సూర్యాపేట జిల్లాలో పరువు హత్య కేసు..చంపింది బావమరుదులే! 

సూర్యాపేట జిల్లాలో పరువు హత్య కేసు..చంపింది బావమరుదులే! 

 

  • ప్లాన్  ప్రకారమే కల్లు కోసం తీసుకెళ్లి బావ హత్య
  • డెడ్ బాడీతో100 కిలో మీటర్లు కారులో జర్నీ
  • పోలీసుల అదుపులో నలుగురు నిందితులు 
  • సూర్యాపేట జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసు  

సూర్యాపేట, వెలుగు :  సూర్యాపేట జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో బావమరుదులే పథకం ప్రకారం బావను చంపినట్లు తేలింది. తమ సోదరి తక్కువ కులం వ్యక్తిని  ప్రేమ వివాహం చేసుకొని కుటుంబం పరువు తీసిందని భావించిన ఆమె సోదరులు పథకం ప్రకారం వడ్లకొండ కృష్ణను హత్య చేయించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.

 హత్య చేశాక డెడ్ బాడీని దూరంగా పడేసి రావాలనుకున్న నిందితులు  కారులో వేసుకొని దాదాపు 100 కిలో మీటర్ల దూరం వెళ్లారు. కానీ, డెడ్ బాడీని ఎక్కడ వేయలో తెలియక చివరకు చెల్లె ఇంటి సమీపంలో వదిలేసి పోలీసుల ఎదుట లొంగిపోయారు.

కుటుంబం పరువు పోయిందని..

సూర్యాపేట మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ సూర్యాపేట పిల్లల మర్రికి  భార్గవి మూడేండ్ల నుంచి ప్రేమించుకోగా ఇంట్లో విషయం తెలియడంతో భార్గవి తల్లితండ్రులుపెండ్లికి నిరాకరించారు. అంతేకాకుండా ఓ ప్రభుత్వ ఉద్యోగితో పెళ్లి కుదర్చగా, ఎంగేజ్​మెంట్ కు ఒక రోజు ముందు ఇంట్లో నుంచి వెళ్లిపోయి గతేడాది ఆగస్టు నెలలో నకిరేకల్ లో కృష్ణ, భార్గవి వివాహం చేసుకొని సూర్యాపేటలో నివాసం ఉంటున్నారు.

దీంతో కుటుంబంలో పరువు పోయిందని అప్పటి నుంచి కృష్ణపై భార్గవి కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. గతేడాది డిసెంబర్ లో క్రిస్మస్  సందర్బంగా ఇద్దరు కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో కుటుంబం మరోసారి రిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా కృష్ణను హత్య చేయాలని రెండు నెలల నుండి భార్గవి అన్నలు కోట్ల వంశీ, కోట్ల నవీన్  ప్లాన్​ వేసుకున్నారు. కృష్ణను హతమార్చేందుకు భార్గవి సోదరులు రియల్ ఎస్టేట్ చేస్తున్న బైరు మహేశ్​ను సహాయం కోరారు.

అంజనపురి వజ్ర టౌన్ షిప్  సమీపంలోని మహేశ్​ పొలంలో కల్లు తాగేందుకు కృష్ణను రమ్మని ఫోన్  చేసి పిలిచి, ముగ్గురు గొంతు నులిపి హత్య చేశారు. అనంతరం కృష్ణ మృతదేహాన్ని నవీన్  తెచ్చిన కారులో అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి ప్రాంతంలో పడేసేందుకు ప్రయత్నించగా, వీలు కాకపోవడంతో పిల్లలమర్రి శివారులోని మూసీ కాలువ పక్కన పడేసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తుచేస్తున్నారు.