
దేశంలో దళిత ఉద్యమాలకు చాలా ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా మహర్, ఆది హిందూ, ఆది ఆంధ్ర, రిపబ్లికన్ పార్టీ, దళిత్ పాంథర్స్ ఉద్యమాలు ముఖ్యమైనవి. తెలంగాణలో జరుగుతున్న పోటీ పరీక్షల్లో వీటి నుంచి ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. దళిత ఉద్యమాలు, ముఖ్యమైన నాయకుల గురించి తెలుసుకుందాం.
దళితులు చాతుర్వర్ణ వ్యవస్థలో అట్టడుగు వర్గానికి చెందిన వారు. వీరిని అపర్ణులు, పంచములు, అస్పృశ్యులు అంటారు. దళిత ఉద్యమాలను సంస్కరణాత్మక, ప్రత్యామ్నాయ ఉద్యమాలుగా విభజించవచ్చు. సంస్కరణ ఉద్యమాల లక్ష్యం సమాజంలో అస్పృశ్యతను నివారించడం, కుల వ్యవస్థను సంస్కరించడం. ప్రత్యామ్నాయ ఉద్యమాల లక్ష్యం నూతన సామాజిక, సాంస్కృతిక వ్యవస్థను స్థాపించడం.
మహర్ ఉద్యమం
మహారాష్ట్రలో మహర్ ఉద్యమాన్ని గోపాల్ బాబా వాలంగేకర్ ప్రారంభించారు. ఇందులో భాగంగా దోష పరిహారక మండలిని స్థాపించాడు. సమాజంలో ఎదురవుతున్న ఆర్థిక, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని దళితులకు పిలుపు ఇచ్చాడు. దళిత కులాల నుంచి వచ్చిన తొలి పోరాట యోధుడిగా గోపాల్ బాబా వాలంగేకర్ను మహారాష్ట్ర ప్రజలు భావిస్తారు. 1913లో మహారాష్ట్రలోని కుల సంఘాలు మహాసభను నిర్వహించి అంటరానితనం గురించి చర్చించాయి.
అప్రెసెడ్ ఇండియా అసోసియేషన్
అప్రెసెడ్ ఇండియా అసోసియేషన్ సంస్థను నాగ్‌పూర్‌లో శివరాం జాంబకాంబ్లే ప్రారంభించాడు. 1909లో సోంవంశీమిత్ర అనే పత్రికను పుణె నుంచి నిర్వహించాడు. దళితుల్లో మూఢాచారాలు, దేవదాసీ, పోతురాజు వ్యవస్థలను రూపుమాపేందుకు కృషి చేశాడు. పుణెలో రాత్రి పాఠశాలను ఏర్పాటు చేసి దళితుల్లో విద్యావ్యాప్తికి యత్నించాడు. గ్రంథాలయాలను ఏర్పాటు చేసి చరిత్ర పట్ల దళితులకు అవగాహన కల్పించాడు.
ఆది హిందూ ఉద్యమం
దేశంలో దళితులే మూలవాసులు అని, వారికి ఆది హిందువులు అనే పేరు పెట్టారు భాగ్యరెడ్డి వర్మ. అంబేద్కర్, గాంధీ కంటే ముందే దళిత వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికి 1906లో జగన్ మిత్ర మండలిని స్థాపించాడు. ఈ మండలి స్థాపన దేశంలో దళిత ఉద్యమానికి నాందిగా చెప్పవచ్చు. అంటరాని వారి దుర్భర జీవితాల్లో మార్పులు తేవడానికి సభల నిర్వహణ, విద్యావ్యాప్తి, పుస్తకాల ద్వారా చైతన్యం కలిగించడానికి కృషి చేసింది. జగన్ మిత్ర మండలి1911లో మన్య సంఘంగా మారింది. ఇసామియా బజార్, లింగంపల్లిలో ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించాడు. దేవదాసీ, జోగిని దురాచార నిర్మూలనకు ప్రత్యేకంగా దేవదాసీ నిర్మూలన సంఘాన్ని స్థాపించాడు. ఈ సంఘం నిరంతర కృషి వల్ల నిజాం ప్రభుత్వం జోగినీ వ్యవస్థను నిషేధించింది. 1912లో భాగ్యరెడ్డి వర్మ అహింసా సమాజాన్ని స్థాపించాడు. ఇది ది దక్కన్ హ్యుమానిటేరియన్ లీగ్‌గా మారింది. ఈ సంస్థ ప్రభావంతో 1920లో నిజాం ప్రభుత్వం గోవధను నిషేధించింది. ఇంటి పని మనుషుల కోసం విశ్వ గృహ పరిచారిక సమ్మేళనాన్ని స్థాపించాడు. వీటి ప్రభావంతో నిజాం ప్రభుత్వం 1931 జనాభా లెక్కల్లో వీరిని ఆది హిందువులుగా పేర్కొన్నది. అణగారిన వర్గాలకు వేదిక కల్పిస్తూ భాగ్యనగర్ అనే పత్రికను స్థాపించాడు.
