
- సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు ప్రకటనపై బండి సంజయ్
- దళితులకు మూడెకరాల భూ పంపిణీ ఏమైంది?
- 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎక్కడ?
- కేసీఆర్ మోసాలను దళితులు మరిచిపోరు
హైదరాబాద్ : అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే మారుస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వీడియోలు బయటపడటంతో ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందుకు అంబేద్కర్ పేరును సెక్రటేరియట్‌కు పెడుతున్నట్లు ప్రకటించారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. అంతేతప్ప అంబేద్కర్‌పై ప్రేమతో కానేకాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టడం మంచి నిర్ణయమేనని, అయితే దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ‘‘ముందు దళితుడ్ని సీఎం చెయ్. కొత్త సెక్రటేరియట్లో సీఎం కుర్చీలో దళితుడ్ని కూర్చోబెట్టు” అని డిమాండ్ చేశారు. నాలుగో రోజు పాదయాత్రలో భాగంగా గురువారం సంజయ్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ చెప్పిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఎక్కడికి పోయిందని నిలదీశారు. అంబేద్కర్ స్మృతి భవనం జాడ ఏమైందని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ హామీ ఏమైందన్నారు. కేంద్రంలో12 మంది దళితులకు మంత్రి పదవులు ఇచ్చారని, దళిత వ్యక్తిని రాష్ట్రపతిని చేయడంతోపాటు ఏటా 1.25 లక్షల మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్న ఘనత మోడీ సర్కార్ దేనని తెలిపారు. దేశంలో బీజేపీ సర్కార్ దళితులకు ఎంతో చేసిందని, మరి ఇక్కడ కేసీఆర్ దళితులకు ఏం చేశారో చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టే విషయంపై తమకు ఇక్కడి నుంచి వచ్చిన విజ్ఞప్తులను కేంద్రానికి తెలియజేశామన్నారు. అంబేద్కర్ నామస్మరణ చేసినంత మాత్రాన కేసీఆర్ చేసిన మోసాలను దళితులు మరిచిపోరని పేర్కొన్నారు.
ఎనిమిదేండ్లలో సెప్టెంబర్ 17ను ఎందుకు జరపలే?
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అమిత్ షా నేతృత్వంలో హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ లో అధికారికంగా శనివారం నిర్వహిస్తున్నామని బండి సంజయ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ బలగాల పరేడ్ ఉంటుందని, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. శుక్రవారం స్ఫూర్తి కేంద్రాలను సందర్శిస్తామని, శనివారం ఉదయం 8 గంటలకు అందరూ పరేడ్ గ్రౌండ్స్ కి రావాలని సంజయ్ కోరారు. కేంద్రం ప్రకటించిన తర్వాతే... కేసీఆర్ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని జరుపుతానని ప్రకటించారని పేర్కొన్నారు. ఎంఐఎంను సంతృప్తి పరచడానికే ఈ ఉత్సవాలను కేసీఆర్ జరుపుతున్నారని దుయ్యబట్టారు. ఎనిమిదేండ్లలో ఎందుకు సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపలేదని కేసీఆర్‌ను నిలదీశారు. ‘‘సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన సైనికుల శక్తినే ప్రశ్నిస్తున్నరు.. వాటికి ప్రూఫ్స్ కావాలంటరు.. హిందువుల కోసం ప్రశ్నించే వాళ్లను జైల్లో పెడుతున్నరు. దాడులు చేయిస్తున్నోళ్లే మళ్లీ జాతీయ సమైక్యత గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది” అని కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు తెలంగాణ బిడ్డలు పడుతున్న బాధలను చూసి చలించిపోయి విముక్తి కల్పించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ను మనం గుర్తుంచుకోవాలన్నారు. పాత చరిత్రను తెరమరుగు చేయాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం జరిపితే సంతోషించేవాళ్లమన్నారు.