
- యువతి కుటుంబ సభ్యులే చంపారని మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణ
- సూర్యాపేట మండలం పిల్లలమర్రిలో ఘటన
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేటలో పరువు హత్య కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకున్న ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ (32) పిల్లలమర్రికి చెందిన నవీన్ స్నేహితులు. నవీన్ ఇంటికి తరచూ కృష్ణ వచ్చిపోతూ ఉండేవాడు. ఈ క్రమంలో నవీన్ సోదరి భార్గవితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
విషయం తెలిసిన భార్గవి కుటుంబ సభ్యులు కృష్ణతో వివాహానికి ఒప్పుకోలేదు. ఓ కానిస్టేబుల్‌తో వివాహం చేసేందుకు ప్రయత్నించగా భార్గవి గత ఏడాది ఆగస్టులో ఇంట్లో నుంచి వెళ్లిపోయి నకిరేకల్‌లో కృష్ణను పెళ్లి చేసుకుంది. కృష్ణ రియల్ ఎస్టేట్‌వ్యాపారం చేస్తూ భార్యతో సూర్యాపేటలో ఉంటున్నాడు. ఇంటికి వచ్చేయ్యాలని భార్గవిపై సోదరులు తరచూ ఒత్తిడి తెచ్చేవారు. ఆమె తిరిగి వెళ్లకపోవడంతో కృష్ణపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం కృష్ణకు మహేశ్ అనే ఫ్రెండ్ కాల్ చేయడంతో ఫోన్భార్యకిచ్చి బయటకు వెళ్లాడు. అదే రోజు రాత్రి కృష్ణ హత్యకు గురయ్యాడు. అతడి డెడ్‌బాడీని పోలీసులు పిల్లలమర్రి సమీపంలో గుర్తించారు. మృతుడి మెడకు ఉరి వేసి చంపిన ఆనవాళ్లు ఉన్నాయి. ఒంటి మీద గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు.
కులాంతర వివాహం ఇష్టం లేకే హత్య: భార్గవి
కులాంతర వివాహం ఇష్టంలేక కృష్ణను తన పుట్టింటివారే హత్య చేశారని భార్గవి ఆరోపించింది. హత్య చేసిన వారిని పట్టుకుని శిక్షించాలని డిమాండ్చేసింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు భార్గవి తండ్రి సైదులు, సోదరులు వంశీ, నవీన్.. కృష్ణ స్నేహితుడు బైరు మహేశ్‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నలుగురూ పరారీలో ఉండగా వీరి కోసం పోలీసులు రెండు బృందాలుగా గాలిస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కృష్ణ స్వగ్రామం తుంగతుర్తి మండలం అన్నారానికి తరలించారు. పిల్లలమర్రిలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
దళిత సంఘాల ఆందోళన
కృష్ణను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు, దళిత సంఘాల నాయకులు సూర్యాపేట జనరల్ హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి రూ. కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.