ఆది ఆంధ్ర ఉద్యమం
ఒకప్పటి మద్రాస్ రాష్ట్రంలోని కోస్తాంధ్ర ప్రాంతంలో ఆది ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. 1917లో బెజవాడలో గూడూరు రామచంద్రరావు పంచమ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. ఈ సభకు అధ్యక్షుడైన భాగ్యరెడ్డి వర్మ సభలో ప్రసంగిస్తూ పంచమ పదం వాడటం సరికాదని భావించి ఆది ఆంధ్ర కాన్ఫరెన్స్‌గా నామకరణం చేశాడు. ఈ సదస్సులోనే ఆది ఆంధ్రసభగా ఆవిర్భవించింది. దళితులకు భూమి, విద్య, ఉద్యోగావకాశాలు, పాలనలో ప్రాతినిధ్యం గురించి పోరాటం చేసింది. ప్రభుత్వ సర్వీసులో రిజర్వేషన్ ఉండాలని డిమాండ్ చేసింది. స్థానిక సమస్యలు, అంటరానితనం అనే అంశాలపై ఆది ఆంధ్రసభ ఉద్యమించింది.
రిపబ్లికన్ పార్టీ
షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ పేరును 1957లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చారు. దీని స్థాపకుడు శివరాజ్. రాజ్యాంగంలోని ప్రాథమిక భావాలైన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం, సమన్యాయం, సౌభ్రాతృత్వానికి అనుగుణంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఆర్పీఐ ఏర్పడింది. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతుల వారిని సమీకరించడం, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి దున్నేవాడికి భూమి ఇవ్వాలి, మిగులు భూమిని పంచాలి, ధరలను నియంత్రించాలి, సమాజంలో ఉన్న అంతరాలు, అసమానతలను తొలగించేందుకు పీడితవర్గాల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ప్రధాన లక్ష్యాలు.
దళిత్ పాంథర్స్
ఈ ఉద్యమ నాయకులు అరుణ్కాంబ్లే, రాజధాలే. ఈ ఉద్యమంలో భాగంగా దళిత్ పాంథర్స్ సంస్థను ముంబైలో నాందేవ్ దాసల్, జేవీ పవార్1972లో స్థాపించారు. దళిత్ పాంథర్స్ ఉద్యమం అమెరికాలో నల్లజాతి ప్రజలు నిర్వహించిన బ్లాక్ పాంథర్స్ నుంచి ప్రేరణ పొందింది. ఈ ఉద్యమకాలంలోనే దళిత్ అనే పదం వెలుగులోకి వచ్చింది. ఈ ఉద్యమ కాలంలో వివాదాస్పదమైన ధాలే ఆర్టికల్ కాలా స్వాతంత్ర్యదిన్. ఈ ఆర్టికల్ సాధన పత్రికలో వచ్చింది. ఈ ఉద్యమంలో నమంతర్ ఆందోళన్ చేపట్టి ఔరంగాబాద్‌లోని మరఠ్వాడ యూనివర్సిటీ పేరు బీఆర్ అంబేద్కర్ మరఠ్వాడ యూనివర్సిటీగా మార్చారు. వీరు పీడిత వర్గాలకు సామాజిక, సాంస్కృతిక గుర్తింపు కోసం కృషిచేశారు.
