- బీఆర్ఎస్ లీడర్లు సతాయిస్తున్నరు
- పంచుకునుడు కాదు...ఊళ్లోని దళితులందరికీ స్కీం ఇవ్వాల్సిందే
- మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి వాసుల రాస్తారోకో
- వర్షంలోనూ హైవేపై నిరసన
మహబూబాబాద్, వెలుగు: దళిత బంధు స్కీమ్వస్తే యూనిట్లను పంచుకోవాలని లీడర్లు సతాయిస్తున్నారని, ఊరిలోని అర్హులంందరికీ దళితబంధు వర్తింపజేయాలని డిమాండ్‌చేస్తూ మహబూబాబాద్ మండలం కంబాలపల్లి దళితులు మహబూబాబాద్–నర్సంపేట జాతీయ రహదారి పై కంబాలపల్లి బస్టాండ్‌సెంటర్ వద్ద రాస్తా రోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో 175 మాదిగ, 40 మంది బుడగ జంగాలు, 20 మంది మాలలు, 6 బైండ్ల కుటుంబాలకు చెందిన దళితులున్నారన్నారు.
మహబూబాబాద్ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ సిఫారసు మేరకు ఆఫీసర్లు గ్రామానికి 14 దళితబంధు యూనిట్లను మంజూరు చేశారని, అయితే, కొంతమంది బీఆర్ఎస్లీడర్లు వాటిని 11 మంది కలిసి పంచుకోవాలని వెంటపడుతున్నారని ఆరోపించారు. కటుంబంలో అన్నకు వస్తే తమ్ముడితో...తమ్ముడికి వస్తే అన్నతో...ఒకవేళ ఎవరూ లేకపోతే ఊరిలోని వేరే దళితులతో రూ.5 లక్షల చొప్పున యూనిట్లను షేర్చేసుకోవాలంటున్నారని చెప్పారు. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరికి వస్తే వాళ్లే తీసుకుంటారని, ప్రభుత్వమే గ్రామంలో మిగిలిన వారందరికీ దళితబంధు మంజూరు చేయాలని డిమాండ్‌చేశారు. బీఆర్ఎస్లో మొదటి నుంచి ఉన్న దళితుల కుటుంబాలకు ప్రయోజనం దక్కుతలేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యతను ఇస్తున్నారని, తమను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇది వరకే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు తీసుకున్న వారికి, అసైన్డ్ భూములు పొందిన వారికి దళిత బంధు స్కీమ్‌లో తొలి ప్రాధాన్యతను ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం కురుస్తున్నా రాస్తారోకో కంటిన్యూ చేయడంతో రెండు వైపులా భారీగా ట్రాఫిక్ జామయ్యింది. దీంతో మహబూబాబాద్రూరల్ఎస్సై రామ్‌చరణ్ అక్కడికి వచ్చి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.