అంతఃశుద్ధి ముఖ్యమన్నది ఈ కీర్తన సారాంశం. 

కులం కన్న గుణం ముఖ్యమనే సందేశాన్నిచ్చిన ఎన్నో కీర్తనలను ఇద్దాసు రాశాడు. జ్ఞానులకు, అజ్ఞానులకు మధ్య ఉండే తేడాను స్పష్టంగా చెప్పి ప్రజలను జ్ఞానమార్గంవైపు నడిపిన దున్న ఇద్దాసు సామాన్య జనుల భాషలో అందరికీ అర్థమయ్యేటట్లు తత్త్వాలను చెప్పాడు. భగవతత్త్వాన్ని గుర్తించడం జ్ఞానులకే సాధ్యమని చెప్పిన ఈ తత్త్వంలో జ్ఞానులకు, అజ్ఞానులకు ఉపమానాలుగా అందరికీ తెలిసిన ఉదాహరణలనిచ్చాడు. అజ్ఞానులను బావిలోని కప్పలుగా పోల్చాడు.  జ్ఞానులుగా మారి భగవంతుడిని చేరుకున్నప్పుడే జీవితం సార్థకమవుతుందనే సందేశం ఇందులో మనకు కనబడుతుంది. 

మార్మికత ఉన్న తత్త్వాలను కూడా ఇద్దాసు రాశాడు. ఇద్దాసుది రాజయోగమార్గం. సంసారం చేస్తూనే  యోగసాధన కూడా కొనసాగించి దానిలో అత్యున్నత స్థాయికి వెళ్లాలని ఆయన ప్రబోధించాడు. ‘మరచితివే మనసా! అలనాటి మాట’ అనే తత్త్వంలో దేవుడిని, గురువును ఎన్నటికీ మరువకూడదనే హితబోధ ఉంది. ఈ భౌతిక జీవితమంతా వారి దయనే తప్ప వేరొకటి కాదని ఆయన భావన.

దళితుడిగా పుట్టి దార్శనికుడిగా ఎదిగిన అవధూత

ఇద్దాసు తన తత్త్వాలలో తుంగతుర్తి సోమలింగేశ్వరస్వామి, పూదోట బసవయ్య, పోతులూరి వీరబ్రహ్మం, పెనుగొండ బసవయ్య, ఈశ్వరమ్మ, అచలమత స్థాపకులు శివరామదీక్షితులు, కాల్వ కోటప్ప మొదలైనవారిని స్మరించాడు. లౌకిక వ్యవహార జీవితాన్ని ఆరాధించడం, సంసారంలోనే నివృత్తిని దర్శించడం, జీవనపరంగా స్త్రీ, పురుష బేధాలను పాటించకపోవడం, కుల, మత బేధాలను పాటించకపోవడం మొదలైన తత్త్వకవుల లక్షణాలు దున్న ఇద్దాసులో పుష్కలంగా కనబడతాయి.  దాదాపు 108 సంవత్సరాలు జీవించి 1919లో భగవదైక్యం చెందిన ఇద్దాసు దళితుడిగా పుట్టి దార్శనికుడిగా ఎదిగిన అవధూత.  తన మాటలతో, పాటలతో సమాజంలో చైతన్యం తెచ్చిన సంస్కరణ వేత్త, మానవతావాది.   దున్న ఇద్దాసు తత్త్వాలపై పరిశోధనలు మరింత జరగాలి. 

- సామల కిరణ్