సారథులు
ఎంఎల్ యాదయ్య: ఆది హిందూ మహాసభ ఎంఎల్ యాదయ్య ఆధ్వర్యంలో ఏర్పడింది. 1931 జులైలో యాదయ్య అధ్యక్షతన జరిగిన ఆది హిందూ ధార్మిక సభ అంటరాని వర్గాలన్నింటిని ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నించింది. ఎంఎల్ యాదయ్యను దళిత భీష్ముడు అని అంటారు.
బిఎస్ వెంకట్రావు: ఈయన అసలు పేరు బత్తుల ఆలయ్య. ఈయన బిరుదులు హైదరాబాద్ అంబేద్కర్, రావు సాహెబ్. డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్‌ను స్థాపించి దళిత హక్కుల కోసం పోరాడాడు. అంబేద్కర్ ప్రారంభించిన మహర్ ఉద్యమంలో పాల్గొన్నాడు.
అరిగె రామస్వామి: 1922లో ఆది హిందూ జాతి ఉన్నతి సభను అరిగె రామస్వామి స్థాపించాడు. ఇతను దళితుల్లో రాజకీయ చైతన్యం కలిగించాడు.
ఛత్రపతి సాహు మహారాజ్: ఈయన కొల్హాపూర్ రాజు. దేశంలో మొదటిసారిగా రిజర్వేషన్ల భావనను ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి. అట్టడుగు వర్గాల విద్యా, ఉపాధి అవకాశాల కోసం కృషి చేశాడు.కొల్హాపూర్‌లో అనేక హాస్టళ్లను నెలకొల్పాడు.
మహర్షి విఠల్ రాంజీ షిండే: ఈయన మహారాష్ట్రలో సామాజిక, మతపరమైన సంస్కర్తల్లో ఒకరు. ఇతను అస్పృశ్యత నిర్మూలనకు కృషిచేశాడు. 1905లో పుణెలో అస్పృశ్యుల కోసం రాత్రి పాఠశాల, 1906లో డిప్రెసెడ్ క్లాసెస్ మిషన్‌ను స్థాపించాడు.
అయ్యంకాళి: తిరువనంతపురానికి చెందిన అయ్యంకాళి సాధు జన ప్రజాపాలన సంఘం స్థాపించాడు. ఈయన్ని కేరళలో అత్యంత ప్రభావవంతమైన నాయకునిగా పరిగణిస్తారు.
భాగ్యరెడ్ది వర్మ: భాగ్యరెడ్డి వర్మ అసలు పేరు మాదరి భాగయ్య. దేశంలో దళితులే మూలవాసులు అని, మూలవాసులు రేడులు అని, రేడులు అంటే రెడ్లు అని తన పేరుకు చివరన రెడ్డిని జత చేసుకున్నాడు. 1913లో ఆర్య సమాజ్ సభ్యుడు బాలాజీకృష్ణారావు భాగ్యరెడ్డికు వర్మ అనే బిరుదు ఇచ్చి ఆర్య సమాజ దీక్షనిచ్చాడు. 1906లో జగన్ మిత్రమండలిని హైదరాబాద్‌లో స్థాపించాడు. జగన్ మిత్ర మండలి మాన్య సంఘంగా మారింది. 1912లో స్వస్తిక్ దళ్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించాడు. 1925లో హైదరాబాద్‌లో కలరా, ప్లేగు వ్యాధులు సంభవించినప్పుడు భాగ్యరెడ్డి వర్మ స్వచ్ఛంద ఆరోగ్య సేవాదళాన్ని ఏర్పాటు చేసి సేవలు చేశాడు. 1927లో అలహాబాద్‌లో జరిగిన అఖిల భారత దిగువ కులాల సదస్సులో భాగ్యరెడ్డి వర్మ దక్షిణ భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నాడు. 1933లో నాగ్‌పూర్‌లో నిర్వహించిన ఆది హిందూ సమావేశం భాగ్యరెడ్డి వర్మ పాల్గొన్న చివరి సమావేశం. భాగ్యరెడ్డి వర్మ తెలంగాణలో సమాంతర న్యాయ వ్యవస్థను నడిపాడు.
-వెలుగు, ఎడ్యుకేషన్ డెస్క్